మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • పల్లెపాటకు పట్టాభిషేకం అందెశ్రీ

  పల్లెపాటకు పట్టాభిషేకం అందెశ్రీ
  పల్లెపాటకు పట్టాభిషేకం అందెశ్రీ


  అందెశ్రీ
  • ఆయన పాటలు జనబాహుళ్యాన్ని తట్టిలేపే జయకేతనాలు.
  • మాయమైపోతున్న మనిషితనాన్ని వెలికి తీసే శ్రామిక జనరంజనులు. 
  • ఆ పాటలు తెలంగాణ నుదుట సింధూరమై పొడిచిన రంగుల సింగిడీలు. 
  • నజాతరలో మనగీతాలై పల్లె పొలిమేరలో నినదించిన కొత్తపల్లవులు. 
  • ఆయన చెక్కిన కొమ్మలు దేవతల బొమ్మలై ఊరు ఊరంతా ఉద్యమగీతాలై ఊరేగాయి.
  • తెలంగాణ, ప్రకృతి, పల్లెకవిగా ప్రజాసాహిత్యం, పల్లెపాటలు, ఉద్యమగీతాలు ఇలా పాటేదైనా మన మట్టి పరిమళాలద్దినవాడు అందెశ్రీ. 

  అందెశ్రీ ప్రకృతి చెక్కిన కవి. నిజానికి ఆయన చదువుకోలేదు. కానీ ఆయన పుట్టిన ఊరు, ప్రకృతే ఆయనను పాటగాడిగా తీర్చిదిద్దింది. ప్రజలబాణీలనే పల్లవులుగా చేసుకుని ఆయన రాసిన పాటలు తెలంగాణ వేదికలెక్కి జనాన్ని ఊర్రుతాలూగించాయి.

  తెలంగాణ సంస్కృతి సంప్రదాయపు మూలాల్ని ఒడిసిపట్టుకుని పాటకు కొత్త బాణీలు అద్దినవాడు అందెశ్రీ. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. వరంగల్ జిల్లా మద్దూర్ మండలంలోని రేబర్తి అనే గ్రామంలో 1961 జూలై 18న జన్మించారు.

  మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడ ఉన్నడో కానీ కంటికీ కానరాడు
  ఆధునికత పేరుతో మనిషి కానరాకుండా పోతున్న వైనాన్ని పది సంవత్సరాల క్రితమే అందెశ్రీ తన పాట ద్వారా వివరించారు. మానవత్వం మరిచి మనిషితనాన్ని కోల్పోతున్న మనిషి మాయమైపోతున్నాడని వాపోతాడాయన. 2007లో వచ్చిన ఎర్రసముద్రం సినిమా కోసం ఈ పాటను వాడుకున్నారు. అంతేకాక ఇంటర్‌లో ఈ పాట ఒక పాఠ్యాంశంగా చేర్చడం విశేషం.

  అందెశ్రీ తండ్రి అందె బుడ్డయ్య వ్యవసాయ కూలీ. దీంతో అందెశ్రీ చిన్నతనంలోనే పశువులు కాసే జీతగాడిగా మారాల్సి వచ్చింది. ఆయనకు చదువుకునే అవకాశం రాలేదు. గ్రామాల్లో నిరంతరం జరిగే యక్షగానాలు, కోలాటాల పాటలు ఆయనలోని కవిని నిద్రలేపాయి. చదువుకునే వయస్సులోనే గొర్రెలు కాసేందుకు కుదిరాడు. అలా గొర్రెల మందతో అడవులు, వాగులు, వంకల్లో తిరుగుతూ ప్రకృతితో మమేకమయ్యాడు. ప్రకృతిని ఆరాధిస్తూ పరవశించి స్పందించి రాసిన పాటలెన్నో.

   చూడచక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి- నా పల్లె పాలవెల్లి మళ్లి జన్మంటూ ఉంటే సూరమ్మో తల్లి నీ కడుపున పుడతా మాయమ్మ  అంటూ చుక్కల్లో జాబిల్లిలా చూడచక్కనైనా, పాలవెల్లి లాంటి పల్లెను తలచుకుంటూనే తనను ఆదరించి అన్నం పెట్టిన తల్లిలాంటి సూరమ్మను కీర్తిస్తాడు అందెశ్రీ.

  ఆయన చదువుకోనప్పటికీ మల్లారెడ్డి అనే అసామి దగ్గర పనిచేస్తున్న సమయంలో ఆయన చెప్పిన రామాయణ, మహాభారత, భాగవతాలు ఆయనను ఆధ్యాత్మిక చింతనకు చేరువ చేశాయి. మనిషిగా నేను పుట్టింది రేబర్తిలో అయినా కవిగా పుట్టింది నిజామాబాద్‌లో అంటారు అందెశ్రీ. అవును ఆయన తాపీ పనివాడిగా నిజామాబాద్‌కు వలస వెళ్లారు. స్వామి అనే మేస్త్రీ ఆయనను ఆదరించి అక్కున చేర్చుకున్నాడు. అలాగే అక్కడికి దగ్గర్లోని హమ్రాద్ గ్రామంలో శృంగేరీ మఠం ఉండేది. అక్కడి శంకర్ మహరాజ్ అనే స్వామి అందెశ్రీకి మంత్రోపదేశం చేసి కవిగా నిలబెట్టారని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు.  ఆయన సహచర్యంతో నిత్యం ఉపనిషత్తులు, వేదాంత పఠనం అబ్బింది. అప్పటి వరకు వైరాగ్యంతో ఉన్న ఆయనలో ఏదో తెలియని శక్తి ఆవహించింది. ఆయన బోధనల వల్ల దార్శనికత, ఆధ్యాత్మిక చింతన పెరిగాయి. అక్కడే అయనలో ఒక గొప్ప కవి ఉన్నాడన్న విషయం తెలిసింది. అలా మొదలైన ఆ గేయాల ప్రవాహం పాటల పూదోటలై విరబూశాయి. తను పాటగాడిగా ఎదగడానికి కారణమైన పల్లెకు ఆయన రుణపడి ఉంటానంటారు.

  పల్లె నీకు వందనాలమ్మో నన్ను గన్న తల్లి నీకు వందనాలమ్మో నాకు పాటనేర్పి, మాటనేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మో  అంటూ పల్లె తల్లికి తన పాటతో పట్టాభిషేకం చేశారు అందెశ్రీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రకు కాకతీయుల కీర్తి తోరణాన్ని అందించిన ఓరుగల్లు చరిత్రను, కాకతీయుల పరిపాలనను తన పాటతో ప్రాణప్రతిష్ట చేశారు.
  గలగలగల గజ్జెలబండి గల్లు చూడు ఓరుగల్లు చూడు నాటి కాకతీయులు ఏలినట్టి ఖిల్లా చూడు నా జిల్లా చూడు అంటూ కాకతీయుల కన్న బిడ్డ రుద్రమదేవి పుట్టిన గడ్డను, విజయతోరణం, వారు తవ్వించిన గొలుసుకట్టు చెరువులు, ప్రజాపరిపాలనను తన పాటలో వివరించారు.

  అందెశ్రీ రాసిన ఒక్కోపాట ఒక్కో ఆణిముత్యం. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర గీతంగా వినతికెక్కిన జయజయహే తెలంగాణ గీతం గురించి తెలియని వారుండరు. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అంటూ నాడు తెలంగాణలో ఉన్న పది జిల్లాలను ప్రస్తావించారు. జయజయహే తెలంగాణ అనే పల్లవి తెలంగాణ అంతటినీ ప్రతిబింబించేలా పోతన పురిటిగడ్డ రుద్రమ వీరగడ్డ అంటూ ఓరుగల్లు కీర్తిని వర్ణిస్తూ 12 చరణాలతో ఈ గేయాన్ని 2009లో రాశారు. అయితే ప్రస్తుతం పల్లవితో పాటు 4 చరణాలనే ఎక్కువగా పాడుకుంటున్నారు.

   ఆపదలు, అనర్థాలు వచ్చినప్పుడు గ్రామాన్ని కాపాడేందుకు గ్రామదేవతలుంటారంటారు అందెశ్రీ. ఒక తల్లి తన పిల్లలను కాపాడుకున్నట్లే గ్రామదేవతలు కూడా గ్రామాన్ని అలాగే కాపాడుతారంటారాయన. ఈ పాటలో అమ్మను, అమ్మతనాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు అందెశ్రీ.

  "కొమ్మ చెక్కితే బొమ్మరా-కొలిచిమొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా- కాదంటే ఏది లేదురా జాతిగుండెలో జీవనదముల -జాలువారే జానపదముల గ్రామమును కాపాడ వెలిసిరి గ్రామ దేవతలెందరో. "

  నారాయణమూర్తి తెరకెక్కించిన చాలా సినిమాల్లో అందెశ్రీ పాటలు రాశారు. ఈ పాటను కూడా ఆయన 2004లో వచ్చిన వేగుచుక్కలు చిత్రంలో వాడుకున్నారు. అంతేకాదు, బతుకమ్మ సినిమా కోసం ఆయన సంభాషణలు కూడా రాశారు. నదుల పుట్టుక మీదా పరిశోధన చేయతలచి ప్రపంచంలోని నదులన్నింటినా ఆయన చుట్టిరావడం విశేషం. ఆ నదిని కీర్తిస్తూ కూడా ఆయన పాటలు రాశారు. నది నడిచిపోతున్నది-నన్ను నావనై రమ్మన్నది పలుమారు పిలుచునది- నాలో ప్రాణమై దాగునది అంటారు. అంతేకాదు, మహిళలు ఏడవకూడదని తను అన్నలా తోడుంటానంటారు ఓ పాటలో ఆడబతుకే పాడు బతుకని - ఏడుస్తావెందుకే చెల్లెమ్మా నీవు జడుస్తావెందుకే మాయమ్మ నీ అన్నను తోడున్ననమ్మా అంటూ ఆడవారికి మనోధైర్యాన్నిస్తారాయన. ఇలా ఒక్కటని కాదు, ఎన్నో పాటలు. ఆయన రాసిన ప్రతి పల్లవి లక్షల స్వర్ణకంకణాలకు, ఒక్కో చరణం కోట్ల గండపెండేరాలకు సరిసమానం.

   పాటకు ఆయన చేసిన సేవలకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. మరోవైపు అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్‌తో పాటు లోకకవి బిరుదునిచ్చింది. వంశీ ఇంటర్నేషనల్ వారు దాశరథి సాహితీ పురస్కారం, డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే డాక్టర్ రావూరి భరధ్వాజ సాహితీ పురస్కారం తదితర పురస్కారాలెన్నో ఆయన ఖాతాలో చేరాయి.

   ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ చిత్రం కోసం ఆయన రాసిన జనజాతరలో మన గీతం మరో ఆణిముత్యం. జనజాతరలో మనగీతం-జయకేతనమై ఎగరాలి జంఝా మారుత జన నినాదమై- జే గంటలు మోగించాలి ఒకటే జననం ఓహో.. ఒకటే మరణం ఆహా.. జీవితమంతా ఓహో- జనమే మననం ఆహా ఉద్యమానికి ఊపునివ్వడంతో పాటు నిద్రాణమై ఉన్న తెలంగాణ రణనినాదాన్ని రగిలించిన ఈ పాట అందెశ్రీ కలం నుంచి జాలువారిందే. 2006లో వచ్చిన గంగ సినిమాకోసం ఆయన యెల్లిపోతున్నావా తల్లి అనే పాటకు గాను నాటి ప్రభుత్వం నుంచి నంది పురస్కారాన్ని అందుకున్నారు.

 • You might also like

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి