Full width home advertisement

Post Page Advertisement [Top]

ఇది దగాపడ్డ దరువు మాకేది బతుకు దెరువు అని విచారంతో ప్రశ్నించిన కవి ఒక దశాబ్దంలోనే తన జాతి పరపీడన నుంచి బయటపడి, తన నుదుటి రాతను తానే రాసుకునే స్థాయికి వస్తాడని కలగంటాడా? ఆ కల లేదూ అంతటి స్వప్నం సాకారం అయ్యేప్పటికి తన వాక్కు ఫలిస్తుందని ఎవరైనా అనుకుంటారా? కానీ, ఆ అదష్టం అంద్శై అన్నకు పట్టింది. ఇప్పుడు తెలంగాణ తన రాష్ట్ర గీతం అధికారికంగా పాడుకునే బంగారు ఘడియల్లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అన్నా, నీకు వందనాలె!, జయజయధ్వానాలతో భవిష్యవాణిని చెప్పిన కవీ నీకు అభినందనలె! నాది కవిగానం కాదు, కాలజ్ఞానం అని చెబుతున్న ఎల్లన్నా, జయజయహే తెలంగాణమే!


అవును మరి. ఒక కవిని, కళాకారుడిని పోరాటంలో నిమగ్నమైన ఒక జాతి అన్నా అనే పిల్చుకుంటుంది. అన్నా నీకు వందనాలె అని గుండెనిండా సంతోషంతో, కతజ్ఞతతో అభినందించుకుంటుంది. అభిమానంతో అలాయ్ భలాయ్ తీసుకుంటుంది. ఎందుకంటే, ఆ కవి నడిచొచ్చిన కాలం అసొంటిది. అది అచ్చం తెలంగాణ వంటిదే. ఒకానొక దుర్దినం, కుటుంబంతో కలిసి విషం తాగి తనువు చాలించాలనే అనుకున్నడు. కానీ, ఆ బలహీన క్షణాలను అధిగమించిండు. అదే మేలయింది. ఇప్పుడు మనిషినీ, కుటుంబాన్ని, సంఘాన్నీ సమస్త తెలంగాణాను, మనదైన జాతి గీతాన్నీ గెల్చుకున్నడు. కవితాన్యాయం అంటే ఇదే! విజయ దరహాసంతో ఇయ్యాల సగర్వంగా నలుదిక్కులా ఆహ్వానాన్ని అందుకుంటున్నడు. చదువుకోలేదు. కానీ, విద్యావంతుడయ్యాడు. మనవైన చదువులు మర్చిపోయిన విశ్వవిద్యాలయాల్లోకి ఏగి సిసలైన డాక్టరేట్లను అందుకుంటున్నడు. నదీమ తల్లుల వెంట నడయాడుతూ ప్రపంచవ్యాప్త పర్యటన చేయగలుగుతున్నడు. మిసిసిపి, మిజోరి, అమేజాన్, నైలు వంటి మహానదుల వెంట తానూ పాయై, పాటై ప్రవహిస్తున్నడు. నదులన్నీ నాగరికతకు ఆనవాళ్లు కావని తెలియజెబుతున్నడు.

విశ్వంల మనిషి జాడను, మనిషిలోన విశ్వవ్యాప్తి కోసం కైగడుతున్నడు. అది భవిత ఐతే జయజయ తెలంగాణ వర్తమానం. నాటి పాలబుగ్గల పిలగాడు, పశుల కాపరి, పల్లె కాపుల ఉరుములకు ఎక్కి ఎక్కి ఏడ్చినోడు, ఉసిక తెప్పల పాన్పుల్లో ఊరడిల్లిన జానపదుడు ఇయ్యాల మొనగాడైండు. తెలంగాణ తల్లిని తన భుజస్కందాల మీద ఊరేగించే పాట రాశిండు. బడిలోకి ప్రార్థనాగీతం తెచ్చిండు. మన ఒడలన్నీ పులకరించే మహత్తర చరిత్రను పాదాపాదానా పరిపరిదండాలుగా మలిచిండు. పద్యం అన్నది తల్లి శిరసును అలంకరించే కిరీటమే అయితే అందునా రత్నాలు, పగడాలు, వజ్రాలు, వైఢూర్యాలుగా ఈ వాగ్గేయుడి సారస్వత పాదాలతో విస్మత చరిత్ర చెక్కిలిమీది వైరాగ్య మందహాసాన్ని తొలగించిండు. ఒక అపూర్వమైన పాండిత్యంతో ఐదువేల ఏండ్ల చరిత్రను చెక్కిండు.

నిజమే. తాను తాపీ మేస్త్రీ. 21 సంవత్సరాలు పనిచేసిండు. ఇప్పుడూ అంతే. ఈ పన్నెండేళ్లుగా అదే పని. తెలంగాణ చరిత్ర నిర్మాణానికి, పునర్నిర్మాణానికి ఆయన ఒక మహా కవితను చెక్కిండు. దాహం గొన్న మనిషికి చెలిమలోని నీళ్లను తాపించిండు. తన చరిత్ర తనకే దక్కని స్థితిలో ఆ తల్లిని చేరదీసి తన కవితా కొంగుతో కన్నీళ్లను తుడిచిండు. వెనక్కి వెనక్కి వెళ్లి భావితరాల కోసం ఒక విజయగీతికను అల్లిండు. అతడే అందె ఎల్లయ్య. వీరగల్లు. అవును. మన రాజ్యం కోసం పోరాటంలో తనను తాను అర్పించుకున్న, తనను తాను ఖండఖండాలు చేసుకుని, బలి ఇచ్చిన తీరుగా బతికి పెరిగి ఇయ్యాల అన్ని ముక్కల్నీ దగ్గర పెట్టుకుంటే మనిషయ్యిండు. మాయమైపోయిన లేదా మాయం చేయబడ్డ మనిషి మళ్లీ తన తెలంగాణ ఆనవాళ్లతో సహా వచ్చిండు. అతడే అంద్శై.

ఒకనాడు నిరుపేద. అనాథ. పశువుల కాపరి. అందుకే అగాధంలో కూరుకుపోయిన మనిషిని లావట్టిండు. దారితప్పిన గొర్రెల్ని దాట వేసిండు. అనాథ అయిన తెలంగాణ చరిత్రను తల్లివలే చేరదీసిండు. ఇప్పుడు చూడాలి ఆ కవిని. కవితనూ. తననిప్పుడు అందరూ అభినందించే వాళ్లే. అందరూ పాడుకునే వాళ్లే. పాఠ్యాంశం కదా మరి! ఎవరో అడిగారట. నిన్ను ఏనుగు అంబారీమీద ఎక్కిస్తామని! తాను నవ్వి, ఉద్యమ అంబారీమీద ఊరేగిన గీతం నేను. నేనిప్పుడు ఏనుగు ఎక్కితే గాడిదనే అయితను అని తిరస్కరించిండట. అదీ మాట. వినయం. ఉద్యమం గెలిచిన ఈనాడు అది తన గీతం కాదంటున్నాడు. జాతి గీతం. ప్రజాగీతం. ఇక తాను అందులో ఒక శ్రోత...పతిజ్ఞ ముందు పాడే గీతంలో తానొక వినయ విధేయతగల బాలుడు అని చెబుతున్నడు.

మరి, తన గీతం పుట్టుక గురించి ఏమంటున్నడు? పన్నెండేళ్లలో గుండెకోత వంటి పన్నెండు కావ్యాలను రాసిన అంద్శై జయజయహే తెలంగాణ ఎట్లా రాసిండని అడిగితే, అంద్శై ఏమేమి యాజ్జేసుకుంటున్నడు? పల్లె నీకు వందనాలమ్మా అని మొదలెట్టిండు. తన-మన సాంస్కతిక నగరాన్ని గలగలా గజ్జెలబండి అని కీర్తించిండు. కొమ్మ చెక్కితె బొమ్మరా అని అమ్మను భక్తుడై కొలిచిండు. చూడాచక్కనీ తల్లి చుక్కల్లో జాబిల్లి అని కొనియాడిండు. చివరికి జనజాతరలో మనగీతం అని పాడితే ఉస్మానియా విశ్వవిద్యాలయమే తొట్లెలో వేసిన శిశువులా ఊగిపోయింది. ఒక దశలో శివసత్తుల్లా లేచి ఆడింది. నాటి వైనాన్ని యాజ్జేసుకుని ఉద్వేగమైండు. జయజయహే తెలంగాణ ఎట్ల రాసిండో చెబుతూ, ఈ ఓరుగల్లు బిడ్డ తనకు పాలిచ్చి పెంచిన తల్లిదండ్రులను యాజ్జేసుకుంటున్నడు. రేబర్తిలో పుట్టినప్పటికీ తనను పెద్ద చేసిన జక్కిరెడ్డి మల్లారెడ్డిని గుర్తు చేసుకున్నడు.

ఆశ్రయం ఇచ్చి రామాయణ మహాభారతాలను, వేదవేదాంగాల సారం విడమర్చి చెప్పిన శంకర్ మహారాజ్‌ను, తాను నాయినా అని పిల్చుకునే జానపద బ్రహ్మ బిరుదురాజు రామరాజును, తన పరిచయానికీ, పరిశోధనకూ అడుగులు చూపిన మార్గదర్శి జయధీర్ తిరుమలరావునూ యాది చేసుకుంటున్నడు. తనను ప్రపంచ నదుల వెంట తిప్పుతున్న శ్రీ రాం సర్‌నూ, బిక్షగాడి స్థాయినుంచి లక్షాధికారి స్థాయికి తెచ్చిన ఎస్.ఆర్.కె.రాజునూ, ఎందరెందరో ప్రజా పోషకులనూ పేరుపేరునా పేర్కొంటున్నడు. తన రచనలను తాను ఓన్ చేసుకోవాల్సిన చారిత్రక ఆవశ్యకతను గుర్తుచేసిన సోదర పాత్రికేయులు కె.శ్రీనివాస్‌ను, కొడుకు చనిపోయినప్పుడు, చేతిలో రూపాయి లేనప్పుడు తన గోడూ, గూడూ తానే ఐన ఎలమంచి శేఖర్‌ను, -అందర్నీ ఎందరెందరో మహానుభావులంటూ కొనియాడుతున్నడు. వీరంతా తన కవితలో కవితలని, కళ్లలోని కన్నీళ్లని ఇప్పుడు ఆనందభాష్పాలనీ తల్చుకుంటున్నడు.

ఎవరెన్నయిన గానీ, తనని కాపాడుకున్న తన ఆలి, మల్లూభాయిని, పిల్లలు- వెన్నెల, వాక్కు, వేకువ, దత్తసాయిలను అప్యాయంగా ప్రకటించుకుంటున్నడు. అంతిమంగా తనలో పెరిగిన తెలంగాణ గీతం తనది కాదని, ఇది ఉద్యమ శక్తులను నిద్ర లేపిన, నలుదిక్కులా ప్రవహింప జేసిన తెలంగాణ తల్లి మహత్యమే అని, దీన్ని సబ్బండ వర్ణాల భవిష్య తెలంగాణకు వినయంగా అప్పజెప్పుతున్నడు.
తొలుత కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ధూం ధాం(2 మార్చి 2003) కార్యక్రమంలో తనకు తట్టిందట మనకంటూ ఒక గీతం ఉండకూడదా అని! ఆ ఆలోచన వచ్చిన కొద్దికాలంలోనే నాలుగు చరణాలు రాసిండు. ముందు నాలుగు చరణాలే. దాన్ని ఆదిలాబాద్‌లో తెలంగాణ రచయితల వేదిక జెండా వందనానికి ( 11 నవంబర్ 2003) పాడిండు.

ఇక అది ఆనాడే నిలబడ్డది. ఇక అప్పట్నుంచీ ఇప్పటి వరకూ ఆ గీతాన్ని పాడుతూనే ఉన్నడు. రాస్తూనే ఉన్నడు. మొత్తం 12 చరణాలు. అది ఇయ్యాళ ఇట్ల నిలబడ్డది అని చెబుతూ జానపద జనజీవన జావలీలు జాలువారె& కవిగాయక వైతాళికుల కళలా మంజీరాలు అని మళ్లీ పాడి విన్పించిండు. ఒక్కో చరణానికి తాను చేసిన పరిశోధన, జరిపిన అన్వేషణ, పడ్డ మథనం, విమర్శా -పరామర్శా మంతనాలు అన్నీ వివరిస్తుంటే అది విడిగా ఒక అధ్యయనం అనిపించింది. అది విస్తారం కూడా. అంతటి కషి చేసిన అంద్శైకీ, అందుకు భూమికగా ఉన్న ఉద్యమానికి, తరతరాల చరిత గల తల్లికి నీరాజనం అనిపించక మానదు! ఒక్క మాటలో ఇదంతా కవిగానం కాదు, కాలజ్ఞానం అని తన ఆత్మను పరమాత్మను వెల్లబుచ్చిండు. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని, కవిగా తనది ప్రాకతిక ధర్మమే నంటూ, గోదావరి, కష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలి.

పచ్చని మాగాణాల్లో పసిడిసిరులు పండాలని అభిలషించిండు. ఇందుకోసమే గీతం అని, పోరాట రూపమూ అనీ సుదీర్ఘమైన తన పాట ప్రస్థానాన్నీ వినిపించిండు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలని ఆకాంక్షించిండు. అయితే, ఇప్పుడు మన రాష్ట్రం ఏర్పడినందున స్వరాష్ట్రం అన్న పదం చోట సకల జనులు అని చేర్చినట్టు కూడా చెప్పాడు. ప్రతి చరణం చివరా జై తెలంగాణ జైజై తెలంగాణ అంటుంటే, ఒడలు పులకరిస్తుంటే, ఒక గొప్ప కల సాకారమైన వేళ కతికర్తా కార్యకర్తయి, పాటకు శ్రోతై తానూ స్వయంగా పాడుతూ ఆనందిస్తూ ఉండటం నిజంగా సంబురమే అనాలి. నిజానికి ఈ పాట తెలంగాణ ప్రకటన వచ్చిన 9 డిసెంబర్ 2009 తర్వాత కోటానుకోట్ల ప్రజల దగ్గరకు చేరింది. కానీ, అంతకు ముందే అది ముఖ్యసభల్లో కవులు, కళాకారులు, మేధావులు, కార్యకర్తల వద్దకు చేరిపోయింది. జయశంకర్ సార్, కేసీఆర్ వంటి ఉద్యమ నేతలూ, ఉద్యోగులు, విద్యార్థులు, పిల్లలూ అందరికీ అదే పాట మాతగీతమై పోయింది. అప్పుడూ ఎప్పుడూ అదే పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లే శుభతరుణం కోసమే అంటూ తన తండ్లాట ఫలించినందుకు తాను ఆనంద పారవశ్యానికి లోనైండు. ఈ గీతంలోని బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలీ&విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి. తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతకాలి అన్న చరణాలను ప్రస్తావిస్తూ ఇవి తనకు బాగా ఇష్టమైన చరణాలని గర్వంగా చెప్పాడీ నిరక్షరాస్యుడు!

అవును. చదువుకు దూరంగా ఉండిపోయిన మనిషి తప్పక రాసే వాక్యాలే ఇవి. ఇంకా మాట్లాడుతూ, ఒక జాతిగా ఇక మన సంతతి ఓ యమ్మా వెలగాలని చెప్పిండు. ముఖ్యంగా సబ్బండ వర్ణాలు ఇరుసుగా- పంపన, బద్దెన, వేములవాడ భీమకవి, హాలుడు, పాల్కుర్కి సోమన, కంచర్ల గోపన్న ఇట్లా ఎందరెందరినో స్మరిస్తూ, మన అపార వనరులను కొనియాడుతూ అంద్శై గీతం తెలంగాణ తల్లిని ప్రాతఃస్మరణీయం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగం కావాలని ఆకాంక్షిస్తూ, పునరుజ్జీవన కాంక్షల్ని రేకెత్తిస్తూ జయజయధ్వానాలతో ముగుస్తుంది. ఇంతమంచి కీర్తన అందించిన ఎల్లన్నా నీకు వందనాలె!


కందుకూరి రమేష్ బాబు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]