బుగులు పడుతున్న వీధిలో నిశ్శబ్దం జరజరా పాకుతూ వచ్చి
రాకాసి వాయులీనగీతమై చీలిక చీలికలుగా చుట్టేస్తూ ఉంటుంది
ఇప్పుడు యుద్ధం అంటే...
పౌరుషాల నడుమ నిన్ను నువ్వు చాటుకోవడం కాదు
.
కత్తుల మొనలకు శత్రువులను వేళ్ళాడేయడం కాదు.
రక్తపు ఏరులలో నిట్టనిలువుగా నిలవడం కాదు.
కుట్రల కుతంత్రాల కుళ్ళు వలయాలు కాదు
పగ కాదు..ప్రతీకారం కాదు
నీ సమస్త వికారాల వికృత బతుకును
ఒక్క పరాన్న జీవి వెక్కిరిస్తున్నది
గాలి విషపు పుప్పొడిని నింపుకుని
అగ్గి లేకుండా ప్రతి మనసులో కొలిమిని రాజేసింది
నిన్ను నువ్వు స్పర్శించలేని నిస్సహాయతలోకి
తోసి నువ్వేమిటో తేల్చమని సవాలు విసిరింది
నీ కనుపాపలను మనసారా రెక్కలలో పొదువుకోలేని తనాన్ని రుచి చూడటం.
రాత్రి పగలు తేడా లేకుండా శత్రువు నీకై అణువణువూ
నిండుకొని ఉండడం
వాడిని గెలవాలంటే..
గుండెలో ఒదిగిన కవాటంలా
ఇంటిగూటిలో దీపం వెలిగించాలి
ధైర్యపు ఒడ్డున నిలచి బతుకు గానం చేయాలి
ఇప్పుడు నీది ఒంటరి నిశ్శబ్ద గానమే కావచ్చు.
అది రేపటికి....
ఒక తాడుపై నిలబడిన ఒరుసపిట్టల బృందగానాన్ని వినిపిస్తుంది.
ఇప్పుడు నీది స్వీయ నిర్భంధ బతుకే కావచ్చు
అది రేపటి లోకపు స్వేచ్చాయుత బతుకు చిత్రమై
వీధుల దారుల్లో పచ్చని లతలై పెనవేస్తుంది
-సీహెచ్. ఉషారాణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి