Full width home advertisement

Post Page Advertisement [Top]

పది జిల్లాల నా తెలంగాణ, కోటి రతనాల వీణ

పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ
వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన
పద గతుల వాణి స్వర జతుల వేణి
ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి
తాళాల జోల దరువుల యాల
సంబురమాడె సింగిడి మేళ
అరె మోదుగు పూల వసంత హేల
తంగెడు పూల బంగరు నేల
జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసె ఆ జింక పరుగున
యిడుపు యిడుపునా జానపదంబులు
యింపుగ పూసిన కవనవనంబులు
యెగసి పారె ఎన్నెన్నొ యేరులు
మురిసి ఆడె బతుకమ్మ ఊరులు

నల్లగొండ
బుద్దుని పాదపు ముద్రల బండ మన ఫణిగిరి కొండ
పద్మ నాయకుల దేవరకొండ    మేటి రాచకొండ
కొలనుపాక తీర్ధంకర పాద
వర్ధమాన ముని తెలిపిన బోధ
యాదగిరి నరసన్న మొక్కులు
జానుపాడు సైదన్న సూక్తులు
వడి వడి కలబడి కుడి ఎడమల బడి
గడీల పొగరును దించిన దళములు
వాడిగ వడిసెల విసిరిన కరములు
పడి పడి పరుగులు పెట్టిన జులములు
నందికొండ నీటితో నిండ ఊరు ఊరున పైరులు పండ
కరువుల బరువులు జరుగును దూరం
నల్లగొండ వరి తరి మాగాణం

రంగారెడ్డి
పారే వాగులు పచ్చని కొండలు
పరిమళమైన పూల గాలులు
కీసర గుట్టలు హరి కీర్తనలు
శివతత్వంబులు అనంతగిరులు
భూమిల దాగిన సలువకొండలు
తాండురు శాబాదు బండలు
కుంకుమ కన్నా మెత్తని దుక్కులు
కూరలు కాయలు కుప్పల రాసులు
రంగారెడ్డి నేలకు విలువ
కుంచములతో బంగారము కొలువ

వరంగల్
పాలకుర్తి కవనపుమేళా
భాగవతము ఘన పోతన లీల
కాకతీయ గణపతి వీర
యుగంధరుడు యోచనలో ధీర
పాకాల రామప్ప చెరువులు
గొలుసుకట్టు జలధార నెలువులు
వేయి స్థంభముల శబ్ధ నాదములు
పేరిని భేరిని నాట్య పాదములు
సమ్మక్క సారక్కల తెగువ
సర్వాయి పాపన్నని మడువ
ఓరుగల్లు అడుగడుగున గుళ్లు
తలచుకుంటే పులకించెను ఒల్లు

కరీంనగర్
మేటి ఏలికలు శాతవాహనుల
కోటి లింగముల పురమీనేల
కోడె ముడుపులకు భజన కొలువులకు
వరములిచ్చె రాజన్న లీల
ఊరి ఊరిలోన ఉక్కుకు మించినట్టి కోట
ఉబికే చరితల ఊట
సిరిసిల్ల మగ్గాల నేత
మేనికి అద్దిన సొగసుల పూత
కవనం భువనం ఎల్లలుదాట
కరీం నగరు వాగ్దేవికి బాట
జ్ణానపీఠమై పూసిన తోట

మహబూబ్ నగర్
తెలుగు వాకిట పరువంబొలికె
కృష్ణవేణి ముఖద్వారం
పుప్పొడి మించిన ఇసుక రేణువుల
అందమైన దుందుభి తీరం
మన్నెంకొండ సిరిసనగండ్ల
గట్టు కూర్మతి జోగులాంబ
రామగిరి శ్రీరంగాపురములు
నల్లమల సలేశ్వరతీర్ధం  
తరాలు గడిసిన వాడని వూడల
ఊయలలూపే పిల్లల మర్రి
పాలమూరు తల్లి


ఆదిలాబాద్

కొమురం భీం, జోడెంఘాట్
గిరిజన వీరుల చరితను చాటు
మేస్రం జాతి తప్పదు నీతి
నడిపించె నాగోబాజ్యోతి
గోండు కోలన్, థొటిఆత్రం
గుస్సాడి నాట్యం, నిర్మల సిత్రం
బాసర తీర్ధం, సంగమ క్షేత్రం
కుంటాల ఝరి జల సంగీతం 
ఇప్ప జిట్ట రేగు టేకు 
నల్లమద్ది దిరిశన మాకు 
ఆదిలబాదుకు అడవే సోకు   

నిజామాబాద్  

జైనుల బౌద్ధుల  
జైనుల బౌద్ధుల భోదనశాల 
విష్ణు కుండినులు ఏలిన నేల
జీనవల్లబుడు హరికేసరుడు  
పంపకవి ప్రవచించిన బోధలు 
ఇంధ్రపురి కైలాసగిరి 
బాలకొండ దుర్గాలబరి  
నల్లరేగడి పసుపు యాగడి   
చెరుకు వెన్నులు పాల జున్నులు   
పంటసేల తళుకు పల్లె పరవశించి కులుకు  
పెద్దగుట్ట ఉరుసు 
బోధను చక్కరయ్యి కురుసు  
గల గల గల గల పైరుల మిలమిల 
నిజామబాదు సిరులకు కళ కళ     
గల గల గల గల పైరుల మిలమిల
నిజామబాదు సిరులకు కళ కళ

ఖమ్మం

పర్ణశాల...
పర్ణశాలసీతమ్మ అడుగులు
భద్రాచలముల నిత్య వేడుకలు
కోనలెంట గోదావరి పరుగులు
జంటగ కిన్నెరసాని నడకలు
పగలే నీడలు పరిచిన చందము
పచ్చని టేకు గొడుగులె అందము
బొగ్గు బావులు అగ్గి నెలవులు
పల్వంచ ఇలపంచె వెలుగులు
గిరిజన జాతుల ఆయువు పట్టు
ఆశయాలు విరబూసిన చెట్టు
ఖనిజరాసులకు తరగని గట్టు
ఉద్యమాల ఖిల ఖమ్మం మెట్టు

మెదక్
మంజీర కంజీరనాదం
సింగూరు జలపొంగులహారం
సంగమ తీర్ధం సాదుల సత్రం
ఏడుపాయల శైవక్షేత్రం
మెతుకు దుర్గముల మేటి కొలుపులు
కోటను మించిన చర్చి తలుపులు
చెరివిరాల బాగయ్య దరువులు
యక్ష్యగాన ఎల్లమ్మ అడుగులు
మల్లినాధుని లక్ష్యణభాష్యం
మాటను పాటను పోటెత్తించిన
నేతల కవులను ఇచ్చిన జిల్లా
తల్లి మెదకు జిల్లా
మలి ఉద్యమాల ఖిల్లా

హైదరాబాద్

మదిలో మెదిలే వదిలిన తావుల
మసలుల కదిపే పల్లె గురుతుల
బతుకుల యాగం బరువుల దాగం
ఉరుకుల పరుగుల బతుకుల తాళం
మరిపించి మురిపించె దామం
భాగ్యనగరమే ఇంద్రభువనము
ఆదరించమని చాపిన దోసిట
అక్ష్యయపాత్రే హైదరబాదు
కుతుబ్ షాహీ అసఫ్ జాహీ
ఘజల్ ముషాహీర్ సునోరె భాయీ
చార్మినారు మక్కా మసీదు
పురానపూల్ ధేఖొరె భాయీ
కొబ్బరి తెటను మించిన ఊట
ఉస్మాన్ సాగర్ గండిపేట
గోలుకొండన ఎగిరే జెండ
ఆశలు విరియును ప్రతిఎదనిండా

గోలుకొండన ఎగిరే జెండ
ఆశలు విరియును ప్రతిఎదనిండా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]