Full width home advertisement

Post Page Advertisement [Top]

 

పిట్ట బతుకు 


 

ఓ పుల్ల
ఓ పుడుక
ఎండుగడ్డి
చిన్న కొమ్మ
చిట్టి గూడు
పిట్ట బ్రతుకే ఎంతో హాయి

ఓ పుల్ల
ఓ పుడుక
ఎండుగడ్డి
చిన్న కొమ్మ
చిట్టి గూడు
పిట్ట బ్రతుకే ఎంతో హాయి

చిగురు టాకు
వగరు పూత
లేత పిందే
తీపి పండు
నోటి కంది చింతలేక
కునుకుదీసే పక్షి బ్రతుకే సౌఖ్య మోయి " ఓ పుల్ల "

పూట కుంటే అంతే చాలు
రేపు ఎట్లనే ధ్యాస లేదు
దాసుకునేటి గుణము లేదు
లోభితనము ఎరుకలేదు
ఈ లోకమెల్ల తరసి చూసిన
నరులకున్న ఈర్ష
అనువంత సైతం పిట్టకు లేదు " ఓ పుల్ల "

చీకటయితే ఒదిగిపోయి
వేకువనే నిదుర లేచి
గాలిలోన ఈదుకుంట
గగనమంచుల తేలుకుంట
కొండకోనలు దాటుకుంటా
కుమ్మరిమ్మల వాలు కుంట
ఎల్ల వింతలు కళ్ళజోసిన
ఏది తనకు సొంత మనదే
తా నల్లుకున్న గూటిలో కొచ్చి
తా నల్లుకున్న గూటిలో కొచ్చి
పున్నమి వెన్నెలనే గాంచును
తానల్లిన  ఆ గూటిని కూడా
పిల్లలెదిగినంక తాను
ఓల్ల నాని వెళ్ళిపోతుంది " ఓ పుల్ల "

 

రామచిలుక
గోరువంక
పాలపిట్ట
తీతువమ్మ
పావురాయి
తెల్ల కొంగ
నరుడు పెట్టిన పేర్లు తప్ప
తమకు ఊరు పేరేలేదు
ఆ పేరు కోసం ఉనికి కోసం ఈసమంతారాటం లేదు " ఓ పుల్ల"


సదువు నేర్పే సాలె లేదు
బోధ జెసే గురువు లేడు
ఓనుకు పుడితే ఉడుకు లేదు
రోగమొస్తే మందు లేదు
అన్ని ఉన్నాయన్న నరుడు
ఆశలోభం వెంటాడంగా
ఏమి లేని పిట్ట సెంతకు
ఏమి లేని పిట్ట సెంతకు
చేరి జాతక మడుగుతుండు " ఓ పుల్ల"

రాసింది: గోరటి వెంకన్న 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]