Full width home advertisement

Post Page Advertisement [Top]


ధూం దాంలో మన పండుగలు, పబ్బాలపై పాట ఉన్నది. సమస్త వత్తులు ఎట్ల దెబ్బతిన్నయో చెప్పే పాటా ఉన్నది. అట్లే, మన కళారూపాలు ఏమైనయని అడిగిన పాటా ఉన్నది. అది నిసార్‌ది. పండూ వెన్నెల్లలోన...పాడేటి పాటలేమాయె? అనుకుంట గత వైభవాన్ని, నాటి మన కళల్ని, రూపాలని కండ్లకు కట్టించింది గీనెనే! ఒక్కసారి మనల్ని గతంలో కూసుండబెట్టిన ఘనత ఇతడిదే. నిసార్. మనిషి ముస్లిం. కానీ తెలుగు కవి. తనది విశాల ఉద్యమం. కవిత్వం రాస్తడు. పాటలు రాస్తడు. ముఖ్యంగా బతుకు పాటలు రచిస్తడు. పాడుతడూ, ఆడుతడు.

పేదవాడు. కానీ, పేదలపై పాటలు రాస్తడు. తెలంగాణ వాడు. కానీ, తప్పనిసరై తన ప్రాంతం గొడవను కాళోజీ మాదిరి వెళ్లగక్కిండు. ఉద్యమం చివరి టైంకి ధగధగ మెరిసె పొద్దుపొడుపులా ...భగభగమండే తెలంగాణరా అని నిప్పుల గుండంలా చెలరేగిండు.

తాను నల్లగొండ జిల్లా సుద్దాల వాసి. పల్లె సుద్దులు చెబుతడు. ప్రజా నాట్యమండలి బందానికి రాష్ట్ర కార్యదర్శి కూడా. అది కాదు. తాను పది చదివిండు. తర్వాత లారీ ఎక్కిండు. మొదట క్లీనర్, తర్వాత డ్రైవర్. ఇప్పుడు బస్ కండక్టర్. టిక్కెట్... టిక్కెట్ అనుకుంటనే పాటను గుణాయించుకునే పరిస్థితి. డ్యూటీకి డుమ్మా కొట్టి ఉద్యమంలో పాడాలి. ఆడాలి. తప్పదు. అది కూడా కాదు విశేషం. ఒకనాడు పోస్టర్. తర్వాత వాల్ రైటింగ్. ఇవి స్ఫూర్తిగా కరపత్రం. అటెన్క సభ. తర్వాత ధూం దాం. అవును. ఒకటెన్క ఒకటి. ఫస్టు వి.వి స్పీచ్-గద్దర్ ఆటా పాటా విన్నడు, చూసిండు. ఇట్ల బతకాలె అని నిశ్చయించుకున్నడు. బహుశా దోపిడీ. అవును. తాను రైసు మిల్లులు తిరిగేటోడు. దాల్ మిల్లులు, ఫ్లోర్ మిల్లులు తిరిగేటోడు. లారీ మీద పనిచేసినంత కాలం దోపిడీ రూపాలన్నీ కళ్లకు కట్టినయి. దోపిడీకి గురైతూ, దోపిడినీ చూస్తూ, దోపిడీ గురించి రాసి ఆడిపాడే కళాకారుడిగా ఎదిగిండు. ఆ బక్కజీవి, పేద ముస్లిం, నల్లగొండ బిడ్డా నిసార్. తెలంగాణలో ఒక సంపద్వంతమైన కవి.

తనది కొలువు చేసుకోక తప్పని స్థితి. సంసార బాధ్యతలు నెరవేర్చడమూ తప్పదు. కొద్దిమంది కళాకారుల్లా ఏదో ఒక వ్యాపారం చేసుకోకుండా, కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డాడు, కలం, గళమై ఒదిగిండు.

ఇదంతా ఒకెత్తు. అయితే, తాను మొదట్ల సిపిఎం. ఆ తర్వాత సిపిఐ. నిజానికి సిపిఐ పార్టీ ప్యాకేజీలతో సరిపెట్టుకున్నా, చివరాఖరికి తెలంగాణకు మద్దతు ఇచ్చినా, తాను మాత్రం ఇక్కడి బిడ్డగా తొలి నుంచి తెలంగాణం. మలి తెలంగాణ ఉద్యమంలో ఇంకింత లేచిన కలం, గళం. దగాపడ్డ తెలంగాణ దండు కదిలినాదిరో...దండోర మోగినాదిరో... అంటూ తెగదెంపులకై ఉద్యమించిన తెలంగాణ బందగానం, నిసార్.
అయితే పెద్ద పేరు రాలేదు. అది కుదరదు కూడా. తన పాటలు పెద్దగా క్యాసెట్లుగా రాని పరిస్థితి. పార్టీలో తానొక ఫుల్‌టైమర్ కాలేని స్థితి. తన మానాన తాను బతుకుతూనే మలిదశ ఉద్యమంలో తానూ ఒక పాత్రయ్యిండు. అందర్నీ ఊరకలెత్తించిన గానమైండు. చరిత్రలో భాగమైండు. ఇంతకుమించి తప్తి లేదు అంటుండు తాను.

ఇవన్నీ అతడి గురించి చూచాయగా చెబుతై. తాను ఎవరు, తనది ఎసొంటి వ్యక్తిత్వమో చెబుతుంది. కానీ, తాను చాలా చక్కటి తెలంగాణ పాటలు రాశిండు. మనదైన అస్తిత్వాన్ని బహు చక్కగా వ్యక్తం చేసిండు. ప్రధానంగా గద్దర్ బాణీల స్ఫూర్తి ఉన్నప్పటికీ, అసంఘటిత కార్మికులను, వత్తిదారుల గురించి పాటలెన్నో రాశిండు. బతుకు పాటలు రాశిండు. అయితే, మలిదశ ఉద్యమంలో తాను పండు వెన్నెల అయిండు. ఆహ్లాదభరిత గతం అయిండు. ఆ గతం వర్తమానంలో ఆగమాగం కావడం పట్ల తల్లడిల్లిన గీతం అయ్యిండు. అందులోనే ఒక దక్పథంగా ప్రపంచీకరణ నేపథ్యం చెప్పిండు. ఆ ప్రపంచీకరణను బలంగా ఎదిరించే తెలంగాణ అస్తిత్వంతో రాటుదేలిండు. వలసాంధ్ర పీడనపై కైగట్టిండు.

ఒకటని కాదు, చాలా పాటలు. ఇటు తెలంగాణ గురించి రాస్తూనే మన హైదరాబాద్‌పై కన్నుపడ్డ ఆంధ్రోళ్ల అగడాలనూ అనేక పాటల్లో ఎండగట్టిండు. ఇట్లా మలిదశ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిండు. అయితే, ఇవన్నీ అందరికీ తెలియకపోవచ్చు. తెలిసింది మాత్రం ఒక పాట. అదే మన కళారూపాలపై తాను రాసిన పాట. పండు వెన్నెల పాట. ఈ పాట లేకుండా ధూందాం లేదంటే అతిశయోక్తికాదు. అవును మరి. పండూ వెన్నెల్లలోన.. పాటలేమాయె? అన్న పాట ఒక నత్య రూపకం. మొదట్ల ఈ పాటను ఎత్తింది గిద్దె రామ నర్సయ్య అయితే, రసమయి ఊరూరా తిప్పిండు. కాగా, పాటని అద్భుతమైన నత్యరూపకంగా మలిచింది అంతడ్పుల నాగరాజు.

ఇక్కడో విషయం. పునరుజ్జీవనం అంటే మళ్లీ జీవించడం అనుకుందాం. అదొక ఆశ. మలిదశ ఆశయం. ఈ ఆశయాన్ని మలిదశ ఉద్యమంలో మహత్తరంగా రూపకల్పన చేసింది మన కవులు, గాయకులే అనాలి. ఒకనాటి మన పండుగలు, పబ్బాలు, వత్తులను, కళారూపాలను పేరుపేరునా యాది చేసిండ్రు. పోయిన వాటిపట్ల ఒక సోయిని పెంచిండ్రు. ఎందుకు పోయినయో తెలియజెప్పిండ్రు. కళాకారులుగా వాళ్లు చేయవలసింది చేసిండ్రు. ఇంకా చేయవలసింది వాళ్లుగాదు, ఇంకొగలు. ప్రణాళికా రచయితలు, పొలిటికల్ విల్ ఉన్న రాజకీయ నేతలు. మరి ఇంతదాకా తెచ్చిన ఈ కళాకారులను ఎట్ల తల్చుకోవాలె? పునరుజ్జీవనం అంటే ఇదే. వాళ్లను ఎట్ల తల్చుకోవాలె?

నిజం. రైతును తల్చుకున్నట్టు... వానపామునూ తల్చుకోవాలె. ఉద్యమాన్ని నెత్తిమీద పెట్టుకున్నట్టే కవీగాయకులను అభినందించుకోవాలె. అట్లే, మలిదశ ఉద్యమంలో మస్తు మంది గతాన్ని అంటే ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసమైన తెలంగాణ చిత్రపటాన్ని బహు చక్కగా రూపుగట్టిండ్రు. సోయి పెంచిండ్రు. దీన్ని పునరుజ్జీవనం అనే అందాం. ఆ లెక్కన తమ ఊరిని, అందుల బతికిన మనుషులను, కళారూపాలను మళ్లీ వర్తమానంలోకి తీసుకొచ్చిన పునరుజ్జీవన కళాకారుల్లో ఒకరిగా నిసార్‌ని పరిశీలించాలి.
మరి ఈ పండు వెన్నెల్లలోన అన్న పాటను ఎట్లా రాసిండు. తమ ఊరికి మళ్లీ పోవాల్సి వచ్చినప్పుడు రాసిండు. అది 2000 నాటి మాట. తమ కష్టార్జితంతో, తమ గ్రామంలో ముగ్గురు మిత్రులు కలిసి ఒక కల్చరల్ ప్రోగ్రాంలు నిర్వహించేందుకు గాను ఒక స్టేజ్‌ని నిర్మింపజేస్తరు.

బడిలో నిర్మించిన ఆ స్టేజ్‌పై తొలుత పాడిండు నిసార్. అదే తొలి వేదిక తనకు. ఆ తర్వాత ఆ పాట ధూందాం వేదిక ఎక్కింది. ఊర్లన్నీ తిరిగింది. గతాన్ని గుర్తుచేసే వెన్నెలమ్మే అయింది. అయితే ఈ పాటలో ఒక ఆలాపన ఉంటది. నన్నారె నన్నారె నన్నారె నన్నారె...నారె నన్న నార...నారె నన్నారె నానా నారే... అంటూ సాగుతుంది. ఆ ఆలాపన వెనుకటిది. జానపదానిది. ఆ ఆలాపనలో ఉండగానే ఈ లోపల వేదికపైకి పిల్లలు అడుగులు వేసుకుంటు కోలాటం ఆడుకుంటూ వచ్చి చేరుతరు. తర్వాత పాట ప్రారంభం.
పండూ వెన్నెల్ల లోన పాటలేమాయె? మన పల్లెటూరిలోన ఆడేటి ఆటలేమాయె? అని పాటందుకుంటడు కవీ గాయకుడు నిసార్. బాలనాగమ్మను, భక్త శిరియాల హరిశ్చంద్రను మళ్లీ యాది చేస్తడు. చేయంగనే ఎక్కడో తగులుతుంది. శ్రోత ఎన్కట్కి పయణమైతడు.

ఆ వెంటనే కండ్ల ముందు కవి ప్రవేశపెట్టే యక్షగాన రూపకమూ ప్రత్యక్షం అవుతుంది. ఒక రకంగా ఈ పాట ఆట కూడా. వర్తమాన స్థితిలో గతాన్ని ప్రతిక్షేపించే తెలివిడి. చిందేస్తూ చిత్రంగ వూరంత తిరిగేటి చిందోల్ల వేషాలేవి? అని అడుగుతూ మళ్లీ మరోసారి యక్షగానం రూపకం చూపుతడు కవి. అందులో హాస్యగాడు.. పిట్టలదొర కూడా వస్తడు. తర్వాత బుర్ర కథ, ఒగ్గు కథ, ధూలా...బతుకమ్మ ఆటలు...ఇట్లా పాట మొత్తం ఒక పల్లెటూరు పరిమళం. వెన్నెల వాకిలి. వాడకట్టు అంతా ఒక్క తాన గూడే సుట్టు కాముడు. ఎన్ని సార్లు ఈ పాట విన్నా మళ్లీ వినాలనిపించే మన గతం ఈ పాట.

చిత్రమేమిటంటే, నిసార్ అంటడు. ఈ పాట రాసేటప్పుడు తొలుత తాను పేరు పేరునా ఆ కళా రూపాలు కాకుండా కళాకారులను ప్రతిక్షేపించిండట. అయితే, అది ఒక్క ఊరికి చెందినట్లే అవుతుందని మార్చిండట. ఆ పేర్లను తీసేసి తెలంగాణ అంతా విస్తరించేటందుకు గాను యక్షగానాలు మొదలు బతుకమ్మ దాకా కలిపిండట. మధ్యలో ఈ పాటను పనికి ఆహారం పథకంలోనూ పాడుకున్న చరిత్ర ఉందట. ఇట్లా పాట తిరిగి ధూందాం వేదిక మీదికి ఎక్కడం నిజంగానే కవి సమయం. ఉద్యమ సందర్భం.
ఉద్యమంలో తాను సాదా మనిషి. మామూలు మనిషి. ముందే చెప్పినట్టు లారీ మీద పనిచేసిండు. ఇప్పుడు బస్సు మీద పనిచేస్తున్నడు. కానీ, ఒకనాడు తాను గద్దర్ పాట విన్నడు. పేదల కష్టాలు తీరేదెట్లా అని ఆలోచించిండు. తానూ పాటలు రాయాలనుకున్నడు.

అయితే, లారీ మీద పనిచేస్తున్నప్పుడు సమయం దొరికేది కాదట. తర్వాత బస్ కండక్టర్ అయినంక రాయడం, రాసిందాన్ని తానే పాడటం ప్రారంభించిండు. అయితే. తాను ప్రధానంగా ప్రపంచీకరణ కవి. చాలా నిశితంగా స్థానికతను ప్రపంచీకరణ వ్యతిరేక అంశంగా మలవడంలో సిద్దహస్తుడు. ఈ పాటలోనూ అంతే. పండూ వెన్నెల ఉందిగానీ పాడేటి పాటలేమాయె అనడంలో ఒక ప్రశ్న ఉంది. ధిక్కారం ఉంది. ఇది తన విశిష్టత. చెప్పేది ఏదైనా ప్రేమతో, లలితంగానే చెప్పినా గీతంలో ఒక ఉద్యమ చలనం ఉంటుంది. ఆత్మాశ్రయం అనిపిస్తుందిగానీ ఇదంతా సాధారణత్వం. తెలంగాణ జీవి కవిత్వం. ఒక సమూహంగా ఉన్న జానపదులు వ్యక్తులై బానిసలైన స్థితిని కై గట్టే లక్షణం. దండు కట్టలేని సామాన్యుడికి రాసిన పాటలు ఇవి.
తాను బస్తమోసె హమాలన్నపై పాట రాసిండు.

ఆకలిగొన్న పేగులు పీకలూదుతున్నయి అంటూ బ్యాండోళ్లపై రాసిండు, తాపీ తట్ట మెట్న దారం నెత్తుటి చమటలపై పాట గట్టిండు. అడ్డమీద బతుకులపై రాసిండు. చదువురాని చెల్లెండ్లపై రాసిండు. ఆటో, లారీ, బస్సు డ్రైవర్లపై రాసిండు. యే కైసి నౌకరీ అని టైంటేబుల్ లేని జీవితాలను కండ్లకు కట్టించిండు. అయితే, ఒక్క మాటలో తనవి బతుకు పాటలు. కొలువు పాటలు. ఉద్యోగాలు ఇంట్లుండ కూడదని చెప్పే పాటలు. తాను నీళ్ల పాటలు రాసిండు. నిధుల పాటలూ రాసిండు. ఫోైర్లెడ్ బండ వంటి నా జిల్లా నల్లగొండ అని గూడ ఒక పాట రాసిండు. చెట్టుతల్లి మీద రాసిండు. తన సామాజిక నేపథ్యానికి కారణమైన ముస్లిం జీవితాన్ని గురించి రచించిండు.

ముసల్మానులం అని, సాయెబో! సాయెబో! అని, అల్ల మీద భారమేసే వాళ్లను మేలుకొలుపే పాటలెన్నో రాశిండు. విశేషం ఏమిటంటే తన భాష అద్భుతంగా ఉంటది. పలుకుబడులు మంచిగొస్తయ్. పాటలో ఊర్లు, పేర్ల్లు. కుల అస్తిత్వం, వాళ్ల కళ మస్తిష్కంతో సహా కానవస్తయి. మనుషులు శ్రామికులుగానే కాదు, సజన శీలురుగా, మేధావులుగా కనిపిస్తరు. రెక్కల కష్టం ఉంటది. పేగులు బయటపడ్డ స్థితి ఉంటది. అయినా ఓర్చుకుంటున్న స్థితి ఉంటుంది. ఆ ఓర్పును తట్టిలేపే రాజకీయ దిశానిర్దేశం ఉంటుంది. అయితే ప్రపంచీకరణ ఇతివత్తం కాస్తా మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఇరుసుగా మారడం తన కవిత్వ విశేషం. అదే ఈ కవి సమయాన్ని పండూ వెన్నెల పాట రచించేలా చేసింది.

నిసార్ పాటల్లో స్థానికత పేర్లతో ఉందని ముందుగానే అన్నట్టు, ఈ పాటలోని సాతాని గోపయ్య, కొలిపాక నర్సయ్య, బీసు సత్తయ్య నవ్వులేవి? నా పల్లె ముద్దుబిడ్డలు బుడ్డరఖాన్లు ఎటువోయిరి? అన్న చరణంగాని, ఇంకా వడ్ల చంద్రయ్య, కాశ యాదగిరి, ఎరికలి ఎల్లయ్య ఏశాలేవి? మా పల్లె గుండెలోన మోగేటి కంచుగొంతులేవి? అన్న చరణం, అట్లే-సుద్దాల హన్మంతు ముద్దుల శిష్యుడు మబ్బు ఎల్లయ్య పాటలేవి? మన పల్లెటూరి పోరాటాల లొల్లేది అన్న చరణం గానీ, ఇవన్నీ తొలగిపోయి...పాటలో ఆ వ్యక్తులు ఆడిపాడిన కళారూపాలుగా సాంద్రీకరించడం అన్నది తన విస్తరణ. ఇట్లా పేరు నుంచి ఊరు నుంచి కళా రూపం నుంచి మొత్తంగా పునరుజ్జీవన సోయిలోకి పాటను పంపడంలో పేర్లు పోవచ్చుగాక. కానీ తెలంగాణ అస్తిత్వం బతికి బట్టకట్టి ఆడి పాడటం మలిదశ ఉద్యమంలో ఒక విశేషం.

ఇదొక్కటే కాదు, పాటలో చివర్లోనూ అంతే. ప్రపంచీకరణ ముగింపు కాస్తా సామ్రాజ్యవాదుల ఏజెంట్లుగా ఉన్న చంద్రబాబు వంటి పాలకులను నిందించేలా సాగుతుంది. పల్లె సంబురాలు లేకపోవడం...అందుకు కారణంగా ఆంధ్రోళ్ల పాలన ఆగమాగం జేసెనమ్మ అనే దగ్గర పాట ఆగుతది. ఒక రకంగా మలిదశ ఉద్యమంలో ఇట్లా పాట వ్యక్తి ప్రస్తావనలు ఉపసంహరించుకుంటూ ప్రజల శ్రేయస్సుకు దోహదపడే సామాజిక విభజనకు అనుకూలంగా పరివర్తన చెందడం విశేషం. అట్లా ఈ పాట ఇయ్యాళ...రాష్ట్ర అవతరణ సందర్భంగా నిజంగానే మళ్లీ మనల్ని మనం ఉద్దరించుకునే గురుతర బాధ్యతను గుర్తు చేస్తుందనే అనుకోవాలి. పల్లెకు కళ తెచ్చే సావకాశంగా చూడాలి.

అయితే, ఈ పాట ఒరిజినల్ బాణీ జానపదం. వినే ఉంటరు. నిండ నిమ్మల్లకింద-నిమ్మల్లకింద...ఆగజూడె గోపెమ్మా-ఆహాఁ...గొల్లవారి మందా అగజూడే గోపమ్మా...దీన్ని తీసుకునే తాను పాట కట్టినట్లు చెప్పిండు. అయితే, ఏ పాటకైనా బాణీలు జానపదమే. ఒక రకంగా ఈ పాట మళ్లీ నిలబడ్డదంటే కూడా ఆ జానపద కళారూపాల వల్లే అనుకోవాలి. అట్లా ఒక జానపదం మళ్లీ మళ్లీ లేచి నిలబడటంగానూ ఈ పాటను, రూపకాన్ని ప్రత్యేకతగా పరిశీలించాలి. ఒక రకంగా పునరుజ్జీవనం అంటే ఇది కూడా అనుకోవాలి. ఆ కర్తవ్యాన్ని నిర్వహించిన కవి సమయానికి మనం రుణపడి ఉండాలి.
అస్థిత్వపు గుర్తు: నిసార్ ప్రపంచీకరణ ఒరవడి నుంచి కాస్త జరిగి మలిదశ ఉద్యమంలో తెలంగాణ తల్లి చెప్పినట్టు నడవడమూ విశేషమే. అప్పటిదాకా ఉన్న ఒరవడికి అస్తిత్వం సుధ్రాయించడం నయమే అయింది. బహుశా ఇది 1996లోనే జరిగింది. తన ఊరి మీద రాసిన పాటలో (మా ఊరు-సుద్దాల) మన తెలంగాణ అస్తిత్వం సుస్పష్టం.

దీంట్లనే తన తెలంగాణ తనపు మూలాలన్నీ ఒక గ్రామీణుడి తలంపులో కనవడతయి. అటెన్క ఆయన తెలంగాణగా విస్తరించిండు. ఆ లక్షణాలు మిగతా పాటల్లో కనిపిస్తయి. వీర తెలంగాణ అన్న పాటలో నాటి సాయుధ పోరాట తీరుతెన్నులను మలిదశలో గుర్తు చేయడం ఉంటుంది. బలిదానాలు సాగే తరుణంలో ఆత్మహత్యలు వద్దని చెప్పడానికిగానూ ఈ కవి ఒకనాటి పోరాట వారసత్వాన్ని గుర్తు చేస్తడు. ఈ గుర్తు చేయడం అన్నది నిసార్ కవిత్వంలో ఒక ప్రత్యేకత. పండూ వెన్నెల్లలోన అన్న పాట కూడా ఒక గుర్తే. ఇట్లా నిసార్ పాట గతమూ భవిష్యత్తు కలగలసిన వర్తమాన గీతం, గుర్తు.

కందుకూరి రమేష్ బాబు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]