మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • కొమ్మ చెక్కితే బొమ్మరా... తెలంగాణా గ్రామ దేవతల పాట

  కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా

  రచన : అందె శ్రీ

  కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా
  ఆదికే ఇది పాదురా కాదంటె ఏదీ లేదురా॥ 2 ॥
  జాతి గుండెలో జీవ నదముల జాలువారే జానపదముల
  గ్రామమును కాపాడ వెలసిరి గ్రామ దేవతలెందరో

  ॥ కొమ్మ చెక్కితె ॥

  గూడుగట్ట గుహలనొదిలీ గుండె రాయి జేసుకున్నారు
  కండలను కరిగించి కన్న కలలను పండించుకున్నారు॥ 2 ॥
  సేదదీరి మనసులోన శక్తి ఏదో ఉన్నదనుకొని
  భక్తీ యుక్తులు ధారపోయగా ముక్తి నొసగ శక్తి బుట్టె

  ॥ కొమ్మ చెక్కితె ॥

  కన్న తల్లిని పరశురాముడు కాని కష్టాలెన్నో బెట్ట
  ఇంటి ఇంటికి బోయి నను  కాపాడమని కన్నీరుబెట్ట ॥ 2 ॥
  ఎల్లరు కాదంటే మాదిగ ఇంటి లందల్లోన దాగి...
  సబ్బండ జాతులు కొలువ పల్లెల  కులముల ఎల్లమ్మ బుట్టె

  ॥ కొమ్మ చెక్కితె ॥

  పల్లె సీమలు పచ్చగుండా ఊరు వాడా సిరులు నిండా
  ఎటికడ్డము నీటి నిలువా  కట్టడాలకు కాపు తానై ॥ 2 ॥
  చెరువు కుంటలే కాదు బతుకు దెరువు కోసం ఏది జేసినా
  మానవుల నమ్మకములో మైసమ్మ పురుడు వోసుకున్నది

  ॥ కొమ్మ చెక్కితె ॥

  భాష మీద దాడి చేస్తిరి బతుకు మీద దాడి జేస్తిరి
  భరత జాతిని తరతరాలుగా బహు విదాల బాధ పెడితిరి ॥ 2 ॥
  ఎవరి నమ్మకాలు వారివి ఎక్కిరించే హక్కు లెక్కడివి
  అగ్గికి చెధలెట్ల  బడుతది నిగ్గదీసి అడుగుతున్న

  కొమ్మ చెక్కితె బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా
  ఆదికే ఇది పాదురా కాదంటె ఏదీ లేదురా॥ 2 ॥ • You might also like

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి