Full width home advertisement

Post Page Advertisement [Top]

  దరువు ఎల్లన్న

జర్నలిస్టు సోదరుడు కె.శ్రీనివాస్ అన్నట్టు, మూర్తీభవించిన తెలంగాణ గ్రామమే ఉస్మానియా క్యాంపస్. ఈ క్యాంపస్ మలి విడత ఉద్యమం ద్వితీయార్థంలో పొక్కిలైంది. నెత్తుటి మడుగైంది. అందులోంచి ఎత్తిన పిడికిల్లు ఉద్యమంలో తమంతట తాము నిరసనగా ఒరిగినై. ఆ విషాద వైనం నుంచి ఉబికి వచ్చిన కరుణ రసాత్మక స్మతిగీతమే వీరులారా వందనం. రాసింది దరువు ఎల్లన్న. ఈ కవి సమయం అమరం.

కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి వాస్తవ్యుడు, దళిత బిడ్డా అయిన దరువు ఎల్లన్న అసలు పేరు బొడ్డు ఎల్లయ్య. దరువు పేరిట నిర్వహించిన తన సాహిత్య సాంస్కతిక కార్యాచరణే తనను దరువు ఎల్లన్నను చేసింది. తొలుత స్థానిక వామపక్షం-దళిత బహుజన రాజకీయాలు, అటెన్క డిగ్రీ చదివే రోజుల్లో మంజీరా రచయితల సంఘం స్ఫూర్తి, హైదరాబాద్ రాక, పిమ్మట బెల్లి లలిత పాటా, యుద్ధనౌక గద్దరన్నపై కాల్పులు, ఈ క్రమంలో పదునెక్కిన పాటైండు. అట్లట్ల ఉస్మానియా క్యాంపస్‌లో భుజానికి డప్పుతో, తనదైన దరువుతో విద్యార్థులను మేలుకొలిపే పాటగాడూ, గాయకుడూ అయిండు. మలిదశ ఉద్యమంలో జెఎసి విద్యార్థి నేతగానూ ఎదిగిండు, మరీ ముఖ్యంగా తెలంగాణ ఎన్నటికీ మరచిపోలేని పాట రాసిన కవీ అయిండు.

తాను రాసిన వీరులారా వందనం... విద్యార్థీ అమరులారా వందనం అన్న పాట అటు తొలిదశ ఉద్యమం- ఇటు మలి దశ ఉద్యమం అనే కాదు, మొత్తంగా తెలంగాణ సుదీర్ఘ ఉద్యమ పరంపరలో విద్యార్థి అమరులపై వచ్చిన అపూర్వమైన గేయంగా పేరొందింది. పేరొందిందీ అనేకంటే దీన్ని గుండె గుండే ఆలపించింది, కన్నులన్నీ ఆర్ధ్రంగా తడిసిపోయేలా చేసింది అనాలి. విన్న కొద్దీ బాధతో ఎదల కరుణ నిండగా ఉద్యమ స్పహతో ఉత్తేజితులమూ అవుతం.

నిజం చెప్పాలంటే, ఇక్కడో రెండు మూడు విషయాలు మాట్లాడుకోవాలి. తెలంగాణ సాకారం అయిందంటే అందుకు రెండు కారణాలు. ఒకటి, అది కవి సమయాన్ని రగిల్చి గొప్ప పాటలతో ఉద్యమాన్ని ఉత్తేజ పర్చిన కవి గాయక శ్రేణుల నిస్వార్థ వ్యాసంగ ఫలితం. రెండు, ప్రతి మలుపులోనూ త్యాగధనులు ఊపిర్లూదిన వైనం. ముఖ్యంగా విద్యార్థులు.

ఈ వారం మనం పరిశీలిస్తున్న పాట ఈ రెండు అంశాలనూ ఇముడ్చుకోవడం విశేషం. తొలుత అది స్వయంగా తెలంగాణ పాట. అది ఉద్యమ విశిష్టత. అంతదాకా రాసిన ఒరవడికి భిన్నంగా ఈ కవితో ఉద్యమమే రాయించిన పాట. తర్వాత అమరత్వంపై రాసిన పాట, ముఖ్యంగా విద్యార్థి అమరులను స్మరించుకునే మహత్తర పాట. ఈ రెండింటి కూడిక ఈ పాట. ఇంకా చెబితే, ఉద్యమంలో అసువులు బాసిన అమరులపై రాసింది కావడం వల్ల తెలంగాణ కవి సమయం అమరత్వాన్ని గుర్తించడం ఒకటైతే, రెండు- ఆ కవే ఉద్యమం విజయవంతమైన సందర్భంలోనూ వందలాది త్యాగధనులను వినమ్రంగా యాది చేసుకునే సందర్భాన్ని, రేపటి నవ నిర్మాణంలో బాధ్యతగా ముసలుకునే స్ఫూర్తిని రాజేయడం, నిన్నటికీ రేపటికీ పనికొచ్చే పాటగా ఉండటం, అట్లా ఈ వారం కవి సమయానికి నిజంగానే గొప్ప కవితా న్యాయం లభిస్తున్నది.

సాధారణంగా తెలంగాణ ఉద్యమంలో పాటలు సకల జనులనూ చాలా కీలకంగా ఉత్తేజ పర్చినయి. కానీ, ఈ పాట మాత్రం ఉద్యమంలో అమరత్వం ఎరుపెక్కిన కొద్దీ ఉద్యమంతో సమస్థాయిలో ఈ పాట ఎదిగింది. (బాలకిషోరాలు) ఒరిగిపోతున్న కొద్దీ పాట సాంద్రత పెరిగింది. ఒక రకంగా ప్రతి గ్యాదరింగ్‌లోనూ ఈ పాట ప్రతిజ్ఞగా మారింది. సమావేశానికి ముందూ ఈ పాటే. చివరనా ఈ పాటే. మొత్తంగా మనసారా తల్చుకునే పాటగా ఇది ప్రారంభమై మన బాధ్యతలను నిర్వచించుకునేదిగా ముగిసింది (పొద్దు పొడుపుల్లోన మీ రూపు జూసుకుంటం. పుస్తకాల్లో మీ పేరు రాసుకుంటం). ఆ లెక్కన ఈ పాట ఆది అంతమూ ఉన్న తెలంగాణ విశిష్ట గేయం. ఒక యాది, మనాది, పునర్నిర్మాణానికి పునాది. రాసిన ఎల్లన్న ధన్యుడు.
పాట ఎంత సింపుల్‌గా ఉంటుందంటే అది పాడిన వారికి తెలుసు, సామాన్యం అని! విన్న వాళ్లకూ తెలుసు, అతి సామాన్యం అని! ఎందుకంటే, పాటలోని వస్తువు జీవితమూ ఉద్యమమూ. అది జీవితాన్ని ఫణంగా పెట్టిన ఉద్యమ జీవితం. అందువల్ల ఎంతో గ్రౌండెడ్‌గా (గుండెల్లో గుడిగడతం), మరెంతో వినయంగా (పోరుదండం పెడతం) వీరులారా వందనం... విద్యార్థి అమరులారా వందనం అంటూ సాగుతుంది. విరుపు కూడా పాటకు కలిసొచ్చింది.

వీరులారా వందనం అన్నంక విద్యార్థి అని వచ్చి నొక్కి చెప్పినట్టు అనిపిస్తది. అట్లే అమరులారా వందనం అన్నంక పాదాలకు అని వస్తది. వెంటనే వినయంగా తల వంచి నమస్కరించేలా అనిపింప జేస్తుంది. ఇదొక బలం ఈ పాటకి. మ్యూజిక్ చేసింది అల రవి.పాటలో ఇట్లా వినయమే కాదు, విధేయత ఉన్నది. కీర్తన లేదు. కీర్తించడం కాకుండా ఎంతో జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా సాగుతది. ఇంత సాదాసీదాగా ఉండే పాట చాలా అరుదుగా పుడుతుంది.

బహుశా త్యాగాల వల్ల సంక్షిప్తతా, ముందే చెప్పినట్టు సాంద్రతా కలగలసి ఈ పాట నిజంగాతెలంగాణ రాష్ట్రంలో ప్రతి పొద్దు పొడుపునా ఒక ప్రతిజ్ఞ వలే వినవలసే ఉన్నది, ప్రభుత్వం అమరుల పట్ల దయగలిగి ఉంటే! చిత్రమేమిటంటే, ఈ పాట సాధారణత్వంలో కలగలసింది దరువు. డప్పు. చిన్నగా వేణువు. ఒక స్త్రీ ఆలాపన. తెలంగాణ తల్లి గర్భశోకం అట్లా ఆలాపనగా వినవస్తూ మురళీనాదంతోనూ లయకడుతుంది. గద్దర్ కూడా మెచ్చుకుంటడు, ఇంత సాదాసీదాగా పాట వినవచ్చేలా కల్పించడం. ఒకే ఒక ఇన్‌స్ట్రుమెంట్ ప్రధానంగా, ఒకే సింపుల్ దరువుతో వేలాది విద్యార్థులను కదిలించి, నడిపించిన పాటగా ఎల్లన్న పాటలకు గద్దర్ ఇచ్చిన కితాబు ఈ ఒక్క పాటకు కూడా సరిగ్గా నప్పుతుంది. అట్లా చూసినప్పుడు ఈ పాట గొప్పతనం పాటది కాదు, అమరత్వానిది అనడం, విద్యార్థుల త్యాగాలదీ అనడం ఎల్లన్న తెలంగాణ వినయత్వానికి చిహ్నం.

ఆరుగురు అన్నదమ్ములు, ఒక్క చెల్లె గల కుటుంబంలో తానొక్కడే ఉన్నత విద్యావంతుడు. ఇద్దరేమో దుబాయ్‌కి బత్క వోయిండ్రు. తండ్రి లింగయ్య చనిపోయిండు. తల్లి నర్సమ్మ తనను ఉద్యమంలో అరెస్టు జేసినప్పుడు ఒక్కతె బస్సెక్కి ఎతుక్కుంట వచ్చిన మనిషి.

వ్యవసాయ కూలీ. అసొంటి పాణాల మధ్య ఎదిగిన పాణం బొడ్డు ఎల్లయ్య. తాను వంద దాకా పాటలు రాసిండు. వాటిల్ల బాగా పాపులర్ అయిన పాటల్లో ఒకటి ఎం.ఎ జేసే...సమ్మన్న. ఇంకొక రెండు చెబితే...నేలమ్మా నీకు వందనం, అరిగోస వడుతున్నదో తెలంగాణ. ఉద్యమం విఫలమైతే మళ్లీ వెనక్కి వెళ్లిపోతమని చెప్పే అవ్వ నాకు సద్ది వెట్టవే. నాయినతో పనికి పోత అనే పాట కూడా తన పాటల్లో తెలంగాణ విధ్వంస ముఖచిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించే ఒక పాట. ఇవన్నీ ఒకెత్తు. బొగ్గు బావుల నుంచి బొంబై (ముంబై) దాకా తనను తిప్పిన, తెలంగాణ ఉద్యమంతో పాటు తనను పైకి తెచ్చిన తన పాట వీరులారా వందనం. ఒక్క మాటలో అమరత్వాన్ని సజీవం చేసిన పాట ఇది.

ఎంఎ ఎకనమిక్స్ చదివి పి.హెచ్‌డి విద్యార్థిగా ఉన్న ఎల్లన్నను ఈ వారం కవి సమయంగా ఎంచుకున్న ఈ పాట ఎట్ల పుట్టిందీ అని అడిగితే, ఏమో అన్న. అసలు ఏ పాటైనా ఎట్ల పుడుతదో ఎట్ల తెలుస్తది అని వినమ్రంగా అన్నడు. తనకు తెలియకుంటనే రాసిన పాట అన్నప్పటికీ తనతో జరిపిన సంభాషణ ఆధారంగా దీనికి నేపథ్యం 1969 ఉద్యమంలో త్యాగధనుల గురించిన చరిత్ర రికార్డు కాక పోవడం ఒక కారణం అని తెలిసింది. కనీసం వాళ్లను పాటలోనైనా స్మరించుకోవాలని, ముఖ్యంగా విద్యార్థి అమరులపై ప్రత్యేకంగా ఒక పాట లేని లోటు నుంచి తాను ఈ గీతం రాసినట్లు తెలిపిండు. ఒక సంస్థ లేదా పార్టీ, మరెవరూ ఓన్ చేసుకోని కారణంగా 1969 ఉద్యమంలో అమరులైన (369 మంది) వాళ్ల వివరాలు పూర్తిగా తెల్సుకోలేక పోతున్నం. అది నన్ను బాగా కలచివేసింది. అందుకే ఒక పాట ఉండాలని, ఆ పాట అమరత్వాన్ని ఆత్మీయంగా తలచుకునే స్మతిగీతం అవాలని ప్రయత్నించిన అని కూడా వివరించిండు ఎల్లన్న.

నందిని సిధారెడ్డి రాసిన వీరులకు జోహార్లు&అమరులకు జోహార్లు పాట తనలోన ఎప్పట్నుంచో తిరుగుతూనే ఉండిందట. అది కూడా ఒక స్ఫూర్తి, ప్రేరణగా చెప్పిండు ఎల్లన్న. అయితే, వీరులారా వందనం అని తాను పాట గట్టేటప్పుడు ఇన్ని త్యాగాలు లేవు. ఇంతమంది అమరులు కాలేదు. కానీ, ఎందుకో రాసిన. అది గూడా ఒక పాటల సీడి, అదీ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో నిండిన పాటల్ని తేవాలనుకున్నప్పుడు మిగతా వాటితో పాటూ ఈ పాట గూడా రాసి సీడిగా తెచ్చిన. అది 1997లో అని వివరించిండు ఎల్లన్న. కానీ, ఆ పాట అటు 1969 విద్యార్థి అమరులను, ఇటు ఉస్మానియాలో 2009 తర్వాత యాదయ్య, వేణుగోపాలరెడ్డి, సంతోష్, సాయికుమార్ తదితరులు నిప్పుకణికలై మండిన వీరులను యాది చేసింది. ఒక పరంపరగా విద్యార్థి అమరత్వాన్ని సజీవంగా ఉద్యమం పొంటి నిలిపింది.

మరి ఈ పాటలో తాను ప్రత్యేకంగా ఫీలైన విషయాలేమిటీ అంటే తెలిసి రాసింది కాదన్నా అంటడు. అటు ఆంధ్రోళ్లను తిట్టాలని, ఇటు తెలంగాణ అమరులను కీర్తించాలనీ అనుకోలేదు. చారిత్రక స్థితిని ప్రతిఫలింపజేయాలని రాసినట్టు రాసిన. అందుకే సెన్సేషన్ లేదు అన్నడు.వీరులారా వందనం అంటూ మా త్యాగధనులారా మరచిపోమూ మేము అన్న ఏక వాక్య ప్రకటన.

ఇది గుండెల్లోంచి వచ్చిన మాట. పాటగా మార్చిన. సూటిగా వినయంగా చెప్పిన. అట్లే, అమరులను స్థూపాలుగా మలచి ఒక తంతుగా మార్చడం కాకుండా గుండెల్లో గుడి గడుతం అన్న. అంతకన్నా ఎక్కువ ఏం చేస్తమన్నా అన్నడు ఎల్లన్న. అంతేకాదు, గుండెల్లో గుడి కట్టడంలో ఒక ఉన్నతీకరణ, గ్రామ దేవతలుగా పూజించే విశిష్టత, అలాగే, చిరస్మరణీయంగా నిలుపుకుంటం అని మహోన్నతంగా కీర్తించడం ఇందులో ఉండటం విశేషంగా చెప్పిండు.
ఒకే ఒక్క మాట. చరిత్రను చదివి ఆంధ్రదోపిడీ చూసి అగ్గిపిడుగూలై అంటడు కవి. ఈ మాట, పాట రాసినప్పుడు తమను తాము దహనం చేసుకుని బలిదానం చేసుకున్న ఉదంతాలు లేవు. కానీ ముందస్తుగానే తెలంగాణ అమరత్వాన్ని రానున్న అనివార్య స్థితిని ఈ కవి ముందే ఊహించిండా అనిపిస్తుంది పాట వింటుంటే. ఒక్కటి కాదు, రెండు సార్లు. అగ్గి పిడుగులై అని ఒకచోట, మండే నిప్పు కణికలు మీరు అని అంటడు. ఒక రకంగా అమరత్వం తర్వాత రూపుగట్టిన వైనం ఈ పాటలో ముందే ఆవిష్కారం అయిందనే అనిపిస్తుంది, సూచ్యంగా! బహుశా కవి సమయం అంటే ఇదేనేమో! తెలియకుండా చరిత్రను కైగట్టడం.

తర్వాత తల్లి, తండ్రి, గురువు. ఈ ముగ్గురు దేవుళ్లనూ అమరుల గురించి చెప్పే క్రమంలో కవి ప్రస్తావిస్తడు. అయితే, సావు వార్తా విని గుండె పగిలిన తల్లితో ముగించే చరణంలో ఈ ముగ్గురూ కనిపిస్తరు. కానీ, తల్లి మరణం పాటలో వినేసరికి ముందున్న సారు, ఆ ముందున్న తండ్రి కూడా విలవిల్లాడినట్లు, వాళ్ల గుండె పగిలినట్లూ అనిపించి, తాదాత్మ్యం చెంది- పాట విన్న శ్రోత హదయమూ తీవ్రంగా నీరసపడుతుంది. అంత శక్తివంతమైన చరణాలవి. ఇందులో చదువుల సారం చెప్పిన సారు అన్నప్పుడు విద్యార్థులకు పాఠాలు చెప్పిన సార్లే కాకుండా ఉద్యమ పాఠాలూ చెప్పి కలిసి సాగిన విద్యావంతులు కానవస్తరు. ముఖ్యంగా సిసలైన తెలంగాణ సదువు ఆవశ్యకతను తెల్పిన జయశంకర్ సారూ గుర్తుకు రావడం యాధచ్చికం కాదు.

పాటలో మల్లెపువ్వులారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరూవంకల్లారా అంటూ ప్రకతిని ప్రతీకలుగా చెబుతూ సాగే కవి మీరన్నా జూసిండ్రా బాలా కిషోరాలా అంటూ అమరులు ఏడవోయినరో అని లీనమై అడగడం, బాలా కిషోరాలా అనడం, ఆ మాట కుచ్చుల కుచ్చుల కుల్ల లేవి అన్న జానపద పాటలో తల్లి కొడుకుల సంవాదంలో కనిపిస్తుంది. ఒక తల్లి కొడుక్కు చెప్పే హితబోధలో కానవస్తుంది. మళ్లీ ఆ పదం బాలా కిషోరాలు అనడంలో అమరులను అత్యంత ఆత్మీయంగా తల్చుకుని తల్లి బిడ్డల అనుబంధంలా, తెలంగాణ తల్లి బిడ్డల జమిలిగా కవిత్వం చేసి తల్లడిల్లుతడు కవి.

పాలా బుగ్గల పసిడీ మొగ్గాలు యాడుండ్రో అంటున్నపుడు కూడా సుద్దాల హన్మంతు ఆనాడు పశువులు గాసే జీతగాడి పాలబుగ్గల బాల్యం గుర్తొస్తుంది. గోరటి వెంకన్న మందెంట పోతున్న ఎలమంద గుర్తొస్తడు. ఇప్పటి తరుణంలో క్యాంపస్‌కు వచ్చినప్పటికీ ఆ పశువుల కాపరి మళ్లీ ఉద్యమంలో అమరుడైనప్పుడు ఆ యాతన మళ్లీ తెలంగాణ గోసను ప్రతిఫలింపజేసి, కాలమెంత మారినా, తిరిగి తిరిగి తెలంగాణ ఎంత శోకంలో ఉన్నదో పతాకం యాది చేస్తుంటది. ఇట్లాంటి పదాలతో కూడిన ఈ పాట అటు వెనక్కి పంపుతుంది మనిషిని. ఇటు ముందుకూ తీసుకెళ్తుంది.

ముందుకు ఎట్లా అంటే పునర్నిర్మాణం. అవును. పొద్దు పొడుపుల్లో మీ రూపు జూసుకుంటం అనడంలో ఎల్లన్న అంటడు. స్మరణ అని. చిరస్మరణీయ స్మరణ అని. పుస్తకాల్లో మీ పేరు రాసుకుంటం అనడంలో గుర్తు చేసుకుంటం. చరిత్రలో లిఖించుకుంటం అనడం. అట్లే కన్నీళ్లతో పదునూ కథలు చెప్పుకుంటం అని పాటను ముగించడంలో, అమరత్వం అన్నది పిరికిపంద చర్య కాదు, అది ఒక పోరాట రూపం, సాహస కార్యం, అనివార్య ప్రస్థానం అని నిర్వచించడం. ఇట్లా దరువు ఎల్లన్న ఒక బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వహించిండు. తెలంగాణ సాధన సుదీర్ఘ త్యాగాల ఫలం అని చెప్పిండు. ఆ త్యాగాలను బాధ్యతగా గుర్తిస్తూ, ఆ ఆహుతి వెలుగులో, స్పహతో రేపటి చరిత్రను రచించుకుని ముందుకు సాగుతమని, పునర్నిర్మాణ సోయితో ఒక పాటైండు. అదే కవి సయమం.

కందుకూరి రమేష్ బాబు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]