మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా  వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా
  వానతో పాటుగా వలుపొచ్చేనమ్మా

  సెట్ల కురులమీద బొట్లు బొట్లు రాలి
  గట్ల బండల  మీద గంధమై పారింది

  కొట్టాము పై వాలి మట్టెంత గడిగింది
  కోడిపుంజు జుట్టు కొంటెగ తాకింది

  దున్నపోతులనేమో దుంకులాడించింది
  గేదె బర్ల మందనేమో సెర్లల్ల ముంచింది   || వానొచ్చెనమ్మా ||

  గద్ద గూటి లోని గడ్డిని తడిపింది
  గువ్వ గూటి గులక రాల్లాను జరిపింది

  తీతువా గొంతును తియ్యగా చేసింది
  పరిగిపిట్ట ముక్కు పాసిని గడిగింది

  ఎద్దు మూపురాన్ని  ముద్దాడి  మురిసింది
  ముళ్ళు గర్ర ఒళ్ళు సల్లాగ  జేసింది

  కొత్త నీటితో వచ్చి కోనేట్ల జేరింది
  పచ్చని  నాసును పగుల జిరేసింది

  శేప కేమో నీటి పులుపును తాపింది
  కొంగకేమో విందు కోరిక రేపింది

  కప్పల పండుగ కండ్లార జూసింది
  తాబేలు పెండ్లికి తలనీరు పోసింది     || వానొచ్చెనమ్మా ||

  ఎర్ర భూముల నెర్రెలన్నీ పూడ్సినాది
  రేగడి నేలను మాగాణి జేసింది

  తువ్వ గడ్డలల్ల వాన కవ్వాతు జేసింది
  సౌడు బూల దాకి దౌడు దీసినాది

  పొంగేటి కల్లులో పోసింది సన్నీళ్లు
  ఈత సెట్టు లొట్టి మూతిని గడిగింది      || వానొచ్చెనమ్మా ||

  తాన రాక ముందు తూనీగలా  లేపి
  తన పాటకే తాను  దరువేసి ఆడింది

  తెల్ల మల్లెను గడిగి తెల్లగ్గ జెసింది
   ఎర్ర మల్లెను గడిగి ఎరుపునే పెంచింది

  తులసమ్మ దీపము షిప్ప లో జేరింది
  నీరెండ పలుపుకు నిగనిగ మెరిసింది     || వానొచ్చెనమ్మా ||

  పారాడి  పారాడి  గోదారిలో గలిసి
  సీతమ్మ పాదాలు శిరసొంచి తాకింది

  వొకలు డొంకలు వనములెల్ల దిరిగి
  కృష్ణమ్మ ఒడిపోయి ఇష్టంగా ఒదిగింది

  దుందుభి తాలకంకి దుమ్మంతా గడిగింది
  అందమైన ఇసుకను అద్ధంల  జేసింది

  ఇష్టముందో  లేదో పట్నానికొచ్చింది
  ముక్కు మూసుకొని మూసిల మునిగింది      || వానొచ్చెనమ్మా ||


 • You might also like