Full width home advertisement

Post Page Advertisement [Top]

వట్టికోట ఆళ్వారుస్వామి నల్లగొండ జిల్లాలోని నక్రేకల్లు సమీపంలోని చెరువుమాధవరం అనే గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. చిన్ననాటనే తండ్రి చనిపోగా, పరాయి ఇళ్లలో వంటలు చేసిపెట్టి, పనులు చేసి, ఒక రకంగా సేవక-యాచక వృత్తితో పొట్టపోషించుకోవలసివచ్చింది. అందువల్ల ప్రాథమిక దశలో కూడ నియత విద్య అభ్యాసానికి ఆయన నోచుకోలేదు. పదమూడు పద్నాలుగేళ్ల వయసులో సూర్యాపేటలో గ్రంథాలయం ద్వారా ఆయనకు ప్రపంచంతో పరిచయం మొదలయింది. సొంతంగా తెలుగు మాత్రమే కాక ఇంగ్లిషు కూడ నేర్చుకున్నాడు. ఈ క్రమంలోనే నక్రేకల్లు, సూర్యాపేట, కందిబండలలో ఇళ్లలో వంటపనులు, బెజవాడలో హోటల్ సర్వర్ వృత్తి, హైదరాబాదులో ప్రూఫ్ రీడర్ పని వంటి అనేక జీవన వ్యాపారాలు చేశాడు. చివరికి, బహుశా 1936-37 ప్రాంతాలలో హైదరాబాదు చేరి గోల్కొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ ఉద్యోగంలో చేరాడు.

అప్పటివరకూ గడిపిన జీవితం మాత్రమే ఆయన సొంతం అనుకోవాలి. అప్పటినుంచి, 1961 ఫిబ్రవరి లో మరణించేవరకూ ఆయన జీవితమంతా బహిరంగ, సామాజిక జీవితమే. ఆ ఇరవైమూడు, ఇరవై నాలుగేళ్లలో జైలు జీవితానికి మూడేళ్లపైగా ఖర్చయిపోగా, మిగిలిన రెండు దశాబ్దాలలో ఆయన చేసినపనులు రాశి రీత్యా చూసినా, వాసి రీత్యా చూసినా అసాధారణమైనవి.
ఆ ఇరవై ఏళ్లలో ఆయన కథకుడిగా, వ్యాసకర్తగా, నవలారచయితగా, విమర్శకుడిగా, కవిగా, ఉపన్యాసకుడిగా, పత్రికా రచయితగా, పత్రికా సంపాదకుడిగా, ప్రచురణకర్తగా, పుస్తకాల అమ్మకందారుగా, పరిశోధకుడిగా, గ్రంథాలయ నిర్వాహకుడిగా, మొట్టమొదటి సూచీగ్రంథాలయ స్థాపకుడిగా – ఒక్కమాటలో చెప్పాలంటే, అక్షరంతో, మాటతో సంబంధం ఉన్నపనులన్నీ చేశాడు. స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజం, ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి సామాజిక రాజకీయ సాహిత్య సంస్థలన్నిటిలో కార్యకర్తగా, నాయకుడిగా పనిచేశాడు. ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, గుమస్తాల సంఘం, రిక్షా కార్మికులసంఘం, రైల్వే ఉద్యోగుల ఆందోళన వంటి కార్మికోద్యమ సంస్థలకు నాయకత్వం వహించాడు. బహుశా తెలంగాణలో తొట్టతొలి పౌరహక్కుల పరిరక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ తర్వాత బహుశా నిర్లిప్తతతో కమ్యూనిస్టుపార్టీకి దూరమయినా, 1959 లో కేరళలో నంబూద్రిపాద్ మంత్రివర్గాన్ని కేంద్రప్రభుత్వం బర్తరఫ్ చేయగానే, అందుకు నిరసనగా మళ్లీ కమ్యూనిస్టుపార్టీలో చేరాడు.
తెలంగాణ సాహిత్యకృషిని అభివృద్ది చేసేందుకూ, ప్రచారం చేసేందుకూ కాలికి బలపం కట్టుకుని ఊరూరూ తిరిగారు. దేశోద్ధారక గ్రంథమండలి స్థాపించి ఎన్నో పుస్తకాలు అచ్చువేశారు. తెలంగాణ ప్రజాజీవితాన్నీ, ఉద్యమాన్నీ చిత్రించే మూడు నవలలు రాయాలని ప్రణాళిక వేసుకుని రాసిన మొదటి నవల ప్రజల మనిషి. ఇందులో 1938 వరకు సాగిన ప్రజా ఉద్యమ చరిత్ర చిత్రితమైంది. తర్వాతి నవల 'గంగు' అసంపూర్తిగా వుండగానే 1961 ఫిబ్రవరి 5న మరణించారు.

వట్టికోట ఆళ్వారుస్వామి కార్యక్షేత్రం సాంస్కృతిక రంగంతో ప్రారంభమై జాతీయోద్యమ ప్రగతిశీల ప్రజాస్వామ్య రాజకీయాలలోకి విస్తరించింది. ఆ క్రమంలో అభివృద్ధి చెందిన చైతన్యం, దృక్పథం ఆయనను ఒక మంచి సృజన రచయితగా మలిచాయి. స్వాతంత్య్రానంతరం తెలంగాణ నవల ఆధునిక స్వరూప స్వభావాలతో నిలదొక్కుకొనటానికి ప్రజల మనిషి నవల వ్రాసి ఒరవడి పెట్టాడు. గంగు అసంపూర్ణ నవలే అయినా మిరిమిట్లు గొలిపే నూతన జీవిత పార్వ్శాలను, దృక్పథాన్ని ప్రదర్శించింది. తెలంగాణ సాంస్కృతిక రాజకీయార్థిక పరిణామాలతో ముడిపడిన వట్టికోట అనుభవాలను సామాజిక జీవన సంఘర్షణలో ఆ ప్రత్యేక వ్యక్తివిగానే మిగిలిపోక సమిష్టి జీవన తాత్వికతను సంతరించుకొన్నప్పుడే వ్యక్తుల జీవితానుభవాలు వస్తువుగా కలిగిన సాహిత్యం సార్వజనీనం అవుతుంది. సార్వకాలికం అవుతుంది. వట్టికోట ఆళ్వారుస్వామి నవలలకు అక్షరాల ఇది వర్తిస్తుంది. కనుకనే ఆయన నవలలు ఆత్మచారిత్రాత్మక నవలలు కాగలిగాయి.

నైజా నిరంకుశ పాలనలో అణగారిపోతున్న ప్రజాసమూహాలలో తలెత్తిన అస్తిత్వ చైతన్యం, ఆరాట పోరాటాలు, సమిష్టి రాజకీయ కార్యాచరణ 'ప్రజల మనిషి' నవలలోనైనా 'గంగు' నవలలోనైనా ప్రధానాంశం. వీటన్నిటికి లక్ష్యం మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుచుకొనటం. ఈ లక్ష్యాన్ని ప్రజల మనిషి నవలలో కంఠీరవం ద్వారా వాచ్యంగానే చెప్పించాడు వట్టికోట. మంచి ప్రభుత్వమంటే ఏమిటని బషీరు చేత ఒక ప్రశ్నకూడా వేయించి కంఠీరవం చేత సమాధానం చెప్పించాడు. ''మంచి ప్రభుత్వంలో నీ తల్లి దండ్రుల వలె పొట్టకెల్లక కన్నబిడ్డలను అమ్ముకోరు, వదులుకోరు, అన్యాయంగా ఇతరుల ఆస్తులను ఆక్రమించరు. ఒకనికి ద్వేషం ఉండదు. అన్నం లేదని అరచే వాండ్లుండరు. చదువరాని వాడు ఉండడు. అందరూ నీతితో ఉంటారు. కట్టుగా ఉంటారు. దయతో మెలుగుతారు. ముఖ్యంగా అంతా ఆప్తులుగా బతుకుతారు. అర్థశతాబ్ది క్రితం వట్టికోట ఆళ్వారుస్వామి కన్న కల ఇది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని స్వర్ణోత్సవాలు జరుపుకొన్నాం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిందని స్వర్ణోత్సవాలు జరుపుకొన్నాం. అయినా వట్టికోట ఆళ్వారుస్వామి యాభైఏళ్ళ క్రితం ప్రజల బంగారు భవిష్యత్తును గురించి కన్న కలను సార్థకం చేసే మంచి ప్రభుత్వం ఏర్పాటుకు జీవన్మరణ పోరాటాలు సాగుతున్న వర్తమాన చరిత్రనే మనం చూస్తూన్నాం. ప్రజలమనిషి, గంగు నవలల్లో ఆనాటి ప్రజల ఆశలను, ఆకాంక్షలను ప్రతిఫలించిన ఒక కంఠీరవం, ఒక కొమరయ్య, ఒక బషీర్‌, ఒక సుజాత. ఒక కమల, ఒక నవనీతం - వారసులు ఈనాటి ప్రజా ఉద్యమాలలో కొసాగుతున్నారు. అందువల్ల వట్టికోట ఆళ్వారుస్వామి నవలలు అంటే చారిత్రక అవశేషాలు కావు. వర్తమానంతో సంభాషిస్తూ సంఘర్షిస్తూ అంతిమ విజయం వరకు కొనసాగే మహామానవ ఇతిహాసాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]