Full width home advertisement

Post Page Advertisement [Top]

తెలంగాణ పాటలోకి దళిత బహుజన మైనారిటీ పారిభాషికా పదాలను, ముఖ్యంగా వారి సాంస్కతిక చిహ్నాలను తెచ్చి పాటను పరిపుష్టం చేసిన తీరు అభినందనీయం. ఆంతేకాదు, తన కవిత్వం ద్వారా హిందూ ముస్లింల సమైక్య జీవనాన్ని, ఊరుమ్మడి సాంస్కతిక అస్తిత్వాన్ని బలంగా ముందుకు తెచ్చిండు శ్రీను. అస్సోయ్ దూలా పాట ఒక్కమాటలో తెలంగాణ సమైక్యతకు నిండు నిదర్శనం.

కోదారి శ్రీను. ఇది తన కలం పేరు. సాయుధ పోరాట వీరుడు కొమురయ్య (దొడ్డి) స్ఫూర్తితో తాను ఆ దారిని ఎంచుకుని కోదారి శ్రీను అయిండు. ఈ బిడ్డది నల్లగొండ జిల్లా ఆలేరు దగ్గరి గంగాపురం. చదివింది డిగ్రీ వరకే. కానీ, తాను అరుణోదయ పాఠశాల నుంచి వచ్చిన కవే అని గర్వంగా చెప్పుకుంటడు. కులం రీత్యా తాను గౌడు. నిజంగానే గీతకారుడు. పాటలోకి కల్లును ఎంకన్న తెచ్చిండంటం గని మలిదశ ఉద్యమంలో తాను మిగతా ప్రతీకలను ఎన్నింటినో తెచ్చిండు.

తాను 1998 నుంచి తాను మలిదశ ఉద్యమంలో కీలకమైన పాటలు రాసిండు. 1999లో పైలం అన్న సీడీలో తనను కవిగా నిలబెట్టిన బొంబాయి వోతున్న అమ్మ మా యమ్మ పాట రికార్డయింది. అది కూడా మిత్ర విమలక్కల పాటలతో పాటు వచ్చింది. ఆ పాటను పుష్ప, సంతోష్‌లు పాడారు. తర్వాత అది కొన్ని వేల ప్రదర్శనలుగా ప్రజలకు చేరువైంది. అదీ మొదలు, ఇంకా చాలా పాటలు. తన పాటల పుస్తకం రాలేదుగానీ ప్రజల చెంతకు ఎన్నో పాటలు వెళ్లిపోయినయి. గూడ అంజన్న, వెంకన్నల తర్వాతి తరంలో విస్త్రతి ఉన్న ఆధునిక కవి శ్రీను. అయితే మలి దశ ఉద్యమంలో తాను బలమైన పాటలు గట్టిండు. బతుకమ్మ పండుగకు ఆడిబిడ్డను తెచ్చుకోలేని అన్నదమ్ముల దైన్యాన్నీ పాటగా గడతడు. అయితే, ఏ పాట రాసినా, తెలంగాణ దుస్థితికి కారణం ఉందని, అందుకు కారకులు ఎవరో చెప్పడమూ తన పద్ధతి.

చిత్రమేమిటంటే, తన విస్తతి. బొట్టు, బోనం, బతుకమ్మల వరకే కాదు, తాను భయానకం, రౌద్రంతో కూడిన పొలికేక దాకా వెళ్లిండు. పొలిగంప తీసుకుని వడివడిగా సాగి మన పొలిమేరల్లో పీడనను తొలగించేందుకు కొత్త అక్షరాలను బలి చల్లిండు. తెలుగు పాట సాహిత్యంలోకి దళిత బహుజన, ముస్లింల పండుగ పబ్బాలను సంస్కతి ఆచారాలను ఉద్యమ సోయితో విస్తత పరిచిండు. పూజలు, నైవేద్యాల స్థాయిలో- పసుపు, కుంకుమ, బుక్క గులాల్, గంధం సువాసనల స్థాయిలోనే -గుగ్గిలం, మైసచ్చి, యాప రెల్లలను పాటలోకి తెచ్చిండు. కల్లు శాఖ, బెల్లం శాఖలను, ఊదు బిల్లలు, మలీద ముద్దలు, అగరుబత్తీలు, సబ్జాకు దండలు, దట్టీలు, మట్కీలు, పీరులు బాయిల వడే రోజు చేసే సొంగ రొట్టెలు- ఇలాంటివెన్నో తెచ్చిండు. వాడ కదిలె ఉయ్యాలో వరస నడిసె ఉయ్యాలో అంటూ పాటను బహుజన మార్గం పట్టించిండు.

భిన్న అస్తిత్వాల ఊరుమ్మడి సమైక్యతా చిహ్నాలను అలవోకగా తెచ్చి పాటను పరిపుష్టం చేసిండు. దాపరికం అన్నది లేకుండా తాను శూద్ర కులాలకు చెందిన తెలంగాణ తిండిని సగర్వంగా వ్యక్తం చేసిండు. చియ్య కూర అని చెబుతడు. పోగు అంటడు. కాముని కల్లు చెప్పమంటడు. వీటన్నిటితో పాటు పెండ, ఎర్రమన్ను అలుకు పూతలు- కచ్చురాలు-ఇవన్నీ తన పాటలోకి వచ్చినయి. రామరామ రామ ఉయ్యాలో&రాఘవ రామ ఉయ్యాలో& జనం కదిలి ఉయ్యాలో&జెండాలెత్తి ఉయ్యాలో&అంటూనే ఇంకో పాటలో ఉద్యమాల ఉర్సుకు పోదాం జాతర అని హుషారెక్కిస్తడు. అట్లే, జాన్‌పాడ్ సైదులు, అన్నారం షరీఫ్ ఉర్సుల ప్రస్తావన బలంగా తెస్తడు. ఇట్లా తెలంగాణ పాటను మెజారిటీకి దగ్గర చేసిండు. విస్తతిని పెంచిండు. ఉద్యమంలో సకల జనులంటే ముస్లింల కూడిక అన్న సంగతిని, ఆ స్పహను ఘనంగా ప్రకటించిండు కవి కోదారి శ్రీను.

అసోయ్ దూలా హారతి పాట కంటే ముందు ఒక చిన్న విషయం. తాను రాసిన పాటల్లో అత్యంత ప్రభావశీలమైన పాట ఉండు పైలం గుండు అమ్మ మా యమ్మ&ఇల్లు పైలం జూడు తల్లి మాయమ్మ&. ఈ పాట మొదలు వేరు, తుది వేరు. ప్రారంభం వేరు, ముగింపు వేరు. పాట ప్రారంభంలో దేశం పోతుంటడు తెలంగాణ బిడ్డ. చివర్లో పోనని, ఇక్కడే ఉండి లడాయి జేస్తనని నిర్ణయించుకుంటడు. ఇలా లడాయి చేయ నిర్ణయించుకుని తనవలే వందలు, వేలు, సకల జనులూ ఆ లడాయిలో నిమగ్నమైన తరుణంలో, 1998లోనే యావత్ తెలంగాణ పోరాటానికి సమ్మతించి సర్వసన్నద్దం అయిందని తెలియజెప్పే పాటే అసోయ్ దూలా హారతి. ఈ పాటలో తెలంగాణ లడాయికి కదులుతున్న సమ్మతి అని సాగడంలో ఒక కొనసాగింపు ఉంది, దశాబ్దాలుగా తెలంగాణ పీడన నుంచి, వివక్ష అణచివేతల నుంచి ఎట్లా పోరాట బాట పట్టిందో తెలియజెప్పే ఇగురం ఉంది. ఇట్లా కోదారి శ్రీను పాటలన్నిటిలో ఒక అంతఃస్సూత్రం ఉంది. అది తొలుత దుస్థితి. తర్వాత మన స్థితిని మనమే నిలబెట్టుకునే పోరాట స్థితి.

చిత్రమేమిటంటే, బతుకు దెరువుకని అమ్మ మా యమ్మ. బొంబాయి వోతున్న తల్లి మా యమ్మ అన్న పాటలో తల్లి ముందు బిడ్డను బతిమిలాడుతుంది, బొంబాయి పోకురా అని. చివర్లో పక్కనే కష్ణమ్మ పరవళ్లు తొక్కినా ప్రాజెక్టులు వాళ్లకు పాట్లేమో మనకా అని కొడుక్కి ఎరుక చెప్పుతుంది. పోరాట దిశను చూపుతుంది. దాంతో దూర ప్రయాణం వదిలిపెట్టి అస్తిత్వం నుంచి పోరాట బాట పడుతడు కొడుకు. విశేషం ఏమిటంటే తల్లికి అన్నీ తెలుసు. తెలంగాణన తల్లిలా కానవస్తుంది ఆ పాటలోని తల్లి మనసు. తర్వాత అస్సోయ్ దూలా పాటలో కొడుకు కనబడతడు. తల్లి మనసెరిగి పోరాటంలో రాటుదేలిన, చైతన్యవంతమైన పోరు బిడ్డ కానవస్తడు. అట్లా శ్రీను మొదట తెలంగాణ తల్లి తన అస్తిత్వాన్ని తెలియజెప్పే కవిత్వం రాసిండు. ఆ ఆస్తిత్వం నుంచి పోరు బాట పట్టిన విధానమూ రాసిండు. ఒక రకంగా ఈ కవి విశిష్టత తల్లీబిడ్డల చేతన. తొలితరం మలితరం కలబోత. బహుశా అందుకే కాబోలు అనేక పాటల్లో కొడుకా అన్ని పిలుపు వినిపిస్తుంది. బిడ్డా అన్న సంబోధనా ఉంటుంది.

మరో విషయం. శ్రీనుది గుండె కవిత్వం. పాటల్లో, ప్రతీకల్లో నల్లగొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ అనడంలో తాను గుండె పగిలే తెలంగాణ జీవితాన్ని కైగట్టడం ప్రధానంగా ఉంటుంది. ఎడబాటు అనేక పర్యాయాలు వివిధ పాటల్లో ఇతివత్తంగా ఉంటుంది. ఎడబాసే రోజొచ్చె అన్న విలాపమూ ఉంటుంది. అది అనేక రకాలుగా గుండెను మెలిపెడుతుంది. అందుకే బొంబాయి పాట విన్న మనిషి ఏడ్వకుండా ఉండలేడు. ఇదే సమయంలో గుండెను ధిటవు చేసుకుని పోరాటంలో నిమగ్నం కాకుండానూ ఉండలేడు. అదే ఈ కవి విస్తతి. నిజానికి మలిదశ ఉద్యమంలో తాను రాసిన అనేక పాటల్లో ఈ అంశం పరివ్యాప్తం అయింది. ఉదాహరణకు కరువు గురించి రాసినప్పుడు రైతుకూ భూమికీ మధ్య ఎడబాటు. అదే కరువు తల్లికీ బిడ్డకూ మధ్య ఎడబాటు తెచ్చింది.

అట్లే పుట్టిన ఊరుకూ కుటుంబానికీ ఎడం చేసింది. ఆ అనివార్యమైన ఎడబాటే మళ్లీ తెలంగాణ సాధనకు సన్నద్ధం చేసింది. అట్లా శ్రీను పాటలో ఈ అంశం కీలకమైన వస్తువుగా మారి, మస్కట్ పోయే నాయి మామా&తిరిగి రావే సెందురయ్యా అనేలా చేసింది.

కాగా, ఇటీవల తాను రాజకీయ ఆరంగేట్రం అన్నది అబద్దమని. పాటగాడికి పార్టీ ఉంటుందా? అని కొట్టిపారేసిండు. అభినందన పూర్వకంగా ఒక నేత కండువాను తన భుజాన ధరింపజేసిండే గానీ నేను కాంగ్రెస్‌లో చేరలేదని, పాటే నా రాజకీయ ఎజెండా అని చెప్పిండు. చెబుతూ మనవాళ్లా పరాయివాళ్లా అని కాదు, ప్రజల పక్షమే పాట. పాటగాడు అని చెప్పిండు.
చివరగా, అసొయ్ దూలా హారతి పాట గురించి అడిగితే అది దూలా పాట ప్రేరణగా రాసిందని కోదాడి శ్రీను వివరించిండు. అయితే, ఆ దూలా పాట ఉత్సాహాన్ని పంచుతుంది. మరి నా పాట ప్రజల్లో ఉన్న బాధను వెళ్లగక్కింది. పోరాటానికి సయాయత్తం చేసింది అని తన కవి సమయానికి ప్రజల బాణి అక్కరకొచ్చిన వైనాన్ని వివరించిండు. నిజానికి భావాన్ని ఒక దాని మీద పెట్టి సుదీర్ఘంగా సాగే పీర్ల పండుగ నాటి ఆటపాట అది. దాని బాణీని తీసుకుని నేను పాట గట్టిన. ప్రజల నుంచి పుట్టిన పాటను నేను ఉద్యమంతో రంగరించి మళ్లీ ప్రజల చెంతకు తెచ్చిన అని సంతోషంగా వివరించిండు.


అస్సోయ్ దూలా హారతి... కాళ్ల గజ్జెల గమ్మతి
తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి
అస్సోయ్ దూలా హారతి కాల్లగజ్జెల గమ్మతి
తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి
మా ఆకలి కేకలే తెలంగాణ పిలుపులే
రాష్ట్రమొచ్చేదాకా ఇగ ఆగవు పొలికేకలే
॥ అస్సోయ్ ॥

పోరాటం పొద్దులయ్యి
ఎర్రకండ్ల పలుగులై
కుట్రదారు ఎత్తులను
తిప్పికొట్టె శక్తులై
పొక్కిలైన వాకిళ్లల్ల దుఃఖాలను తీర్చురా
ఎక్కిపడే పల్లెలను ఎదలకద్ది కదలరా
॥ అస్సోయ్ ॥

ఎన్నాళ్లీ సయింపులు
తెగతెంపుల తప్షజరుపు
ఎంతైనా ఏదైనా
తెగిస్తేనే తెలంగాణ
ఆంధ్రవలస వాదులారా ఎల్లకుంటే పాతరే
పల్లేపల్లే జరుగుతుంది తెలంగాణ జాతరే
॥ అస్సోయ్ ॥

ఆధిపత్య అహంకారులు
రియల్ ఎస్టేట్ కబ్జగాండ్లు
మనమీదా ఆంద్రోడేంది
ఎల్లగొట్టి ఏలుకుందాం
అటు ఇటుగాని కొజ్జాలు సమైక్యాంధ్రవాదులు
రాజకీయ నేతలు నాచులున్న కప్పలు
॥ అస్సోయ్ ॥

వివక్షల పాలనలతో
వికారపు బతుకుజేసి
వనరులన్ని మలుపుకొని
అణచివేత దోపిడాయె
గాయపడ్డ గుండెతడి దండయాత్ర తమ్ముడా
రగిలిరగిలి పొగలుతుంది తెలంగాణ తమ్ముడా
॥ అస్సోయ్ ॥


పిడికిలెత్త నేర్చినోల్లం
బరిసె లిసిరి ఉరికినోల్లం
నైజాముల తరిమినోల్లం
నాజీలను వంచినోల్లం
పరాయోన్ని తరమనీకి పెద్దపని కాదురా
పంపకము జరుగకుంటే అంతపని జరుగురా
॥ అస్సోయ్ ॥


పాట విశ్లేషణ

మెహర్రం పండుగ నాడు గుండం ముందు దూలా ఆడే వాళ్లం. ఆ చిన్ననాటి జ్ఞాపకాలే మళ్లీ పాటలోకి అలవోకగా వచ్చినయి. అయితే, ఆ పాట రాసింది కూడా పీర్ల పండగ రోజే. అదీ విశిష్టత అని చెప్పిండు శ్రీను.

ఛేల్& అసోయ్ దూలా హారతి&కాళ్ల గజ్జెల గమ్మతి. తెలంగాణ లడాయికి కదులుతున్న హిమ్మతి అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటలోని సిసలు ఊపు కోరస్. అవును. కోరస్. అసోయ్ దూలా అనగానే హారతి అని, కాళ్ల గజ్జెల అనగానే గమ్మతి అని కోరస్ వినిపిస్తుంది. ఒక రకంగా మొత్తం పాటనే ఒక కోరస్. తెలంగాణ ఉద్యమ బందగానం. సకల జనుల అలాయ్ బలాయ్. అందుకే మలి దశ ఉద్యమంలో ఊపు ఊపిన పాటల్లో ఈ పాట కూడా ముఖ్యంగా ఉన్నది.

పాటలో ఆయా చరణాల్లో వచ్చి చేరే ఛాల్&అరెరె&అహాఁ, ఏయ్&అని వినిపించే గమకాలు అటు పాటకు సమ్మతి తెలుపడం&అంటే సమస్త ప్రజానీకం లడాయికి సిద్ధం అని పలకడంగా చూడవచ్చు. అదే మాదిరి పోరాట బాట పట్టిన ప్రజానీకానికి ప్రేరణ ఇవ్వడానికి ఉపకరించడమూ చూసినం.
ఎన్నాల్లీ సహింపులు&తెగతెంపుల తప్ష జరుపు అంటడు. చరమాంకానికి చేరువైన ఉద్యమంలో ఆ స్థితిని కవి గానం చేయడంగానూ దీన్ని చూడవచ్చు. తప్ష-సెటిల్‌మెంట్- పరిష్కారం తక్షణావసరం అని నొక్కి చెప్పే ఈ పదం వంటివి పాటలో మరికొన్ని కనిపిస్తయి. చివర్లో కూడా పంపకము జరగకుంటె అంతపనీ జరుగురా అని హెచ్చరిస్తడు. అంతపని అంటే ఇక్కడ ముందరి చరణంలో చెప్పిన&తెగిస్తేనె తెలంగాణ..ఎంతకైన ఏదైనా అనే అర్థం.

ఇట్లా పాట ఒక ప్రేరకంగా ఉంటుంది. నైజాముల తరిమినోల్లం. నాజీలను వంచినోల్లం. అరెరె&పరాయోన్ని తరమనీకి పెద్దపని కాదురా అనడం. వెంటనే అసోయ్ దుదూలా అనడం, దానికి కాళ్ల గజ్జెల అని కోరస్ రావడం. ఇట్లా పాట అడుగడుక్కి ఇంతెత్తున లేస్తూ శ్రోతల గుండెల్ని ఉప్పొంగిస్తుంది.

కవి మరో చరణంలో పొక్కిలైన వాకిళ్లలో దుఃఖాలను తీర్చర అంటడు. ఈ ప్రయోగం తెలంగాణ పల్లె గాయాలను గుర్తు చేస్తది. అట్లే, ఎక్కి పడే పల్లెలను ఎదలకద్ది కదలరా అంటాడు. ఇట్లా ఉద్యమంలో ఇప్పటిదాకా అయిన గాయాలను అర్థం చేసుకుని, అనంతరం లడాయి చేయాలన్న ఇగురాన్ని కవి నొక్కి చెబుతడు. మొత్తంగా విధ్వంసమైన జీవనానికి పల్లె పునాదిగా, ఆ పల్ల్లె, ఊరూ-వాడా ఒక్కటైన సమ్మతితో కవిత్వం చెబుతడు కోదారి శ్రీను. నిజానికి స్వయంపాలనకు పల్లె పట్టులే కీలకమని, ఆ పల్లెల్ని సమాయత్తం చేయడం, వ్యక్తులనే కాదు, మొత్తం గ్రామాన్ని సన్నద్ధం చేయడం ఈ పాటలోని విస్తతిగా చెప్పవచ్చు. మనమీద ఆంధ్రోడేంది. ఎల్లగొట్టి ఏలుకుందాం అని సూటిగా ప్రజలకి తక్షణావసరాన్ని నొక్కి చెప్పిన పాటగానూ దీనికి ప్రాధాన్యం ఉంది.

అయితే, మలిదశ పోరాటానికి ఒక ప్రాతిపదిక ఉంది. అది గాయపడ్డ గుండెతడి దండయాత్ర తమ్ముడా అనీ చెబుతడు. ఈ సంబోధన ఇటు తన పల్లెకి అటు పరాయోల్లకూ వినవచ్చేలా ఉంటుంది. అదీ తనదైన నిర్మాణ పద్ధతే. ఇందులో రగిలి రగిలి పొగులుతుంటె తెలంగాణ తమ్ముడా అన్నప్పుడు కూడా ఆ కోరస్ అంతా కూడా పీడన నుంచి పాడుతున్న పాటగా వినవస్తుంది. అలాగే ఒక సామూహిక అంగీకారం, తద్వారా లడాయికి కదలడం, ఇవన్నీ ఒకరు పంచుకుంటుంటే ఇంకొకరు కోరస్ ఇస్తున్నట్ట పాట మొత్తం సామాజిక తెలంగాణ గురించిన అస్తిత్వాన్ని సాకాంర చేయడానికి పురిగొల్పేలా చేసింది. ఆ విధంగా ఈ పాట దగాపడ్డ తెలంగాణ విషాద గానం, విముక్తికి సిద్ధమైన వాదం, రెంటి కలగలుపు.

పాటలో ఒక ధర్మం ఉంది. ఇమ్మతి ఉంది. ఒక గమ్మతూ ఉన్నది. అది దూలా పాట కావడం వల్ల ఒనగూడిన సౌజన్యం. అందుకే వింటుంటే దూలా పాటలోని సంబురం అదే సమయంలో ఇప్పటి తెలంగాణ సంబురమూ ఉంటుంది. మధ్యలో వికారంగా మారిన స్థితి నుంచి పోరాటానికి సమాయత్తం అయిన పల్లెలు, అంతా కూడా ఒక ఊపుని ఇంకా శ్రోత అనుభవం నుంచి విశ్లేషించుకోవలసిందే.
కవి సమయం అంటే వర్తమానంలోకి భవితను తేవడం. ఆ లెక్కన పల్లెలన్నీ కదులుతున్న స్ఙితిని సకల జనుల సమయంలో బాహాటంగా చూసినం. అయితే ఆ చేతన, అంగీకారం తాను ముందే పాటలో చూపించిండు కవి. అలాగే తన కవిత్వంలోని మరో లక్షణం, పాటను పాడుతున్న గాయకుడు ఒకేసారి వ్యక్తిగా, సమూహంగా ఉంటడు. ఆ వ్యక్తికి పరిష్కారం తెలుసు. ఆ సమూహానికి విజయం వరిస్తుందనీ నమ్మకం. అంటే నమ్మకంగా ఆలపించిన ఒక పోరుగీతిక ఇది. ఆటా పాటా కలగలిసిన ప్రదర్శనా రూపం ఈ పాట. ఇట్లా కోదారి శ్రీను పాటల్లో తెలంగాణ సాధన అనివార్యమన్న విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసంతో ముందే మేలుకుని వర్దమాన సందేశాన్ని వివిధ అంశాలతో ముందే కైగట్టిన దీర్ఘదర్శి శ్రీను. కవి సమయం అంటే ఇదే.
కోదారి శ్రీను, 99482 68192

1 కామెంట్‌:

Bottom Ad [Post Page]