Full width home advertisement

Post Page Advertisement [Top]

చెరువు పాటల చెలిమె గోరటి వెంకన్న

గోరటి వెంకన్న
 • ఒకప్పుడు పల్లె అందాల్ని చూసి కనువిందు చెందినోడు. 
 • ప్రపంచీకరణలో బందీ అయిన ఆ పల్లెను చూసి కన్నీరు పెట్టినోడు. 
 • సమస్త తెలంగాణ దుఃఖం తన దుఃఖంగా రోధించినోడు. 
 • తన పాటతోనే నిరసన గళాన్ని వినిపించినోడు. 
 • తన గొంతునుంచి ధిక్కార స్వరాన్ని పలికించినోడు. 
 • తెలంగాణ వలస బతుకుల లోతుల్ని తడిమినోడు. 
 • మట్టి మనుషుల ఎతలను ఎదలకద్దుకున్నోడు. 
 • ఎండిన వాగును చూసి వెక్కివెక్కి ఏడ్చినోడు. 
 • ఊరి సంతను ఉద్యమవేదిక చేసి ఏకనాదం మోత మోగించినోడు. 
 • తెలంగాణ ఘోషను పాటగా మలిచి పోరాటానికి ఊపిరిపాటై రేల పూతలు పూయించినోడు. 
 • చలో ధూంధాం అంటూ గల్లీ నుంచి ఢిల్లీదాక మత్తళ్లు దుంకించి ప్రవహించినోడు. 
 • పూసిన పున్నమి వెన్నెల మీదా అలసెంద్రవంకను నిలిపినోడు. 
 • శెరవట్టి నట్టి అరవై ఏండ్ల బలిమి ఓడి ఎదురు చూసిన కల ఎన్నెలయి పూసెనని అంతెత్తున ఎగిరి గంతేసినోడు గోరటి వెంకన్న. 

అస్సోయి.. ఇస్సోయి హైలెస్సా రంగోయీ 
విసురోయీ.. గుంజోయీ వల విసిరి గుంజోయీ 
ఎద్దులనాపోయీ.. నీళ్లను దాపోయీ 
గంతేసి దూకోయీ.. సెరువంత ఈదోయీ 
పిట్టల సుట్టుతా.. పిల్లల పరుగోయీ
కట్టమీద కొంగ బావలూసులోయీ 
నింగివాన గట్టు నేల కొంగినట్టు పారేటి 
ఈ సెరువు పల్లె కెంతందమో! అంటూ ఊర చెరువును వర్ణిస్తాడు గోరటి వెంకన్న.


ఒకప్పుడు పల్లెకు చెరువులే ఆధారం. ఆ చెరువుల అందాన్ని మరింత అందంగా వర్ణించడం ఆయనకే చెల్లింది. ప్రజాకవిగా, పాటల రచయితగా, గాయకుడిగా సుపరిచితుడైన గోరటి వెంకన్న మహబూబ్‌నగర్ జిల్లా గౌరారం గ్రామంలో 1963 లో జన్మించారు. తండ్రి నర్సింహా, తల్లి ఈరమ్మ. తండ్రి యక్షగాన కళాకారుడు. తల్లి కూడా మంగళహారతుల పాటలు పాడేది. దీంతో ఆయనకు చిన్నతనంలోనే పాటతో పరిచయం ఏర్పడింది. చదువుకునే సమయంలో వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్నలోని సృజనాత్మకతను గుర్తించి ప్రొత్సహించాడు.
ఆయన పాటల్లో తొలుత వామపక్ష భావజాలం ఎక్కువగా కనపడేది. అయితే ఆ తరువాత ఆయన పాటలన్నీ ప్రకృతి, తెలంగాణ చుట్టూ పరిభ్రమించినప్పటికీ నిత్యం జనం నోట్లో నానే పల్లె పదాలు, జానపద పదబంధాలు, ప్రకృతి పరవశాలు ఆయన పాటకు పల్లవులయ్యాయి. పాల నురగల ఏరు పాట దారి చూపింది. గాలికెగసె రెల్లుగడ్డి దరువు నేర్పింది నీటి తెప్పల ఇసుక తిప్ప వేదికయింది ఊటచెలిమె పాటలకు తల ఊపి ఊగింది అని పారే ఏరే పాట నేర్పిందంటాడు వెంకన్న.
ఆయన పల్లె ప్రేమికుడు, ప్రకృతి ప్రేమికుడు. పల్లె అందాలు, ప్రకృతి సోయగాలు, బంధాలు, అనుబంధాలు ఒక్కటేమిటీ కష్టం, నష్టం,సుఖం, దుఃఖం, ఆనం దం, అన్యాయం, వేదన, రోదన, జనం, వనం, చేను, చెలక, చెరువు, వాగు, కొంగ, సంత అన్నీ ఆయన గొంతులో పాటలయ్యాయి. గాలిలోన ఈదుకుంటూ గంగవైపు ఉరుకుతున్న కొంగమ్మా మా పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట వోసిపోవె కొంగమ్మా మా కొంగమ్మా అంటూ ఒట్టిపోయిన చెరువుల నుంచి వలస పోతున్న కొంగలను పిలుస్తాడు. ఓ పుల్లా, పుడకా, ఎండుగడ్డి సిన్నకొమ్మ సిట్టిగూడు పిట్టబతుకే ఎంతో హాయి సిగురుటాకు వగరు పూత లేత పిందె తీపిపండొ నోటి కంది సింతలేక కునుకు తీసే పక్షి బతుకే స్వర్గమోయీ అని పక్షి జీవితం ఎంతో సుఖమంటాడు. ఆ ప్రకృతికి పరవశించిన ఆకాశం ఆనందపుష్పాలు నేలరాల్చితే. వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా వానతో పాటుగ వణుకొచ్చెనమ్మా అంటూ వానొచ్చినపుడు మనసులు, మనుషుల పరవశాన్ని ఎంతో అందంగా వివరిస్తాడు.
పల్లె అందాల్ని గోరటి వర్ణించినంతగా మరెవరూ వర్ణించలేరేమో. గాలికి ఊగి ఆటాడుతూ నేలకు తలలొంచి సెరువు నీళ్లను ముద్దాడి మురిసే నల్లతుమ్మ చెట్లను... చూసి నా పల్లె అందాలు సూచితే కనువిందురో అంటాడు. సాళ్లు దున్నిన ఎర్రని దుక్కిల సంధ్య పొద్దు వాలి వొదిగి నపుడు ఆ సెలుక, ఆ పల్లె ఎంత అందంగా ఉంటుందో చూపడం ఒక వెంకన్నకే సాధ్యం. తల్లి ఈరమ్మ అన్న, ఆమె పాటలన్న గోరటి వెంకన్నకు అమితమైన ప్రేమ. అందుకే ఆమె కూడా ఆయన పాటలో ఒదిగిపోయింది. కంచెరేగి తీపివోలె లచ్చువమ్మో-నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ పారె ఏటి అలలమీద పండు వెన్నెల రాలినట్లు- ఊరె ఊట చెలిమెలోనా తేనీరు తొలికినట్లు వెండి మెరుపుల నవ్వు నీదె లచ్చువమ్మో- నీ దెంతని చక్కని రూపమె ఓ లచ్చువమ్మా అంటూ అమ్మ రూపాన్ని ప్రకృతితో ముడివేస్తూ పాటగా మలిచిన తీరు మన బాల్యాన్ని గుర్తు తెస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వారానికి ఒకసారి సాగే సంతలను గుర్తు చేస్తూ సంత మా ఊరి సంత వారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత సుట్టు ముప్ఫైఊర్ల పెట్టు జనమందరూ పుట్ట పగిలి సీమలొచ్చినట్టొస్తారు అంటూ వర్ణించాడు. అలాగే పట్నం జీవితంలోని కోణాలను వర్ణిస్తూ, చిన్న చిన్న ఇరుకు గదులల్లో పేదరికం మగ్గుతున్న తీరును వివరిస్తాడు వెంకన్న. గల్లీ సిన్నదీ గరీబోల్ల కథ పెద్దది వాళ్ల ఇండ్లు కిళ్లి కొట్ల కన్న సిన్నగున్నవో ఇండ్లకన్న మేలురా ఆ ఫలక్‌నామ బండ్లురా అంటాడు.
తెలంగాణ వచ్చిన తర్వాత బందూక్ చిత్రం కోసం ఆయన రాసిన బ్రీత్‌లెస్ సాంగ్ అందరి మన్ననలు అందుకుంది. పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ వాసిక చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతుల వాణి, స్వరజతుల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి అంటూ తెలంగాణ పది జిల్లాలను ఎంతో అందంగా తన పాటలో వర్ణించాడు. స్వరాష్ట్రం వచ్చిన ఆనందాన్ని వెంకన్న ఎంతో ఆనందంగా, ఆవేదనగా, ఆర్ద్రంగా వర్ణించాడు. రాములోరి సీతమ్మా..సీతమ్మోరి రామయ్యా.. ఎదపైన దిగులు బండ జరిగి - ఎండిన సెలిమె అనుభూతి కలిగెనో శెరవట్టి నట్టి ఆరవైఏండ్ల బలిమి ఒడెనో కలనిజమా యని నేల తనను తడుముకున్నదో ప్రకృతిలోని అందాలను, అగాధాలను అన్నింటినీ తన పాటల్లో వర్ణించిన గోరటి వెంకన్న పలు సినిమాలకు కూడా పాటలు రాశారు. వాటిలో శ్రీరాములయ్య, కుబుసం, వేగుచుక్కలు, మహాయజ్ఞం, మైసమ్మ ఐపీఎస్, బతుకమ్మ, నగరం నిద్రపోతున్న వేళ, పీపుల్స్‌వార్, బందూక్ ముఖ్యమైనవి. మరికొన్ని సినిమాల్లో ఆయన నటించారు కూడా.

సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను 2006 లో కళారత్న (హంసా అవార్డు), 2016లో కాళోజీ నారాయణరావు ఆవార్డు అందుకున్నారు. చెరువు మీద ఆయన రాసిన పాటలకు గాను మిషన్ కాకతీయ అవార్డు కూడా పొందారు. సోయగమే వెన్నెలకు అంతర్జాతీయ గుర్తింపు తెలంగాణ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రాసిన సోయగమే వెన్నెల పాటకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దేశంలోని 15 ప్రాంతీయ భాషల్లో వచ్చిన గేయాల నుంచి ఒక్కొక్కటి చొప్పున ఆంగ్ల అనువాదానికి ఎంపిక చేయగా తెలుగు నుంచి వెంకన్న పాట ఎంపికైంది. రాజా ఫౌండేషన్ సంస్థ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ది రాజా బైఎనేల్ ఆఫ్ ఇండియన్ పోయట్రీ పేరిట పదిహేను భాషలకు చెందిన 45 మంది కవులు, రచయితలతో త్రివేణి సంగమంలో సాహిత్య కార్యక్రమంలో వెంకన్న తన పాట పాడి ఆ పాట నేపథ్యాన్ని, సందర్భాన్ని వివరించారు. దీంతో సామాజిక నేపథ్యంతో కూడిన ఆ పాటను ఆంగ్లంలోకి అనువదించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదుతూ వెంకన్న రాసిన పాటలు ఉద్యమ సమయంలో ప్రజల్ని ఉర్రూతలూగించాయి.ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా? ఇండియా పాకిస్తనోలే ఇనుప కంచె పడుతుందారావొచ్చు పోవొచ్చు రొయ్యలమ్ముకోవచ్చు. నువ్వు పద్యం పాడితే మేము వన్స్‌మోర్ గొట్టొచ్చుకానీ దాశరథి, కాళోజీని దాసిపెడితే కుట్ర గాద పొమ్మంటే పోవేందిర పోరా ఆంధ్రదొర రేలా దులా తాలెల్లాడే నేలా నా తెలంగాణ- సుడిగాలికి చెదిరిన పక్షోలాయే నా తెలంగాణ. తల్లీ తెలంగాణమా తనువెల్ల మాగాణమా గానమా మా ప్రాణమా తెలంగాణమా జనగానమా గర్భాన సింగరేణి గళమున మధురవేణి సిరుల గిరులతోని విరజిల్లే మేటి ధరణి పరుగు పరుగున వచ్చినారు పట్నముల వాలినారు గుమ్మాలకు బొమ్మలోలె గుడ్లు ఎల్లవెట్టినారు ఏ ఆఫిసు మెట్లెక్కిన జిల్లేలమ్మ జిట్ట ఆళ్లు ఎదురుంగనే గూసుంటరు జిల్లేలమ్మ జిట్ట మందెంట వోతుండు ఎలమంద వాడు ఎవ్వని కొడుకమ్మ ఎలమంద సూస్తె శిన్న పోరగాడు ఎలమంద తెలంగాణ జెండా వట్టె ఎలమంద. నాటి ప్రభుత్వానికి చరమగీతం పాడిన పల్లె కన్నీరు..పాట ప్రపంచీకరణ, పరదేశీకరణ, సామ్రాజ్య వాద విస్తరణ మూలంగా వృత్తులు కనుమరుగై విస్తరిస్తున్న ఆధునికతను తన పాటతో ఎండగట్టిండు వెంకన్న. మానవతా విలువలు అడుగంటి, స్వావలంబన కనుమరుగవుతున్న తీరు పాటలో వర్ణించడం ద్వారా శ్రోతలతో కన్నీరు పెట్టించాడు. సామ్రాజ్యవాద ప్రభుత్వ పాలనకు ఈ పాటే చరమగీతం వంటిదంటారు. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లీ బందీ అయిపోతుందో కనపించని కుట్రల కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను అంటూ బహుళజాతి కంపెనీలు పల్లెలను కబలిస్తున్న తీరును, జీవన విధానాన్ని, వృత్తుల్ని ఛిద్రం చేస్తున్న తీరును ఆయన ఎంతో ఆర్ధ్రంగా వివరించారు. ఈ పాటను కుబుసం సినిమాలో వాడుకున్నారు

Our Hearty Thanks to  -మధుకర్ వైద్యుల, సెల్: 80966 77409 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]