Full width home advertisement

Post Page Advertisement [Top]


Telangaanaతల్లీ తెలంగాణమా తనువెల్ల  మాగాణమా
పురివిప్పిన గానమా పూసిన పున్నాగమా
గర్భాన సింగరేణి గళమున మధురవేణి
సిరుల గిరులతోని విరజిల్లే మేటి ధరణి
మరియాద నీతి నెనరు గుణముల శ్రేష్టమణి

ఎగిసేటి గోదారి ఎదపైని చంద్రహారం
నీలవేణి కృష్ణ నీ కాలి అందె రవళి
పెనుగంగ ప్రాణహిత కిన్నెరసాని మోత
ఆ సిలుకవాగు సిందు పాలేరు కనువిందు
శభరి చంద్రవంకలు సెలయేటి పాల ఏరులు
జలతారు అలల కొండలు తల్లి మెడలో దండలు ॥ తల్లి తెలంగాణమా ॥

గిరుల మీద గిరులు ఆ భువన యాదగిరులు
కోటలొరుస కోటలు ఆ వర్థమాను కోటలు
బండమీది కొండలు భద్రాద్రి గోలుకొండలు
అందంగ ఇసుక మేటలు అంచున ఎగిసె ఊటలు
పేరైన ఓరుగల్లు దానిసుట్టు రాతిగుళ్ళు
గత చరిత్ర ప్రాకారాలు ఘనమైన ఆనవాళ్ళు ॥ తల్లి తెలంగాణమా ॥

వేములాడ రాజన్న మన వేల్పురోరన్న
కొముల్లి మల్లన్న - మన కొలుపురోరన్న
జీనుపాడు సైదన్న సూఫీల తలుపురన్న
సాకవోస్తే సాలు - సమ్మక్క పూజమేలు
పానుగంటి బాలపీర్లు పాత్యాలు కందూర్లు
ఊరూరా శిలాతేర్లు జాళ్ళూరే అల కొలనులు ॥ తల్లి తెలంగాణమా ॥

తలిసితే తలుపు తట్టే ఉద్దాల మూర్తి పెట్టె
ఆపదల కొండగట్టు అంజన్న కెవరు బెట్టు
మేటైన ధర్మపూరి తీర్థంపు పుణ్యదారి
చాటింది స్థలపురాణం మావిళ్ళపల్లి గానం
దోసిట్లో జ్ఞాన తీర్థం బాసర పుణ్యక్షేత్రం
దీనుల పాలీ దీపం ఆ మెదక్ చర్చిరూపం ॥ తల్లి తెలంగాణమా ॥

కావ్యజగతి నేలె పోతన్నదీ నేలే
కథలల్లిన గుణాఢ్యుడు ఈ కన్నతల్లి సుతుడే
పాటైన ద్విపద పరుగు మన పాలకుర్తి నురుగు
బుద్దన్న ఖ్యాతి నిలిపె - కవిభువనమై వెలిసె
అలరించె చాటువులతో అప్పయ్య కీర్తి నిలిసె
రంగైన పద్యరాగం అలసింగ భూపాలం ॥ తల్లి తెలంగాణమా ॥

శతకాల పత్ర శకటం శేషప్ప కొప్పె మకుటం
బాగయ్య పాట దరువు ఎల్లమ్మ కాలి అడుగు
అలరించె భాగవతుల కన్నట్టి వెన్నచర్ల
మళయాల తోర మావిడి కవి తోరణాల నాడి
రాకామచర్ల బాణి వేపూరి కాలజ్ఞాని
జగమొప్పిన శతపత్రం గడియారం గుడిదస్త్రం ॥ తల్లి తెలంగాణమా ॥

కాళోజి దాశరథులు ఈ ధరణి కావ్య ఋషులు
గుమ్మాడి విఠల్ రాగం ఈ నేల గుండె తాళం
కవి పాలమూరు కీర్తి చాటిండు లింగమూర్తి
పద్యాలబాట పోంటి పయనించె వేముగంటి
జానపదుల జ్ఞానరాజు ఆ బిరుదు రామరాజు
ఇమ్మడిశెట్టి కవనం తలవొంచెనెల్ల భువనం ॥ తల్లి తెలంగాణమా ॥

కవిత్వ మర్మయోగి గుండూరి హనుమశర్మ
చరిత్ర సారమెల్ల సురవరమె చాటెనెల్ల
బాటల్ల తోటలల్ల బంతైన ఆటలల్ల
అణువణువు మీటెనల్ల తను రాగమల్ల
పదునెక్కి పాటలల్ల కదిలిన ఊరులెల్ల
బరిసేల మెరుపులేగన్ నైజాము మూక లేగన్ ॥ తల్లి తెలంగాణమా ॥

వడిసేల మెరుపు ‘రావి’ బరిగీసి నిలిసె ‘డీవి’
వెయ్యేనుగుల బలం బి.ఎన్. జన్మస్థలం
కన్నీటి పల్లెరాగం - సుద్దాల కదనయాగం
నిర్వికారి త్యాగి ఆ రామనాథమోయి
మట్టిచేత దీపం ‘మారోజు’ పోరు రూపం
తిరుగబడ్డ వీణ ఐలమ్మ పోరుసేన
వీరుల గిరుల కోన ఇది త్యాగాల తెలంగాణ ॥ తల్లి తెలంగాణమా ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]