Full width home advertisement

Post Page Advertisement [Top]


చిన్నతనం నుంచి పాట మీదున్న ఆసక్తి ఆయనను కలం పట్టేలా చేసింది. లైబ్రరీ సినిమాల వల్ల అబ్బిన సాహిత్యం, కళాత్మకత ఆయనను వెన్నుతట్టాయి. సంగీత దర్శకుడు చక్రితో పరిచయం పాటతో బంధాన్ని పెనవేసుకునేలా చేసింది.
మానుకోటలో మొదలైన పాటల ప్రయాణం సినిమా రంగం వైపు నడిపించింది. మళ్లి కూయవే గువ్వ అంటూ వేసిన తొలి అడుగే ప్రశంసల జల్లు కురిపించింది. ఆ జల్లు నుంచి పుట్టిన ఉత్సాహంతో వేలాది పాటలు వెండితెరమీద పూయిస్తున్నాడు కందికొండ.
 మళ్లికూయవే గువ్వా- మోగిన అందెల మువ్వా తుళ్లిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా Kandhikondaఇప్పటికీ శ్రోతల ఆదరణ పొందిన ఈ పాట కందికొండ రాసిందే. చక్రిని కలవడానికి వెళ్తూ రాసుకుని జేబులో పెట్టుకున్న పాట పూరీ జగన్నాథ్‌కు నచ్చి ఇట్లు శ్రావణి సుబ్రమణ్యంలో పెట్టారు. సాంగ్ హిట్ అయింది. పాటే సినిమా రంగంలో కందికొండ తొలిపాట కావడం విశేషం.

కందికొండగా సినీ ప్రపంచానికి సుపరిచితమైన ఆయన అసలు పేరు కందికొండ యాదగిరి. పుట్టి, పెరిగింది మానుకోట జిల్లాలోని నర్సంపేట మండలం నాగుర్లపల్లి అనే చిన్న గ్రామం. తండ్రి సాంబయ్య, తల్లి కొమురమ్మ. పేదకుటుంబంలో పుట్టిన ఆయన ప్రాథమిక విద్య సొంతగ్రామంలోనే చదివినప్పటికీ హైస్కూల్ చదువుకోసం నర్సంపేటకు వెళ్లాల్సివచ్చింది. హాస్టల్‌లో ఉంటూ చదువుతున్న సమయంలోనే ఆయనలోని కవి, రచయిత మేల్కొన్నాడు. చదువుకుంటూనే రోజూ లైబ్రరీకి వెళ్లడం, సినిమాలు చూడడం చేసేవాడు. ఆ రెండింటి వల్ల సాహిత్యం, కళాత్మకత అబ్బాయంటాడు కందికొండ. ఆ తరువాత ఇంటర్‌కోసం మానుకోట (మహబూబాబాద్)కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ సంగీత దర్శకుడు చక్రితో పరిచయం అయ్యింది. ఇద్దరికీ పాటల మీదున్న పట్టుతో సాహితీ కళాభారతి అనే సాంస్కృతిక సంస్థకు రూపకల్పన చేశారు. చక్రి హైదరాబాద్ వచ్చాక కందికొండ అడుగులు కూడా అటువైవే పడ్డాయి. మళ్లి కూయవే గువ్వా తర్వాత ఇడియట్ సినిమాకు పాట రాసే అవకాశం వచ్చింది. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని గుల్లచేసి జారకే మెరే హాయ్ అంటూ నిందాస్తుతిలో రాసిన పాట సూపర్ హిట్ అయ్యింది. ఇలాంటి పాటలను ప్రవేశపెట్టిన తొలి రచయిత కందికొండనే. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన ఇడియట్ కోసం కందికొండ రాసిన ఈ మెలోడీ పాట ఇప్పటికీ ప్రేమికుల హృదయాల్లో గిలిగింతలు పెడుతూనే ఉంది. చెన్నై చంద్రమా మనసే చేజారే చెన్నై చంద్రమా నీలోనా చేరే అంటూ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కోసం రాసిన మెలోడీ ఆయనలోని టాలెంట్‌ను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసింది. 2006లో చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమా కోసం కందికొండ రాసిన పాట ఆయన గత పాటలకు భిన్నంగా సాగింది. ఐ ఒన్నా స్పైడర్‌మేన్ ఐ ఒన్నా సూపర్‌మెన్ నాకే కావాలి దాసోహం హిందీ, ఇంగ్లీష్, తెలుగు మూడు భాషలను మిక్స్ చేస్తూ రాసిన ఈ పాట అప్పటి వరకు వస్తున్న పాటల ఒరవడిలో కొత్త తనానికి తెరతీసింది. ప్రభాస్ హీరోగా నటించిన చక్రం సినిమా కోసం కందికొండ రాసిన సోని సెల్ పోన్ పీసా.. దిల్‌లోకి నిప్పుల వీసా సోని సైకిల్ స్పీడ్ నే చూశా పాటలో మనకు ఎక్కువగా ఇంగ్లీష్ పదాలే తారసపడుతాయి. అయినప్పటికీ పాట వినసొంపుగా ఉండి ఆకట్టుకుంటుంది. పాటల్లో కొత్త పదాలు ప్రవేశపెట్టడంలో కొత్త ఒరవడి సృషించారు కందికొండ. మున్నా చిత్రం కోసం కందికొండ రాసిన పాట నాటికి నేటికీ ఆకట్టుకునే అమృతగీతం. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా వంటి ఎన్నో పాటలకు ప్రాణం పోసిన రచయిత కందికొండ. మనసనేది ఎక్కడుంటుందో తెలిస్తే మనసుతో మనసే ఏదో విషయం చెప్పాలనుకుంటుంది.. అంటూ ప్రేమలో పడిన యువకుడు పాడుకుంటాడు. ఇదే చిత్రంలో భగభగమండే ఈ సూర్యుడు నేలకు నేరుగా అథితిగా వచ్చే ఓ నిప్పులా వర్షం తీరుగా.. అంటూ మరో పాటను కూడా కందికొండ రాశాడు. కందికొండ ఫలానా పాటే రాయగలడు అని ఎక్కడా ముద్ర పడకుండా అన్ని రకాల నవరసాలను పండించే పాటలు రాయడంలో ఆయన విజయం సాధించారు. బుజ్జిగాడు చిత్రంలో ఆయన మూడు పాటలు రాశారు. మూడు కూడా దేనికవే ప్రత్యేకమైనవి. అందులో గుచ్చిగుచ్చి గుండె పిండినాదిరా- నచ్చినచ్చి కౌగిలిచ్చినాదిరా మెచ్చి మెచ్చి నేను వచ్చినానురాతో పాటు మెత్తగుంటే చలే చలే-మత్తేక్కించే గోలగోల అంటూ సాగే పాటల్లో ప్రాసలతో ఆకుట్టుకున్నారు. చిరుత సినిమాలో ఇన్నాళ్ల దూరం గుండెల్లో గాయం అయింది బంధం అనే బ్యాక్‌గ్రౌండ్ పాటను ఆయన కేవలం విజువల్స్ చూసి రాశాడంట. అందులోనే కన్నీటి వానా నీ కలల్లోనా చిన్నారి కన్నా ఎడారిలోనా మరో సెంటిమెంట్ పాట కూడా కందికొండ కలం నుంచి జాలువారిందే. టెంపర్ సినిమాలోనే నిన్ను చూసి పడిపోయా ఆన్‌ది స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ పాట కందికొండ రాసిందే. తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు వేయికి పైగా పాటలు రాసి తన సత్తా చాటాడు కందికొండ. ఆయన భార్య రమాదేవి. కొడుకు ప్రభంజన్, పాప మాతృక. కొడుకుకు ఫియానో వాయించడంలో అనుభవముంది. కందికొండ ఉస్మానియా యూనివర్సిటీలో ఎం. ఎ (తెలుగు లిటరేచర్), ఎం.ఎ. పొలిటికల్ సైన్స్ చేశారు. తెలుగు సినిమాలలో సన్నివేశ గీతాలు అనే అంశం మీదా పిహెచ్‌డీ చేశారు. తన చాలా పాటలకు ప్రాణం పోసింది చక్రియేనని, తానింతటి వాడు కావడానికి తనను ప్రోత్సహించింది చక్రినేనని వినమ్రంగా చెప్పుకుంటాడు కందికొండ. ఎల్లలు లేని తెలుగు సాహిత్యంలో ఎన్నో అద్భుత పాటలను తెలుగు సినిమా రంగానికి అందించిన కందికొండ మాస్, మెలోడీ, లవ్, ఎమోషనల్, ప్రత్యేకగీతాలు ఇలా ఏ పాటనైనా అవలీలగా రాయగలడు. పల్లె ప్రకృతిని ఎంత చక్కగా వర్ణించగలడో ఆధునిక సాహిత్యాన్ని అంతే గొప్పగా రాయగల రచయిత కందికొండ. MUNNA గల గల పారుతున్న గోదారిలా జలజల జారుతుంటె కన్నీరలా అంటూ పోకిరి చిత్రం కోసం కందికొండ రాసిన ఈ పాటను హమ్ చేయని సగటు ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాలోనే జగడమే.. జగడమే.. నా కనులను సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే అంటూ సాగే పాట కూడా కందికొండ రాసిందే. కందికొండ కేవలం పాటలు రాయడమే కాదు. కవిత్వం రాయడంలోనూ ప్రతిభను ప్రదర్శిస్తాడు. అందులోనూ తెలంగాణ యాసలో మనసుకు హత్తుకునేలా కవితలు, పల్లె బతుకులు, మట్టి మనుషుల కష్ట సుఖాలను కథలుగా రాయడంలోనూ ఆయనకు పట్టుంది. గతంలో ఆయన రాసిన భూలచ్చుమమ్మ కథ బతుకమ్మలో ప్రచురితమైంది. ఇప్పుడు అదే పేరుతో కథల పుస్తకాన్ని తీసుకురానున్నారు. అలాగే తను రాసిన కవితలతో ఓయూ.. మా అవ్వ పేరుతో కవితా సంపుటి కూడా తీసుకురానున్నట్లు తెలిపారు. బీసీల హక్కుల మీద ఆయన రాసిన పాటలను ఇటీవలె ఓయూ క్యాంపస్‌లో ప్రత్యేకంగా చిత్రీకరించారు. కందికొండ రాసిన బతుకమ్మ పాటలు కూడా ప్రేక్షకుల మదిని గెలుచుకున్నాయి. 2015లో రాసిన చిన్ని మా బతుకమ్మ చిన్నారక్క బతుకమ్మదాది మా బతుకమ్మ దామెర మొగ్గల బతుకమ్మ.. పాటను యూట్యూబ్‌లో 70 లక్షలమందికి పైగా వీక్షించారు.అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాసినమాది తెలంగాణ జాతి- మా నరనరాన ఉన్నది నీతి పాటను 8లక్షలమంది 2016లో బతుకమ్మ పండుగ సందర్భంగా వీ6 చానల్ కోసం రాసిన కోలోకోలోకోల్ కొమ్మ కూసే కోల్ చుక్కపొద్దుకే కోల్ పల్లె లేచే కోల్ కూడా విస్త్రత ప్రచారం పొందింది. సత్యం సినిమాలో జనాన్ని ఉర్రూతలూగించిన మాస్ గీతం ఓరి దేవుడా కాలం మారదా అనే పాట పబ్‌లు మొదలు మారుమూల ప్రాంతాల్లోని పెళ్లి బరాత్‌లలోనూ ఒక ఊపు ఊపిన పాట. ఈ పాట విని అక్కినేని నాగేశ్వరరావు సైతం కందికొండను ప్రత్యేకంగా అభినందించారు. దేశముదురులో హీరో తను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుపుతూ పాడే గీతం నిన్నే నిన్నే నిన్నే నిన్నే దిల్ సే దిల్ సే ఇష్క్ కియా తుమ్‌సే వాయే వాయే రాయే రాయే.. ఎంతటి సూపర్‌హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

Bottom Ad [Post Page]