మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • కొమ్మలల్లో కోయిలమ్మ పాటా వాడుతున్నది by గిద్దె రామనర్సయ్య  కొమ్మలల్లో కోయిలమ్మ పాటా వాడుతున్నది
  జై తెలంగాణ అన్నది
  అలసిపోయిన లేడీ కూన గంతులేస్తనన్నది
  కాలి గజ్జె గడతనన్నది
  పానం బోయె మేక పిల్ల డప్పునైతనన్నది
  దండోరా వేస్తనన్నది
  ఇప్పుడు వుట్టిన లేగ దూడా దుంకులాడుతున్నది
  ధూం దాం చేస్తనన్నది.

  ॥ కొమ్మలల్లో ... ॥

  గోరుకోళ్లు వొడవంగ కూత వెడుతనన్నది
  కోడి నిదుర లేపుతున్నది
  పిడికడంత లేని పిచ్చుక పోరు జేస్తనన్నది
  పోరుబాటా నైతనన్నది
  చెట్టు చేమలన్నీ ఊగి ఊపిరి వోస్తమన్నయ్
  ఉద్యమాలు జేస్తమన్నయి
  పొడిసేటి పొద్దుగూడ పోద్దుగూకనన్నది
  పొరుకు సై అంటున్నది

  ॥ కొమ్మలల్లో ... ॥

  నారుమడిలో నీరునైత వాటా వంచమన్నయి
  వాగు వంకలడుగుతున్నయి
  కష్ణమ్మ గోదారమ్మ కదిలి వస్తనన్నది
  కన్నీరొద్దంటున్నది
  చల్లగాలి వీచి పొరుకు ఊపిరైతనన్నది
  అది పురుడు పోస్తనన్నది
  పండూ వెన్నెల కాసి పల్లె నడుగుతున్నది
  తెలంగాణ కావాలన్నది

  ॥ కొమ్మలల్లో ... ॥

  అడవిలున్న ఆకులన్ని అలకిడి జేస్తున్నయ్
  అలాయ్ భలాయ్ తీసుకున్నయి
  చీమలన్ని జంట వట్టి ర్యాలీ తీస్తమన్నయ్
  మేం రణం చేస్తనన్నయి
  చెట్టు కొమ్మలన్నీ లేసి బాకులైత మన్నయ్
  బందూకులెత్తమన్నయి
  వడ్లపిట్ట ముక్కుతోటి గన్ను జేస్తనన్నది
  తెలంగాణను దెమ్మన్నది

  ॥ కొమ్మలల్లో ... ॥

  మోదుగుపూలు అమరులకు దండాలల్లుతున్నయ్
  మెడల దండలేస్తనన్నయి
  ఎర్రటి ఆ మందరాలు ఎదలకద్దుకోని
  వీరుల మదిల తల్సుకున్నయి
  వాన చినుకు రాలి స్తూపము కడిగి వేస్తనన్నది
  అది కండ్లకద్దుకున్నది
  అమరుల త్యాగాల మొలక చిగురు వేస్తనన్నది
  తెలంగాణ జూస్తనన్నది

  ॥ కొమ్మలల్లో ... ॥

  నక్క బావా జిత్తులతో చిత్తు జేస్తనన్నది
  పెద్ద ప్లాను గీస్తనన్నది
  తెలంగాణ సమరానికి సాల్ల సై అన్నది
  అది సవాల్ జేస్తనన్నది
  పావురాలు ఏకమై కబురు తెస్తమన్నయ్
  కాపాడు కుంటమన్నయ్
  జీవరాశులొక్కటై జండ వట్టుతున్నయ్
  జేజేలు వలుకుతున్నయి

  ॥ కొమ్మలల్లో ... ॥

 • You might also like

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి