Full width home advertisement

Post Page Advertisement [Top]

మిత్ర - విమలక్క

ప్రాస కోసం కాదు, నిజం. ఒకరు అజ్ఞాతం. ఇంకొకరు జ్ఞాతం. ఒకరు కలం. ఇంకొకరు గళం. తెలంగాణంలో ఈ ఇద్దరి యుగళ గీతం అరుణోదయం. ఒక విమోచన.
అలియాస్ అన్న పదం పోలీసులు తెచ్చింది కాబోలు అందుకే వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ అలియాస్ మిత్రల గురించి మాట్లాడుతుంటే అట్లా కాకుండా కూర మల్లమ్మ బిడ్డ అని రాయాలనిపిస్తుంది. కూర బాలయ్య చిన్న కొడుకు అని చెప్పాలనిపిస్తంది. జనశక్తి అగ్రనేత కూర రాజన్న తమ్ముడని గుర్తు చేయాలనిపిస్తుంది. మూలవాగు మాణిక్యం అనీ అనాలనిపిస్తుంది. అలాగే, రైతుకూలీ సంఘం నేతలైన నల్లగొండ జిల్లా ఆలేరుకు చెందిన బండ్రు నర్సింలు, నర్సమ్మల అల్లుడనీ చెప్పాలనిపిస్తుంది. అవును మరి.

విమల వాళ్ల చిన్న బిడ్డ. తనకు విమల. మనందరికీ విమలక్క. తనది ఆలేరు. నిజానికి వీరిద్దరూ అంటే విమల- మిత్ర తల్లిదండ్రులకు చెందింది తక్కువ, ఉద్యమానికి చెందిందే ఎక్కువే అనాలి. అందుకే ఉద్యమ సహచరులూ, జీవన సహచరులూ అయిన వీరిద్దరి గురించి కలిపి చెప్పుకోవడం. అదే తెలంగాణ సందర్భంలో కవి సమయం. అయితే, వాళ్లిద్దరి గురించి బాగా చెప్పిన సిరిసిల్లకు చెందిన విలేకరి తవుటు నాగభూషణం మాట గుర్తు చేసుకోవలసిందే. తానంటాడు, అతడి కలం విమలం. ఆమె గళం అమరం అని! నిజంగానే ఇద్దరి సాహచర్యం సగం సగం. అర్ధనారీశ్వరం. తెలంగాణకు వస్తే సంపూర్ణం.

చిత్రమేమిటంటే ఇద్దరూ ఇద్దరే. బహుజనుల రవళి. వి.వి రాస్తాడు, కూర దేవేందర్ చేపపిల్ల వలే కళ్లు తెరిచాడని. నిజం. జాలరి కుటుంబంలో పుట్టిన దేవేందర్ సున్నితమైన వ్యక్తి. జలతారు సంగీతం వినిపించే కవి మిత్రుడు. తాను నిజంగానే చేపపిల్ల. ప్రజా జీవితంలో ముఖ్యంగా అజ్ఞాత అవసరాల్లో 25 ఏళ్లు చేప పిల్ల వలే ఈదులాడిండు, ఎవరి బుట్టలోనూ పడకుండా. చర్చల ప్రతినిధిగా అజ్ఞాతం వీడాక మనం రియాజ్‌ను పోగొట్టుకున్నం గని అమర్ మిగిలిండంటే అది చేప కన్ను చురుకుదనమే. అదొక సంస్కతి. అందుకు తగ్గట్టే విమలక్క. నల్లగొండ నుంచి గొల్లకుర్మ కుటుంబంనుంచి తాను డోలు దెబ్బోలె నిద్రలేచింది. ఒక విద్యుల్లత వోలె మెరిసింది. ఛా&ల్ అంటూ తాను పాడుతుంటే ఒక చర్నాకోలా ఝలుపు.పజాశక్తులను నిద్రలేపే పాటైతుంది. సీమాంధ్రుల ఆర్థిక వనరులను దెబ్బకొట్టగలిగిన చేవ అవుతుంది. ఇద్దరూ ఇద్దరే. ఒకరికి ఒకరు తోడూ నీడా. వ్యక్తిగతం కన్నా ఉద్యమమే ఎక్కువ.

ఇప్పటిదాకా ప్రజాకళల రంగస్థలం మీద పాటను, ప్రదర్శనను ఒక స్థాయికి తెచ్చిన మహిళలు వేళ్ల మీద లెక్కించదగ్గవారే. మా భూమి సంధ్య ఒకనాడు. తర్వాత బెల్లి లలిత. ఆ అక్క పాట కూడా మధ్యలోనే తెగిపడింది గానీ మిగిలిన ప్రధాన గాయని అరుణోదయ సాంస్కతిక సమాఖ్య అధ్యక్షురాలు, టఫ్ (తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్) నేత విమలక్కే. తాను పాట, ప్రదర్శనతో తెలంగాణ ఉద్యమంలో సకల జనులను విస్తతంగా కదిలించిన ఏకైక మహిళ. గద్దర్ తర్వాత గొంగడితో కూడిన అహార్యంలో తానొక కొనసాగింపు. చిత్రమేమిటంటే తాను బయట ఎంతో సౌమ్యురాలు. తెలంగాణ మహిళ వలే ఎంతో ప్రేమమయి, కానీ, ఎర్రచీర. అది ధరిస్తే ఎక్కడలేని తెగింపు. ధైర్యం, ఆశ అని అంటుంది విమలక్క.

ఆ చీరతో తాను ప్రత్యేకమై ఒక్కసారి ఉద్యమంలోకి ప్రవేశిస్తుంది. కానీ, ఉద్యమంలో అమర్‌గా, కలం పేరుతో మిత్రగా ప్రాచుర్యంలో ఉన్న దేవేందర్ మాత్రం సివిల్ డ్రెస్‌లో సాదాసీదాగా, చాలా సౌమ్యంగా కనిపిస్తాడు. నిజానికి తాను వందలాది పాటలు రాసిండు. మలి తెలంగాణ దశలో వందకు పైగా తెలంగాణ పాటలు రాశాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, 1980లోనే తెలంగాణ ఎంత సాహసమైంది అని రాసిండు. అవన్నీ ప్రధానంగా విమలక్క గొంతులో ప్రాచుర్యంలోకి రావడంతో మిత్ర అజ్ఞాతంగానే ఉండిపోయాడు. శ్రోతలకు మిత్ర పాట అని తెలియనంత అజ్ఞాత జీవితం అతడిది. అదే తన ఉద్యమ రహస్యం. అందువల్ల కూడా మిత్ర కవి సమయం రాస్తుంటే అనివార్యంగా ఆ పాటకు గళాన్నిచ్చిన విమలక్క ముఖ్య భూమిక పొందుతుంది.

కె.డి పేరుతో నలుగురికీ తెలిసిన కూర దేవేందర్‌ను ఇంకా అప్పటికి చూడలేదు విమల. అప్పుడు ఆమె విశాఖపట్నం పిడిఎస్‌యు క్యాంపుకు వెళ్లింది. పోలీసులు ఈ యువ కళాకారుల టీంను అరెస్టుచేసి సాయంత్రం విడిచి పెడతారు. కానీ, సభాస్థలికి చేరేటప్పటికి ఒక డ్యూయెట్ పాడవలసి వస్తుంది. తాను అమ్మాయి గొంతు ఆలపిస్తుంది. పక్కనున్నది ఎవరో తనకు తెలియదు. చూడలేదు. కానీ, నాటి ఆ ఉద్యమ సహచరుడే తర్వాత జీవిత సహచరుడు అవడం. అటు పిమ్మట ఇద్దరూ కలిసి యుగళ గీతం పాడటం, అది కూడా ఉద్యమ గీతమే అవడం ఒక యాధచ్చిక వాస్తవికత.

వారిద్దరూ జిల్లా బాధ్యులకు లేఖలు రాసుకోవడం, పెళ్లి కావడం బహుశా ఒక ఇంట్రావర్ట్‌కు ఒక ఎక్స్‌ట్రావర్ట్ తోడు. లోవెలుపలి సంబంధంలా జరిగిపోయింది. అయితే, తెలంగాణలో ఇరు ప్రాంతాల్లో, ఇరు కుటుంబాల్లో విప్లవోద్యమ వాతావరణం ఉండటంతో ఇద్దరూ చిన్ననాటి నుంచే అటు కరీంనగర్ ఇటు నల్లగొండ, అటు మూలవాగు ఇటు పెద్ద వాగు, అటు ఎములాడ రాజన్న ఇటు యాదగిరి నర్సింహస్వామి, ఇద్దరూ కలుస్తారు. ఒక పాటను అవిశ్రాంతంగా పాడుతారు. మలి తెలంగాణ తరుణంలో ఇద్దరూ మరింత దగ్గరవుతారు. అదీ పాట వల్లే. అప్పటికే అక్షరాలు అజ్ఞాతం. తాను, ఆ గళం మాత్రం మొదట్నుంచీ జ్ఞాతం. కానీ కలిసింది తక్కువ. ఉద్యమంలో తాను అనేక పాటలు రాయడం. అవన్నీ పాడటం. ఒక రకంగా ఇద్దరూ పాటతోనే సాన్నిహిత్య జీవితాన్ని గడిపారని చెప్పుకోవాలి. అందుకే బందీ అన్నది కీలకం అవుతున్నది వారిద్దరి మధ్య.

నిజమే. మిత్ర కవిత్వంలో చాలా కీలకమైన అంశం- బందీ. అవును, తాను రాసిన పాటల్లో బందీ విముక్తి బంధనాలు తొలగినప్పుడే అన్న పాట గొప్ప ఆర్ద్రగీతం. ఇది ఒక రకంగా తన కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి, తన స్థితిని, తన ఉద్యమ సాహచర్యం గురించి చెప్పడానికీ, అలాగే వలసాంధ్ర పీడనలో బందీ అయిన తెలంగాణ గురించి చెప్పడానికీ గొప్ప ప్రతీక అవుతున్నది. ఆ పాటను విమలక్క గానం చేయడంలో తాను మిత్ర పాట పాడటం మాత్రమే లేదు. తాను తన తెలంగాణ తల్లి దాస్య శంఖలాలు తెగడం అన్న ఒకే అంశం గానం చేయడం లేదు.

తన ఉద్యమ సహచరుడు జైలు నుంచి విడుదల కావడం మాత్రమే లేదు. తెలిసో తెలియకో జైలులోకి వెళ్లిన పౌరులందరి స్వేచ్ఛా ఉన్నది, ఒక సంస్కరణ ఆశయమూ ఉన్నది. అన్నిటినీ మించి తెలంగాణ సాకారం అవుతున్న వేళ తన జీవన సహచరుడు, భర్త అయిన అమర్ గురించిన ఆత్మీయమైన గానం ఉన్నది. బంది విముక్తి బంధనాలు తొలగినప్పుడే..పొద్దూ పొడుపు గుండెల్లోన పొడిచినప్పుడే అని గొప్పగా విమలక్క పాడుతుంటే ఇవన్నీ వినిపిస్తయి. పాడుతుంటే గాయనిగా ఇందులో విమలక్క ఒక్కతే లేదు. ఒక సగటు భార్యా ఉన్నది. తెలంగాణ మహిళ విమలా ఉన్నది. ఆ లెక్కన ఈ పాట తెలంగాణ ములాఖత్‌కు గొప్ప కవి సమయం.

చిత్రమేమిటంటే, ఒకచోట మిత్ర రాసుకుంటాడు. ఆశలన్నీ ఖైదు చేయబడ్డప్పుడు ఆలోచన బంధ విముక్తం అవుతుంది. నా ఒంటరితనాన్ని ఛేదిస్తూ ఒక స్వరం వెన్నంటి వస్తుంది అని! నిజమే. ఇక్కడ బందీ అన్నది స్వేచ్ఛకు ప్రతీక. ఒక ఎక్స్‌ప్రెషన్. దాని స్వరం తన పాటే.
విశేషం ఏమిటంటే, బంది విముక్తి బంధనాలు తొలగినప్పుడే అన్న పాట జైలు ఖైదీల గురించి రాసింది. ఇందులో మిత్ర కూడా ఇంత విస్తతిని ఊహించి ఉండడు. అది ఖైదీల పాట. అల్లమన్న అన్నట్టు, నీళ్లల్ళో చేపల్లా జనంలో మమేకమై జనకేతనంగా ఎగిరిన వాళ్లు బంధీలైతే ఎలా ఉంటుందో చెప్పే పాట. తెలంగాణను ఖైదు చేసిన పాట. అంతకన్నా ముఖ్యంగా తెలంగాణను బందీఖాన నుంచి విముక్తి చేయగల ఉద్యమ నేత పాట. అట్లా ఆ పాట రాయడం, దాన్ని పాడటం వల్ల ఈ ఇద్దరి యుగళగీతం మలి తెలంగాణ దశలో తెలంగాణ విముక్తిగీతంగా పరిశీలించవచ్చు.

ఈ పాట అనే కాదు, మొత్తంగా మిత్ర కవిత్వంలో తెలంగాణ బందీ అయి వుండటం, దాన్ని విముక్తికి ఉద్యమం అవశ్యమై ఉండటం విస్తతంగా కనిపిస్తుంది. రేపు పోరాటం అనివార్యం అని తెలిసి ఉండటం. తక్షణం వలసాధిపత్యం నశించాలనే కాదు, అంతర్గత ఆధిపత్యం రూపుమాసి పోవాలని కూడా. అందుకే తన పాటల్లో వాస్తవికత పాళ్లు అధికం. అందుకే తాను తెలంగాణపై రాసిన పాటల్లో ఈ బందీతనం ఒకటి అంతర్లీనంగా సుడులు తిరుగుతూ ఉంటుంది. జాగ్రత్తలు చెప్పడం, అప్రమత్తత ఉన్నట్టే సన్నద్ధం చేయడమూ ఉంటుంది. బహుశా ఈ కారణం వల్ల కూడా తన కవిత్వంలోకి చేరినంత విస్తతి బహశా మరే తెలంగాణ పాటగాడిలో కనిపించదు.

ఇంకా చూస్తే, బందీ అన్న భావనకు విస్తరణగా తెలంగాణ తల్లీ పయిలమా అన్న తన పాట ఒకటి చూడాలి. ఈ పాటలో తల్లిని పయిలమా అంటడు. అందుకు కారణం తాను ఇక్కడ ఉండకపోవడం. అప్పుడు సూరత్ జైల్లో బందీ అయి వున్నడు. నువు బంధ విముక్తిగాక ముందే నే బందీనైపోతిని అంటూ విచారించడాన్నీ ఇక్కడ చూస్తాం. ఇదొక రకంగా ఉద్యమ సమయంలో తాను ప్రజల చెంత ఉండని స్థితిని తెలుపుతుంది. అలాగే, తెలంగాణ తల్లి కాళ్లు కడగ వస్తనే అన్న పాటలో చేర వస్తనే&చెఱ వీడి వస్తనే అని తండ్లాడుతడు. ఇందులో కవి వ్యక్తం చేసిన ఆర్తి ఈ పాటను గొప్ప స్థాయికి చేరుస్తుంది. మలి తెలంగాణ ఉద్యమంలో అపూర్వమైన పాటల్లో ఒకటిగా ఈ పాటకున్న విస్తతిని తప్పక గమనించాల్సి ఉంది. దీనికి కారణం తెలంగాణ తల్లి విముక్తికి చేరువవడమేమో అని అనిపిస్తుంది. బహుశా కవి సమయం ఇలాంటివి రాయిస్తుందేమో!

మిత్ర చాలా పాటలు రాసిండు. మొదట మానేటి పాట సంకలనం (1994) వచ్చింది. తర్వాత మిత్ర- తెలంగాణ పాటలు-(2009) ఆ తర్వాత వరుపు (వాన వెలిసిన తర్వాతి వరుపు-2011), పొదుగు, మిత్ర-జనం పాటల సవ్వడి (2012) లు వచ్చాయి. చితాభస్మం లోంచి పేరిట తన వచన కవిత్వమూ (2008)పుస్తకంగా వచ్చింది. అయితే, తన పాటలో వస్తువు చాలా భిన్నంగా ఉంటుందని గమనించాలి.
తాను తెలంగాణ చరిత్ర మీద రాసిండు. సంస్కతి మీద రాసిండు. హైదరాబాద్ మీద రాసిండు. నూరేండ్ల తెలంగాణ చరిత్రను ఒక బ్యాలేగానూ రాసిండు. ఎందుకు కాలిపోతవు&నువ్వెందుకు రాలిపోతవు అని అమరుల గురించి రాసిండు.

బంగారు మాయలేడి అంటూ పోలవరంపై పాట గట్టిండు. ఒక రకంగా ఉద్యమాన్ని ఉత్తేజితం చేస్తూ, నిరాశా నిస్పహలను పారదోలుతూ, ప్రజల్ని ఒక్కటిగా చేర్చడానికి రాసిండు. అట్లే ఒకడుగు ముందుకు వేయడానికీ రాసిండు. ఈ ఒకడుగు ఆ ముందడుగు అన్నది విప్లవం. ఒక్కటి చేయడం అన్నది తెలంగాణ. ఈ రెండు దిశలా తన కవిత్వాన్ని (పాట) పరిశీలించవలసి ఉన్నది. మూడవది వచన కవితా రీతిని పోలిన తన శైలి. అనేక అంశాల కలబోతగా ఉన్న శిల్పం.

మిత్ర ఇంకా చాలా పాటలు రాసిండు. ఫ్లోరైడ్ కన్నీళ్లపై కొంకర్ల చేతులు వంకరగనే కాల్లు అని రాసిండు. ఓపెన్‌కాస్ట్ బావులపై నాగేటి సాల్లల్లో నాలబొయ్యారాలు అని రాసిండు. కరువు మీద పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా అని రాశిండు. ముంబై గట్టిన తెలుగు శిల్పులం&మా ముంబా ఆయికి దత్తా పుత్రులం అని దేశం బయట ఉన్న వాళ్లను ఐక్యం చేసి, తెలంగాణకు మద్దతుగా నిలిపిండు. అయితే, తన పాటల్లో జానపద బాణీలు లేవెందుకని అన్నప్పుడు వందలాది పాటల్లో పదిరవై ఉంటై అన్నడు. దుంకు దుంకర ఆశన్న&నువు దుమ్ము లేపర ఊశన్న అంటూ కొన్నింటిని ప్రస్తావించిండు మిత్ర. అయితే, ఇక్కడ ఒక అంగీకరించవలసిన విషయం ఏమిటంటే- తాను పాట రాసినప్పటికీ ప్రధానంగా కవిగానే, వచన కవిగానే కనిపిస్తడు. (అయితే, తనది లయబద్ద కవిత్వం.) కాగా, ఆ కవితలే విమలక్క గళంలో పాటలుగా వినవస్తయి. ఒక రకంగా తన పాటల్లోని ఇతివత్తం లయ కలగలసి విమలక్క కారణంగా గానమైనట్టుగా, గాన ప్రవాహ మైనట్టుగానూ ఉంటుంది.

అయితే, జానపద బాణీలు తక్కువగా ఉండటానికి ఒక కారణం తాను ఎనిమిదవ తరగతి నుంచి విప్లవోద్యమంలోకి ప్రవేశించడం, జీవితానుభవం కొరవడటం. విప్లవానుభవమే జీవితం కావడం. ఇలా అనడం సాహసమే కానీ వాస్తవం. అయితే, మలి తెలంగాణ ఉద్యమం, చర్చల సమయాన తాను అజ్ఞాతం వీడి బయటకు రావడం, తత్ఫలితంగా తాను బాల్యావస్థలో గడిపి యవ్వనంలో అప్రధానం చేసిన దళిత బహుజన జీవితం, సాంస్కతిక చిహ్నాలూ అన్నీ మననంలోకి వచ్చాయి.

ఇది దేవులాట కూడా కాదు. బంధనాలు వీడాక కానవచ్చే వైశాల్యం. ఆయా స్థలాల్లోకి అడుగిడగానే అవి విశాలంగా తనను అక్కున చేర్చుకున్నయి. నిదానంగా తన పాటలో పల్లవులుగా మారిపోయాయి. చెప్పదలచింది ఏమిటీ అంటే, ప్రజల బాణీల కొరత. అది జీవితానుభవాన్ని పొందడానికి వీలు లేని కల్లోలిత ప్రాంత స్థితి. ఆనాడే జైలు జీవితం (1978)- అక్కడ్నుంచి ఉద్యమమే జీవితమై పోవడం. అమరుల త్యాగాల నుంచి మళ్లీ ప్రాణధారగా పాట అల్లుకోవడం. అది మెలమెల్లగా తనను కవిని చేయడం. కార్మిక కర్షక శ్రామిక విముక్తిని స్వప్నించే విప్లవాచరణలో నిమగ్నం చేయడం. కవీ కార్యకర్తా విప్లవనేతా కలగలసి పోవడం. ఇదే తన బలం- బలహీనత. ఇంకో రకంగా చెప్పాలంటే తాను పాట గట్టింది చరిత్రలో నిలిచిపోవడానికి కాదు. ప్రజల్ని ఉర్రూత లూగించడానికి కాదు. ఒక ఆచరణలో, రాజకీయ కార్యక్రమంలో భాగం కావడమే తన ఉద్దేశ్యం. అదే తన కవితా న్యాయం.

నిజానికి తన తెలంగాణ పాటలన్నింటిలో కూడా అదే ధోరణి కనిపిస్తుంది. పాట పాట కోసం కాకుండా విముక్తి గేయంగా రూపొందడం చూస్తాం. తన మాటల్లో చెబితే, వలస విముక్తి ప్రధానంగానే తాను ఆయా అంశాలను ఆశ్రయించి పాట గడుతడు. నిజానికి ఆరు అంశాలు. తన మాటలో సిక్స్ కరెంట్స్- కులం, లింగం, మతం, ప్రాంతం, జాతి- మొత్తంగా సమాజం. వీటన్నిటి విముక్తి ప్రధానంగా సాగిస్తున్న ఉద్యమంలో తాను పాటను అనివార్యంగా పేనిండు. విశేషం ఏమిటంటే తన వచన కవితా కౌశలం కారణంగా విన్నకొలదీ వీనుల విందయ్యే పాట అది. మెలమెల్లగా శ్రోతల అవగాహన పెంచే బాట అది. తద్వారా తన పాట కార్యశీలత అంతా కూడా తక్షణావసరాలను స్పశిస్తూనే దీర్ఘకాలిక అంశాలపై ఒక దక్పథాన్ని పెంచేలా ఉంటుంది.

ఇదంతా ఒక విప్లవ కవిగా తాను తనపై ఎంచుకున్న గురుతర బాధ్యత. ఆ బాధ్యత కారణంగా తెలంగాణ నిర్దిష్టతతో మిత్ర పాటలు రాసినప్పటికీ అవన్నీ వెంటనే గుండెల్ని ఉప్పొంగించవు. కానీ, బుద్ధిబలాన్ని పెంచుతయి. వివేచనను కలిగిస్తయి. మార్మికంగా వచన కవితల్లా భావుకతను పంచుతూ ఆలోచనా కెరటాల్లో ముప్పిరిగొనేలా చేస్తయి. అయితే, మిత్ర పాటల శైలీశిల్పాల నుంచి విమలక్క జోడించిందేమిటంటే, ఆ పాటల్ని ఆర్ధ్రంగా ఎత్తుకుని వడిసెలలా విసరడం. సున్నితంగా మొదలై లడాయికి లేపడం. ఒక స్పైరల్‌లా గిరగిరా తిరుగుతూనే పైకి ఎగయడం. ఆ పని విమలక్క గొంతు బలంగా చేయడం వల్ల మిత్ర పాటలు తక్షణ ఉద్యమ అవసరాలను తీర్చాయనే భావించాలి.

చలో ధూం దాం...
చలో ధూం దాం అనగానే ఒక ఉత్సాహం. సంతోషం. ఒక బందగానం. ఉద్యమ ప్రతీక కూడా. అభివద్ధి గురించి, జలవనరుల గురించి, దోపిడీ చరిత్ర గురించి చెప్పే ఈ పాట మనదైన చరిత్రను, సాంస్కతిక వైభవ చిహ్నాలను గానం చేస్తూ ఒక గొప్ప ఊపును పంచుతుంది. పాటలోని చరణాలు కేవలం ఊపును పంచడం కాకుండా దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా- పందెం కాద్దాం, లడాయి చేద్దాం. తరిమి కొడదాం, దండు కడ్డాం అంటూ పోరాటానికి సమాయత్తం చేయడం మరో ముఖ్య విశేషం.

విమలక్క పాడుతుంటే ఒక చెప్పనలవికాని బీట్, లయ, తాళం-ఒక్కటని కాదు- డప్పు, కోలాటం, దరువు- తీన్‌మార్-అన్నింటి కలగలుపుగా విమలక్క పాట- ఆ గానం-చిన్నగా కదులుతూ తాను చేసే ప్రదర్శన -పాటను మరోస్థాయికి చేరుస్తుంది.
మత్తడి దుంకి అలుగు తన్నుకుని పారినట్లు అని పాడుతుంటేనే ఒక సంరంభం. మత్తడి దుంకుతుంటే ఇంకేం కావాలి? ఇక ఇంకెవరి ప్రమేయం అక్కర్లేని స్థితి. ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న వైనం. దాన్ని సుతిమెత్తగా చెబుతూనే మెత్తటి గుండెలు సైతం నగారై మోగినట్లు అనడం. దీనర్థం ఒక నాదం. మహోన్నత రూపానికి చేరుకున్న తెలంగాణ ఉద్యమ నినాదం. బోనం ఎత్తుకుని శివసత్తులు దుంకినట్లు..ఇదొక స్థితి. వివిధ ప్రతీకలతో ఉక ఉద్విగ్న ఉత్తేజభరితమైన సన్నివేశాలతో ఈ పాట ఒక చలన సంగీత గీతం. పాటలో చలో ధూం.. దాం& అంటుంటే అది ఉద్యమ స్పహను పదే పదే యాది చేయడం. అయితే, ఉద్యమం ఈ స్థితికి చేరుకోవడానికి కారణం త్యాగాలు. అందుకే మున్నూట పానాల మునుమే ఇదిరా అంటూ 1969 నాటి త్యాగాలను గుర్తు చేస్తడు మిత్ర.

ఇట్లా ఇంతటి స్థితికి చేరిన తెలంగాణ ఉద్యమాన్ని, ఊర్లన్నీ జాతరకొచ్చెరా అంటూ పాడుతుంటే, అందుకు దోహదకారి అయిన చరిత్రను అన్యాపదేశంగా గుర్తు చేయడం మిత్ర నిర్మాణ పద్ధతి. కార్యకారణ సంబంధాలను సుతారంగా జారవిడువటం. అందుకే, మున్నూట పానాల మునుమే అంటడు.
ఉప ఎన్నికల సమయంలో అన్ని పక్షాలూ తెలంగాణ వాదానికి మద్దతుగా నిలిచినప్పుడు వచ్చిన ఈ పాట- ఉద్యమంలో విప్లవపక్షాలు కూడా తెలంగాణ తండ్లాటకు తప్పనిసరి పరిష్కారం కోసం నిలబడ్డ రీతిని గుర్తు చేస్తది. ఇందులోని ఈ పాదం&సుడిగాలై కరీంనగర్ సుట్టూకొస్తే&రంగూ రంగులా జెండలన్ని ఎలిసిపాయెరా అనే పాదాలు మలిదశ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ అని కాదు, తెలంగాణ సాధనకు పార్లమెంటరీ తరహా ఎన్నికల ఆవశ్యకతను సానుకూలంగా చూడక తప్పని స్థితిని గుర్తు చేస్తయి.

డోలు, డప్పు వంటి దళిత బహుజన వాయిద్యాలతో కాముని పాటలు, జాజిరి ఆటలతో కూడిన ఈ పాట నిజంగానే నాడే తెలంగాణ వచ్చిందని సాటింపు చేసిన వర్తమాన గీతిక. తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వక తప్పని స్థితిని గుర్తు చేస్తూ ఢిల్లీని వణికించిన భవిష్యత్ పాట. సకల జనులూ తెలంగాణకు మద్దతుగా నిలబడి గెలుచుకున్న విజయ గీతిక.

పాటలో కూలిన మన సెరువులకు పానాలొచ్చురా అనడంలో అందునా సెరువు అనడంలో కరీంనగర్ భాషా, యాసలు స్పష్టమైతయి. ఇట్లా మిత్ర పాటల్లో నిర్దిష్టత వస్తువు విషయంలోనే కాదు, వాచకం, పలుకుబడుల విషయంలోనూ ప్రధానంగా సాగడాన్నీ చూస్తం.
దోపిడీకి ద్రోహాలకు తావొద్దురా&ఎములాడ రాజన్న పబ్బతి పడదామురా అనడంలో కవి మూలం ఒకటున్నది. అదే సమయంలో ఎగిరెగిరి తెలంగాణ ఉట్టి కొడదామురా అని లేవడంలో సాధించాలంటే పోరాటమే అన్న వాణీ వినవస్తుంది. నిజానికి మొత్తం పాటలోని ఈ చివరి చరణాలు తనకు చాలా ఇష్టమని విమలక్క చెప్పింది.

మిత్ర అంటాడు, పల్లె సద్దుల అనే ప్రయోగంలో గ్రామీణ సమాజంలోని ఇచ్చుపుచ్చుకునే ధోరణిని గుర్తుచేయ ప్రయత్నించిన అని! నిజమే. మిత్ర ఇట్లా చాలా గుర్తు చేసుకుంటడు. మలి తెలంగాణ తన తొలి గుర్తులను తెలియజెప్పింది. విప్లవ జీవితంలో అప్రధానం అయినవన్నీ మళ్లీ యాదికి తెప్పించింది. అందుకే తన పాటల్లో మత్తడి దుంకుతుంది.
పాటలో చివరగా, పల్లె పల్లె తెలంగాణ పాలన నడపాలిరా అనడంలోనూ అంతే నిర్దిష్టత. వికేంద్రీకరణ రేపటి ఆవశ్యతక అని గుర్తు చేయడం, ప్రాంతీయ ప్రజాస్వామ్యమే అంతిమం అని ఎలుగెత్తడం. ఇట్లా మలి తెలంగాణలో మిత్ర పాట నవ తెలంగాణకు దారి చూపుతున్నది.


తెలంగాణం నుంచి నవతెలంగాణకు...
నిజానికి అరుణోదయ 96లోనే తెలంగాణం పేరిట పాటల పుస్తకం తెచ్చింది. మళ్లీ కొత్తగా గత పక్షం కింద నవ తెలంగాణ పేరిట సీడీ తెచ్చి ప్రజా చైతన్యయాత్ర ప్రారంభించింది. ఒక రకంగా మలిదశ ఉద్యమం విస్తరణ సమయంలో తెచ్చారు, నేడు పునర్నిర్మాణ సమయంలో మరొక సీడీ తెచ్చారు. మధ్యలో చాలా వచ్చాయి. మిత్ర పాటలు వందలే వచ్చాయి. అయితే, పాటకు కార్యక్రమం ఉండటం తన బలం. అందువల్లే వాటిల్లో మారుమోగినవి కొన్నయితే, ఉద్యమ కార్యకర్తల ద్వారా ప్రజల్ని ఉత్తేజితం చేసినవి మరికొన్ని. అయితే, ముందే చెప్పినట్టు ప్రతి దశనూ, ఘడియ ఘడియనూ మిత్ర పాటను చేయడం గమనించవలసిన విషయం. అవి విన్నవాళ్లు చాలా మందే ఉంటారు. కానీ ప్రాచుర్యం కన్నా ఉద్యమ విస్తరణే వాటి లక్ష్యం అని పేర్కొనాలి.

జనరంజకం కన్నా జనశక్తి కావడమే తన బలిమిగా చూడాలి. కాగా, మొత్తంగానే, తన పాటల్లో బాగా పాపులర్ అయినవి-ఆడుదాం డప్పుల్లా దరువేయ్‌రా&ఒకటైతే, చలో ధూం దాం..తెలంగాణ జాతరొచ్చెరా రెండవది. అట్లే పాడరా పాడరా మన పాటా.. గొప్ప ప్రతీకలతో జన తెలంగాణ పాటను ప్రతి నోటా పాడుకునేలా అత్యున్నత సాంస్కతిక ప్రతీకలతో రాగయుక్తం చేసే పాట. అంతేకాదు, జయశంకర్ సార్‌పై, బియ్యాల జనార్ధనరావుపై, కాళోజీపై అట్లే సర్దార్ సర్వాయి పాపన్నపై-ఇట్లా మన ముద్దుబిడ్డలను పోరు పతాకాలను తెలంగాణ ఉద్యమం ఎల్లవేళలా తల్చుకునే రీతిలో రచించి, వారిని మలిదశ ఉద్యమంలోకి పాటగా ప్రవేశపెట్టిన ఘనతా మిత్రదే. ఇట్లా తన మలిదశ కవి సమయంలో మహత్తర పాత్ర పోషించిన మిత్ర విప్లవోద్యమ ఒరవడిని తెలంగాణ పాటలో స్పజించిన తీరు ప్రత్యేకమైంది. విస్తతమైందీనూ.


ఎములాడ రాజన్న పబ్బతి పడదామురా... ఎగిరెగిరి తెలంగాణ ఉట్టే గొడ్తామురా

కందుకూరి రమేష్ బాబుhttp://namasthetelangaana.com/Sunday/article.asp?category=10&subCategory=9&ContentId=360775

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]