Full width home advertisement

Post Page Advertisement [Top]

గోరటి వెంకన్న పల్లె కన్నీరు పెట్టిన వైనం రాసిండు. కనిపించని కుట్రల అని అపూర్వంగా రాజకీయ కవిత్వాన్ని రాసిండు. అందె శ్రీ  మాయమైపోతున్న మనిషి గురించి ఆలపించిండు. మహోన్నతంగా అమానుషత్వాన్ని విమర్శకు పెట్టిండు. ఆ ఒరవడిలో మరింత విస్తతిలో వరంగల్ శ్రీను ఒక పాట రాసిండు. అది కూడా పల్లెమీదనే. ఇందుల తాను మనల్ని నిందించకుండనే పల్లెను పోగొట్టుకున్న అనాథ గురించి విలపిస్తడు. కళ తప్పిన పల్లెను, శిన్నబోయిన పల్లెను ఎట్లెట్లె ఉండెనో ఎన్కకెన్కకు పోయి చెబుతడు. సుదీర్ఘమైన పాటను రచించి యావత్ తెలంగాణ అదశ్యమైన వాణిని చరణ చరణాలుగా చలనచిత్రం వోలె చూపిస్తడు. ఆ లెక్కన ఇదొక విస్తరణ. విచారమే అయినా వాస్తవిక విస్తరణ. ఈ వారం కవి సమయం ఈ పాట గురించే

విచారణ ఎందుకంటరా? తప్పదు మరి. తలకాయ కొట్టుకుంట రాసిన కవిత ఇది. పిచ్చోని లెక్క వగచి రాసిన కవిత ఇది. మనల్ని మనం నాశనం బట్టించుకుని దేవులాడుతున్న స్వయంకతాపరాధం నుంచి వెల్లడైన ఆత్మవిమర్శనాత్మక మహాకావ్యం ఇది.

తరతరాలుగా ప్రజల నాలుకల మీద ఉన్న నుడికారాలు, పలుకుబడులు పాటలోకి తెచ్చి తెలంగాణ సారస్వతాన్ని సంపద్వంతం చేసిన ప్రతిష్ట ఇప్పటికే వరంగల్ శ్రీను మూటగట్టుకున్నడు. ఈ పాటతో ఇప్పుడు పల్లెటూరుకు పయణం కట్టమంటున్నడు. అయితే ఇప్పుడా పల్లె లేదని కూడా మనవి చేస్తున్నడు. అదీ ఈ కవి సమయం విశిష్టత. మనల్ని ఆగం చేయడం కాదు, ఆల్రెడీ ఆగమైనమని హెచ్చరించే కవి ఇతడు.

నిజానికి తాను బొడ్డు శ్రీనివాస్. ఓరుగల్లు ముద్దుబిడ్డ. ఆత్మకూరు మండలం తక్కళ్లపల్లి గ్రామస్థుడు. ములుగులో సమాచారాశాఖలో చిరుద్యోగి. తల్లి లింగమ్మ. తండ్రి నర్సయ్య. ఇది పరిచయం. కానీ, తాను తయ్యుం దత్తయ్యుం తయ్యుం దత్తయ్యుం అన్న బంజారా గీతంతో ప్రసిద్ధుడు. తెలంగాణ ఉద్యమంలో తానొక దీపారాధన. ధూం ధాం వేదిక మీద పిల్లలు నెత్తిమీద దీపాలు పెట్టుకుని తెలంగాణ తల్లీ నీకు నిండు దీపాలు అని ఆడుతుంటే, తాను పాడుతుంటే అదొక ప్రదర్శన. తెలంగాణ తల్లి మురిసిపోయే ఆనంద పారవశ్యం. చెబితే మస్తు బాణీలుంటయి, పాటలుంటయిగని, మొత్తంగా తానొక ఇసుర్రాయి. తల్లి జొన్నలు పోసి తింపే ఇసుర్రాయి. అక్కడ తొలి పాట విన్నడు. ఇక తానే పాటల విసుర్రాయి అయిండు. మనల్ని గిరగిర తింపుతున్నడు. నిజానికి తెలుగుతో పాటు బంజారా, అస్సామి, ఒరియా, కోయ, గోండు ఇంకా చాలా భాషల్లో తాను కవి, గాయకుడు. నిజ అర్థంలో!

మనం చర్చించే పల్లె పాటలో తాను ఏడు తంతెలు అంటాడొక చోట. ఆడిబిడ్డల్ని ఇంటికి పిల్చుకోవడం గురించి చెబుతడు. ఈ చరణాలు విన్న ఒక జర్నలిస్టు సోదరుడు తన అక్కచెల్లెండ్లను పిలుచుకుని చీరరైకలు పెట్టి పంపిండట. అవును మరి. మరచిపోయిన మనిషిని అనుబంధాల సరాగం చేసే పాట తాను. చిత్రమేమిటంటే, ఈ పాట ఒక పేన్. మరచిపోయిన నిజాన్ని చెప్పే బాధామయం. ఎనకటి ప్రేమలు పోయి పగలు పంతాల పట్టింపుల రోజులొచ్చినై అని యాది చేసే పాట. వింటుంటే అక్కాచెల్లెండ్ల నుంచి ఇంకా పెరుగుతం. ఏడు తంతెలు దాటుతం. పల్లెను మొత్తంగా అలుముకుంటం. అయితే రోడ్డు పడ్డంక అడ్డ బాటలు లేవు. చెట్లు లేవు. శెట్లు శేఁవలు లేక పల్లెలన్నియ్యాల శిన్నబోయి కూసున్నయని చెబుతున్నడు. ఈ పాట వింటుంటే, నిజంగానే దూరం పోయి ఏడు తరాల నవల రూట్స్‌ను ఇంకో తరీఖ చదివినట్టు ఉంటుంది. తాను తవ్వుకుంట తవ్వుకుంట వోతుంటె అదొక ఎడతెగని ముచ్చెట. యాది, మందులేని మనాది. కానీ అవసరం. మనల్ని మనం మళ్ల తెలుసుకోవడానికి, తేజాబ్‌తో కడుక్కోవడానికి, పునరుజ్జీవనం అంటే ఎంత ఎన్కకు పోవాల్నో సుద్రాయించడానికి ఈ కవి సమయం ఒక అనివార్యం.

తనను భరించడం కష్టమే కావచ్చు. ఎందుకూ అంటే స్వయంగా తానూ మన వలే ఒక విక్టిం కనుక. సినిమాకు, ఆంధ్రప్రదేశ్‌కు బలైన వాడూ కనుక. అయితే తాను కవి కూడా కనుక తనను తాను విమర్శించుకుంటడు. అన్ని మాయాజాలాలను బద్దలు కొట్టే అంతర్వాణి అవుతడు. అందుకే తనను మోయడం చాలా కష్టం. ఎందుకంటే, అది ఆఖరికి మన మీదికే వచ్చినా వస్తది కావచ్చన్న భయం వల్ల. నిజమే. వరంగల్ శ్రీనివాస్ అచ్చమైన తెలంగాణ వాడు. గొల్లాయన. తన గొర్ల మందకు పశువుల కాపరి ఉండి కూడా లేకుండా పోయిండన్న స్పహ ఉన్న వాడు. ఆ నిస్పహను వ్యక్తం చేయడానికి వెనుకాడని వాడు. కోపగొండి. అలక్ష్యడు. క్రియేటివ్. ఇవన్నిటితో పాటు తాను సెంటిమెంటలిస్టు. సానుకూల ప్రయోగంగా తన కవిత్వం ఒక సెంటిమెంట్.

తెలంగాణ వాళ్లం సెంటిమెంటల్‌గా ఉంటం. కానీ ఉద్యమ సమయంలో అంతకన్నా బలమైన వాదం కోసం, సిద్ధాంతం కోసం సెంటిమెంట్‌ను మనం తక్కువ చూసినం. కానీ, ఇప్పుడు సరిగ్గా చూస్తే, తన దష్టిలో ఇదంతా ఒక సెంటిమెంట్. కవిత్వం ఒక అపూర్వమైన అనుబంధం. అవశ్యమైన పదబంధం. కాంటా బాట్లూ లేని కాలం లోకి వెళ్లి ఆ పాటలో ఉండగా అభివద్ధి పేరిట మనం నాగరీకులమై కోల్పోయినవన్నీ, ఆ పాటతో పాటు ఎరుకలోకి తెచ్చుకుని నిస్సహాయంగా మిగలడం, ఇదొక విషాదకరమైన అనుభవం.
నిజానికి ఒక అరెస్టింగ్ వ్యవహారం ఉంది తనలో. ఇది నాదే అంటడు. అది నాదే అంటడు. ఆ పాట బాణి ఎవరిది? అంటడు. ఈ పాటలోని పదం గుర్తు పట్టిండ్రా? అంటడు. ప్రసంగాల్లోని బొంత పురుగు ఎక్కడిదంటడు. ఇదంతా సెంటిమెంటల్ ఫూల్ అని కొట్టి పారేసే విషయం కాదు. తాను అలా అనడంలో ఒక వాస్తవం ఉన్నది. తాను నూటా పదేండ్లు బతికిన తాత దగ్గర కూచుండి విన్నడు.

యాభై ఏళ్ల పల్లెను విన్నడు. అటెన్క ఆ తాతే తన తండ్రి యాభై ఏండ్ల పల్లె కథ చెప్పింది మళ్లీ తనకు అప్పజెప్పిండు. ఆట్లా విన్నడు. మొత్తంగా వందేండ్ల కథ విన్నడు. వ్యధార్థ గాథ విన్నడు. ఆదే తన కవిత్వంలోకి వచ్చింది. ఒక్క తాత నుంచి కాదు, వందలాది తండ్రులు, తాతలు, అమ్మలు అమ్మమ్మలను విన్నడు. వినడమే కాదు, తానంటాడు- ఒక తోడేలు మంద మీద పడి గొర్రెను నోట కర్సుకున్నట్టు- ఇతను పల్లెల మీద పడ్డడు. తండాల మీద పడ్డడు. ఎన్నింటినో నోట పట్టుకచ్చిండు. తన కంఠంలో ఇమడ్చుకున్నడు. అవన్నీ పాటలుగా రాశిండు. ప్రజల బాణీలకు వైభవం తెచ్చిండు. కానీ, పల్లెమీద రాసిన పాట మాత్రం కంఠం కాదు, అది కడుపు. తల్లి కడుపు. పాట పురుడు. దాన్ని పేనిండు. అట్లా బొడ్డు శ్రీను వందలాది చరణాలయిన వైనమే నూరేండ్ల మా ఊరు పాట.

తన పర్యటనలో ఒకానొక రోజు చిన్నబోయిన పల్లె తారస పడిందట. అంతే. ఇక మొదలైందన్నడు పాట. ఏటూరు నాగారం- తాడ్వాయి నడుమ ఈ ఊరు బోర్డును చూడగానే ఓ యమ్మ&నా పల్లె సీమా..ఈనాడు ఎందుకింత శిన్నబోయే అని ఆలాపనగా తట్టింది. ఇక తవ్విన అన్నడు శీను.

ఈ పాటలో- ఒక జానపద కళాకారుడి మాదిరి పునరావతం కాకుండా ఎన్నో విషయాలను కై కట్టడం వల్ల ఒక సుదీర్ఘ కవిత్వం అయిండు తాను. ఆ లెక్కన అతడి కవి సమయం ఈ వారం ఒక బ్యూటీ. అందం. ఎందుకంటే ఇన్నాళ్లూ కవి సమయంలో వచ్చిన అనేక పాటలు పరపీడనను ఎండగట్టిన ప్రాధాన్యం ఉన్నవే. కానీ, ఈ వారం వరంగల్ శ్రీను రాసిన పాట ఒకటి సరికొత్తది. ఇది తాను ఐదేళ్లుగా రాస్తున్నదే. రసమయి బాలకిషన్ ధూం దాంలో పాడిందే. కాకపోతే అనేక వేదికల మీంచి ఈ పాటలోని పది చరణాలు ప్రజల్లోకి పోయినయి గని మొత్తం ఆ పాట 256 చరణాలు గలది. (త్వరలో పుస్తకం, సీడీ రూపంలో రానున్నది) అయితే, ఇంత పెద్ద పాట పుట్టడం తెలంగాణ ఉద్యమ విజయమే అనేకన్నా ఆ ఉద్యమం నిదానంగా కంటున్న పునరుజ్జీవన కాంటెక్స్ అనడం మరింత సబబు. ఆ లెక్కన వరంగల్ శ్రీను రాసిన గొప్ప పాటలన్నీ పక్కకు పెట్టి ఈ పాటను ప్రధానంగా చర్చించవలసే ఉంది. ఎందుకంటే ఇది పునరుజ్జీవన కవిత్వం.

ఓయమ్మ నా పల్లె సీఁవా ఈనాడు... ఎందుకింత శిన్న బాయే... దేవ... ఎనకటి కల దప్పినాదోయ్ నా పల్లె... ఎటుగాని తీరయ్యినాదో అంటూ సాగే ఈ పాట గుండెల్ని మెలితిప్పుతూ సాగి నిదానంగా మనల్ని వెనక్కి వెనక్కి నడిపిస్తూ సకల జనులూ తమ సంస్కతి, సంప్రదాయాలతో , కట్టుబొట్టు తీరుతెన్నులతో కానబడి, ముఖ్యంగా కులవత్తులు, పనిపాటలు, అలంకరణలతో నిండైన మూర్తిమత్వంతో నడయాడిన రోజులకు, ఆ రోజులన్నీ పోయిన వైనానికి మధ్య అటూ ఇటూ తిరుగుతూ మనల్ని ఎంత దెబ్బతిన్నమో, ఎంత ఎల్లెలుకల పడ్డమో చెప్పే సుదీర్ఘ కవిత. అవును. మన దీర్ఘ కవితల గురించి విన్నంగని ఇది సుదీర్ఘ కవిత, గొలుసు చెరువుల కవిత్వం- గానం.

పురుగు బూషి మనిషిల ఆవరణం.
ఇక్కడొక చరణం చూద్ధాం. నిజానికి పాటలోని ప్రతి చరణమూ ఒక వివరణ. అందులో గతం ఉంటుంది. దేన్నీ తెంపలేం. చివర్లో వర్తమానం పట్ల వెగటు ఉంటుంది. విచారం ఉంటుంది. అంతా చిన్నగానే మొదలవుతుంది. అచ్చగాండ్లగ్గాని బుచ్చగాండ్లగ్గాని&దాన ధర్మాలకు మా పల్లెకే పేరు&అదలు బదలుగ్గాని అప్పు సప్పుగ్గాని&గవాయి సువ్వీదు కాయిదంతో పనిలేదు&కదరుగా బతికేది కనిపెట్టి తిరిగేది&అబద్ధాలకు ఎడతావు లేకుండేది&.నీతిమంతులమన్న పేరు మాకుండేది&నోటి మాట మీదే పని జరుగుతుండేది అంటూ మన తెలంగాణ రీతి రివాజును, జీవన తాత్వికతను వివరిస్తడు కవి. అట్లే, ఇచ్చుకున్నోడు ఈగైతె ఈనాడు&పుచ్చుకున్నోడు పులిగదరా అంటూ వర్తమానంలోకి వస్తడు కవి.

తిరిగి ఎటుబొయ్యి వచ్చిన వాకిట్ల గోలెంల&నీల్లతోటి కాల్లు కడిగింట్ల కెల్లేది&విలువైన పనిముట్లు దాసుకోవాలన్న&ఇంటిలోన పెద్ద అటుకు మాకుండేది&టంగువార్లూ పనకుచ్చలూ దుత్తలూ&కణాలూ మూగలూ, గజ్జెలూ పగ్గాలు&గొర్రు, దంతె, నాగడీ, కాని, గుంటుక అంటూ క్రమక్రమంగా మనం మరచిపోయినవి, పోల్చుకోలేనివి కవితలోకి తీసుకొస్తడు. అట్లా కై గడుతూ, చివరాఖరికి, ఎనకటి కల దప్పినాదోఁ నా పల్లె&ఎటుగాని తీరయ్యినాదోఁ&వోయ్ రాఁవ& అంటూ కరుణ రసాత్మకంగా మన హదయాలను పిండుతాడు. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇట్లా పాటలోని ప్రతి చరణం రెండు మూడు దినాలు గనుక విన్నమంటే, మనం తప్పకుండా మళ్లీ పల్లె ప్రమాణంగా జీవితాలకోసం ప్రణాళికలను రచిస్తం.

ముందే చెప్పినట్టు ఈ పాట 256 చరణాలు ఉంటది. పల్లవి నాలుగు లైన్లు ఉండగా ప్రతి చరణం పదిలైన్లు తప్పక ఉంటుంది. చాలా సార్లు పన్నెండు లైన్ల దాకా ఉంటుంది. చరణం చివర్లో మళ్లీ పల్లవి ఎనకటి కల దప్పినాదో నా పల్లె అని రాగానే గుండె కలుక్కుమంటుంది, ప్రతి సారి కవి కైగట్టే కొత్త చరణాల ద్వారా. వాటిల్లోంచి జీవితాలను కళ్లారా దర్శింపజేయడం వల్ల ఈ యాదికి మనాది ఉన్నదా లేదా అన్న చింత కూడా పట్టుకుంటది. అయితే అచ్చమైన జానపదుడిలా మందు లేదు అంటడు. అలా అనడంలో ఒక నిర్లిప్తత. పోగొట్టుకున్న మనల్ని మరింత బాధకు గురిచేసి, తిరిగి మేలుకొలుపే తెలివిడీ ఉన్నది. ఇది తన ప్రత్యేకత, కవిత్వ నిర్మాణమూ.

అయితే తన కవిత్వంలో విమర్శ ప్రధానంగా ఉంటుంది. ఉద్యమ సమయంలో రాసిన తన అన్ని పాటల్లో సూటిదనం ఉంటది. ప్రజలు మాట్లాడుకునే మాటలు, విసుర్లు ఉంటయి. బరిబాతల కవిత్వం ఉంటది. ఒక్క మాటలో తీవ్ర విమర్శా ఉంటది. ఆ పాటల విశ్లేషణకు ఇది సమయం కాదుగానీ, మనం చర్చిస్తున్న పల్లె పాట అలవోకగా ఆత్మ విమర్శకు గురిచేస్తది. పాఠకుడు, చదువరి లేదా శ్రోత పాట వింటుంటే ఇంత సంపద్వంతమైన జీవితం యాడవాయె! అని రంది పడతడు. ఎవడిట్ల చేసె! అని తనంత తాను ఆలోచిస్తడు. అయితె అంతకన్నా ముఖ్యం మనకు సోయిలేకుండ పాయెగదా! అన్న విచారంలో పడతడు. కవి వాచ్యంగా ఏమీ చెప్పడు. కానీ వైభవోపేతమైన పల్లె తంత్రులు తెగుతూ ఉంటే అందరమూ ఉండి లేనోళ్లమైనం గదా అన్న రందిని వ్యక్తం చేస్తడు. ఒక రకంగా తెలంగాణ కవిత్వంలో ఇట్లా ఇటీవలి ఉద్యమ సందర్భంలో మనల్ని మనం ప్రశ్నించుకునే తరుణం సుతారంగానే వాచకంలోకి, పాటలోకి తెచ్చిన పాట బహుశా కనబడదు. ఇది ఆ రకంగా గొప్ప కాంట్రిబ్యూషన్.

దీనికి చాలా స్పష్టమైన కారణం ఉంది. వరంగల్ శ్రీను తెలువక ఇది చేయలేదు. తనకు తెలుసు. కానీ చెప్పమంటే చెప్పలేడు. రెండు దినాలు కుస్తీ పడితే ఒకసారి వెళ్లగక్కిండు. అది గూడా తన కవిత్వం లెక్కనే. పాటల్లో ఎట్లయితే సామెతలు కూడా వస్తయో అట్లే తన కవితా నిర్మాణానికి అసలైన భూమికను విడమర్చి చెప్పిండు, మూడు సామెతల్లో. అవును. ఇసంత రమ్మంటె ఇల్లంత నాదంటివి అన్న సామెత. తెలంగాణ గిట్లనే మెసపోయింది గద. వచ్చిన వాడు పూర్తిగా మనల్ని అణచివేసిండు. ఇల్లంత తనదే అన్నడు. రెండు, తిన్నింటి వాసాలు లెక్కవెట్టడం.

నిజమే వచ్చిన వాడు తిన్నది ఇక్కడే. మళ్లీ తిన్న దరగకుండనే మొత్తం లెక్కవెట్టుకుని ఇంట్ల వేసుకునే పనిచేసిండు. ఇదొక సామెత. ఇక చివరది, ఈగ ముక్కుమీద వాలితె ముక్కే గోస్కుంటం అనడం. అయితే, ఈ మూడింటినీ వరంగల్ శ్రీను చెబుతున్నది వేరే కోణంలో. మొదలుగా లేని మన స్పహ గురించి. అసలు వాడిని ఇసంత రమ్మనడమే మన తప్పు అంటడు. అట్లే తినడానికి కూసోవెట్టడమే మలి తప్పు. ఆటెన్క ఈగ వాలిందని ముక్కు గోస్కుంటం అని చెప్పుడుసుత ఎందుకు అంటడు. చేసింది తప్పేనాయె. ఆ తప్పుకు అనుభవిస్తున్నం అంటడు. ఈ అనుభవించడం అన్నది మొత్తం పల్లెను పూర్తిగా దెబ్బతీసిన వైనం నుంచి కై గడతడు తను.

ఎంత బాధతో కవిత్వం చెబుతడూ అంటే ఒక్క మాటలో దుఃఖశిల్లుతడు. ఆ దుఃఖం నుంచి పొక్కిలైన వాకిలి నుంచి వెనక్కి వెనక్కి వెళ్లి సిసలైన దేశీయ కవిత్వాన్ని రచిస్తడు. రూట్స్ అన్నది ఇందుకే. ఒక జాతి మొత్తం పరపీడనలో ఉందని మనకు తెలుసు. అయితే మన స్వయంకతాపరాధం క్షమించరానిదన్న సోయితో కూడి రాసిన కవిత్వం ఇతడిది. మనిచ్చమనం చేసుకుంటున్న విధ్వంసం మీద తిరుగుబాటు ఇది. అందుకే ఈ పాట తెలంగాణ పునరుజ్జీవనంలో చాలా కీలకం అవుతుందనడం. అందుకే ఈ వారం శ్రీను పల్లె పాట- కవి సమయం.

పల్లవి: ఓయమ్మ నా పల్లె సీఁవా ఈనాడు
ఎందుకింత శిన్నబాయే.... దేవ
ఎనకటి కల దప్పినాదోయ్ నా పల్లె
ఎటుగాని తీరయ్యినాదో వోఁయ్ రాఁవ

చరణం : బురద పొలఁవులోన కోటొక్క పాటెత్తి
పూట కారెకురాలు నాటు బెట్టెదమ్మ
కోయిలా గుంపోలె మేఁవఁత గొంతెత్తి
కొండ రాగం దీసి వంత పాడేదమ్మ
ఒక్క తల్లీ పిల్లలోలె సద్దీ బువ్వ
మజ్జ్యానమూ పూట ముద్దలూ దినేది
ఇగ గుత్త నాట్లా మీఁన పుట్టెడొడ్లూ దెచ్చి
పిల్ల జెల్లాతోటి సల్లంగ బతికేది
నాటి కూలీ ఏడబాయే నేడొక్క
పూట కూలీ దొరకదాయే రాఁవ
దప్కలాకూలీ ఏఁవాయే ఈనాడు
దమ్మిడన్నా లేకపాయే సాఁవి
॥ ఓయమ్మ ॥

చరణం : పలుగు రాళ్ళా గాల్చి తువ్వాలలో ఏసి
ఊసబియ్యం వూపిరాల గొట్టేదిరాఁ
దోసిల్ల పిశ్కిల్లు బుక్క నిండా బోసి
రుశిగ బుక్కీ ఆకలీ దీర్చుకునేది
వుత్తెరేణీ బొగ్గు కొప్పెరాతుంగతో
జెక మొకా దూదినీ తయ్యారు జేసుకొని
పలుగు రాయి ఇనుప ముక్కతో మా తాత
టిక్క టిక్కా గొట్టి సుట్టంటు బెట్టేది
పజ్జొన్న రొట్టెలూ దింటేఁ అండ్లకు
పచ్చ గూరే కమ్మగుండే... దేవ
అట్టి పచ్చి పులుసూ పిసుక్కోనీ
పోసు వెట్టుకుంటెంత బాగుండే... ఎనుకటా
॥ ఓయమ్మ ॥

చరణం : పిడిక కున్నెల తోటి పొయ్యి రాజేశేది
ఆమూదమూ బుడ్ల దీపాలు బెట్టేది
రోటి మీదా కుందెన బెట్టి జొన్నలా
పొన్ను రోకండ్లతో పోటు బెట్టేదిరా
ఇస్సుర్రాయీ తోటి గడ్కిసిరి మాయమ్మ
కలితొ ఆరబెట్టి తెడ్డుతో గల్పేది
ఎద గొర్రుకూ మేఁవు జడ్డీగమూ బట్టి
వుప్పుదప్పా దిన్సులన్ని పండిచ్చేది
కూరాడు గానరాదాయే ఎల్లిపాయె
తొక్కు బంగారమై పాయె
ఇస్సుర్రాయే యే మూలకాయె
మేఁవు దంచినా పొన్ను రోకండ్లేడ బాయే
॥ ఓయమ్మ ॥

చరణం : నా యెర్కలా నేను సుట్టాల మార్గము
పోతె ఎంతో పావురంగ జూసేదిరా
కుంపటంతా కోన్ని కోశి కూరావండి
కల్లు గూడాలేత్తె ఇల్లంత పండుగే
రోజు కొక్కల ఇంట్ల బోజనాలూ బెట్టి
ఇసిరెలెన్నో ఇచ్చి వాయనాలూ ఇచ్చి
తిరుగు ప్రయాణంల ఊరి ఆవలి దాక
సాగదోలి కండ్ల నీల్లు దీసేదిరా
ఇప్పుడింటికి సుట్టవొత్తే వోయ్ రాఁవ
ఇడుపు లెంటా దిర్గ వలెరా దేవ
ఆ ప్రేమలన్నీ ఏడబాయే నా పల్లెల్ల
పగలు పంతాలెక్కువాయే రాఁవ
॥ ఓయమ్మ ॥

చరణం : ఏడు తంతెలనాటి ఆడిబిడ్డా ఇంటి
జాలారు బండ మీదా తానమూ జేస్తె
ఆర్నెల్ల కోసారి ఇంటి ఆడీ బిడ్డ
వచ్చి తానం జేసి దీవెనార్తీ బెడితె
ఇంటిల్లి పాదికీ మేలు గలిగీమనా
సంసారం విగురెక్కి సల్లం గుండేదంట
అత్తమాఁవల యైన ఆడిబిడ్డలయైన
మేలు గలగాలనీ కాల్లు మొక్కేదిర
ఆడిబిడ్డల మరిషి పోయిరీ
ఈనాడు ఆలి పిల్లలె ముఖ్యమైరీ
ఎనకటీ వంతనేఁవాయే అయయ్యొ
ఏటిలోనా గలిషిపాయే సాఁవి
॥ ఓయమ్మ ॥

వరంగల్ శ్రీనివాస్, 94406 91695
కందుకూరి రమేష్ బాబు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]