Full width home advertisement

Post Page Advertisement [Top]

చిత్రంగానే ఉంటుంది. ఉద్యమం సామాన్యులను మాన్యులను చేసింది. ఉద్యమాన్ని కాదన్నందుకు మాన్యులను సైతం చెత్తబుట్టలో వేసింది. దేశపతి వంటి కలలు గనే యువకులను సమస్తం ఉద్యమమే అనిపించేలా నిలిపింది. అదే కవి సమయం.

తలలో నాలుకలా మెసిలే అవకాశం వంటిది దేశపతి సాధించుకున్న పరిణతి. అది నందిని సిధారెడ్డి పాటనా, రావెళ్ల వెంకటరత్నం పాటనా, దాశరథి పాటనా అని కాదు, తెలంగాణ పాటను, సమయాన్ని తనదైన వాక్కుతో, గానంతో, అభినయంతో ఒక రకంగా ఏకపాత్రాభినయంతో- ఒక నూతన రూపకం వంటి పాత్రను ప్రతిష్టించి దేశపతి చరిత్రలో నిలిచిపోయే కషి చేసిండు. అందుకు అతడికి అభినందనలు.

అయితే, అభినందనలు సరిపోవు. ఎందుకంటే, ఆయన ఒక మాటన్నడు. ఒక జీవితకాలం చేయవల్సిన పని మలిదశ ఉద్యమంలో చేశాను. ఇంతకంటే నేను చేయగలిగింది లేదు అని! నిజానికి ఆయన అన్నది గొంతు గురించి. అవును. ఒక జీవితకాలం ఉపయోగించాల్సిన గొంతును ఒక్క మలిదశ ఉద్యమంలో పూర్తిగా ఉపయోగించాను అన్నడు. ఆ మాట విన్నప్పుడు ఎవరైనా చలించిపోతరు. అభినందించి లాభం లేదు. వాళ్ల కష్టం అటువంటిది. అదొక సాహసం.

త్యాగం. మేలు. కతజ్ఞతలే చెప్పాలి. నిజానికి మలిదశ ఉద్యమం వల్ల జరిగిన మేలు ఏమిటంటే కొంతమంది మేలుకొనడం, ఎట్లా అంటే వాళ్లు నలుగుర్నీ మేలుకునేలా చేయగలిగారు. అంతకు ముందే వేరే తీరుగా పనిచేస్తున్నప్పటికీ పూర్తిగా తెలంగాణ అంశంగా వారు మారడం అన్నది కొద్దిమందిలోనే జరిగింది. అ దిశగా చాలా వేగంగా నడిచి ఎదిగి వచ్చిన బిడ్డల్లో దేశపతి ఒకరు. తెలంగాణను సైద్ధాంతిక స్థాయిలో చర్చించిన మేధావులు కొద్దిమంది ఉన్నరు. అయితే, వారితో సమానంగా వేదిక మీదకు నడచివచ్చి, వందలు- వేలు -లక్షల ప్రజారాశులకు అందివచ్చిన మనిషై నిలిచిన హదయం దేశపతి.

తన వల్ల జరిగిన మేలు చాలా ఉంది. అందులో ప్రథమంగా చెప్పుకోదగింది పాట. ముఖ్యంగా ఒక పాట. ఆ పాట మళ్లీ తెలంగాణ మలిదశలో నలుగురికీ తెలిసింది. ఆ పాట ప్రజల్లోకి వెళ్లి మన అస్తిత్వాన్ని మరోసారి ఘనంగా చాటి చెప్పింది. వీరులకు కాణాచిరా..తెలంగాణ ధీరులకు మొగసాలరా అన్న పాట అది. ఇది మన గత వైభవ చిహ్నం.

అది ఒకనాడు పాడిపంటలతో, జీవనదీ జలాలతో, ధన కనకరాశులతో ఐశ్వర్యగర్భగా ఉండింది. ప్రపంచ పటం ముందట మహోన్నతంగా నిలిచింది. రత్నగర్భగా ఉన్న భారతావణిలో తనదైన చరిత్ర, వైభవంతో ఉజ్వలంగా ప్రకాశించింది. అంతటి ఘనమైన చరిత్రను వర్ణిస్తూ 1945లోనే రావెళ్ల వెంకటరామారావు గొప్ప పాట రాసిండు. వీరిది ఖమ్మం జిల్లా. తెలంగాణ ఔన్నత్యానికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన అలనాటి ఆ పాటను దేశపతి తిరిగి వెలుగులోకి తెచ్చి బహుళ ప్రాచుర్యంలోకి తేగలిగిండు. అదొక ఘనత దేశపతిది.

ఈ ఒక్క పాటే కాదు, దేశపతి స్వయంగా రచించినవి తక్కువేగానీ తాను ఉద్యమం సమయానికి అవశ్యమైన ఉత్తేజాన్ని అందిస్తయని భావించిన ఎన్నో పాటలను గానం చేస్తూ ప్రజల్లోకి వెళ్లిండు. అందులో ముఖ్యమైంది, నందిని సిధారెడ్డి రాసిన నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ...నా తెలంగాణ అన్న పాట. ఈ పాటను సినిమాకు జేసుదాసు పాడినప్పటికీ మనదైన గానం అంటే దేశపతిదే.

అందులో ఆర్తి, ఆనందం, కడుపునిండా పాడినట్టు ఉండటంతో తెలంగాణ బిడ్డల్ని ఆ పాట సంబుర పర్చింది. అలాగే అమరులపై సారే రాసిన జోహారులు..జోహారులు..వీరులకు జోహార్లు...అమరులకు జోహార్లు అన్న పాట. దీన్ని కూడా ఒక నిబద్ధత కలిగిన తెలంగాణ కార్యకర్తగా ప్రజల్లోకి విస్తతంగా తీసుకెళ్లింది కూడా దేశపతే. అలాగే దాశరథి రచించిన ఆ చల్లని సముద్ర గర్భం అన్న పాటను తాను కూడా విశేషంగా పాడినాడు.

ఇవి కాకుండా మన గేయకవుల పాటల్ని ఎన్నింటినో పాడిండని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఒక్క మాటలో గనుక చెబితే, తెలంగాణ ఏదైతే లోటుగా ఫీలయ్యిందో ఆ లోటును తీర్చడంలో తాను కవికన్నా గాయకుడిగా, గాయకుడికన్నా వక్తగా, వక్తగా కన్నా ఒక తెలంగాణ ఉద్యమ శీలిగా -ఎన్ని వీలైతే అన్ని రూపాల్లో మన అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటిండు. వాదనా పటిమతో ఉద్యమ నిర్మాణంలో తానొక నిర్మాణం అయిండు. ఆ పాత్రకు అభివందనం, కతజ్ఞతలు.

తాను స్వయంగా రాసిన పాటలూ బహుళ ప్రచారం పొందినవే. వాటిల్లో అమరులపై రాసిన ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి అన్న పాట. ఇది గుండెల్ని ఉప్పొంగిస్తుంది. అలాగే, తెలంగాణ చెరువు తీరు జయశంకర్ సారు అన్న పాట. ఈ పాట ఒక రకంగా మన జాతిపిత స్థాయిగల మహోన్నత వ్యక్తిత్వాన్ని అపూర్వంగా స్మరించుకునే గీతం. ఈ పాటలో అరవై ఏండ్ల మనాది ఉంటుంది. అందులో ఒక్కడుగా ఉద్యమించిన సార్ తీరుతెన్నూలూ, ఒక ఆత్మకథనం రీతిలో గీతం ఉంటుంది. పాట మొత్తం ఎంతో హద్యంగా, ఎంతో అభిమానంతో ఆర్తితో రచించింది. అంతే ఆర్తితో ఆలపించిండు దేశపతి.
దేశపతి రాసిన ఇంకో పాట కూడా చాలా ముఖ్యమైందే.

మన తెలంగాణ వైతాళికుడైన వట్టికోట ఆళ్వారుస్వామిపై రాసిన ఆళ్వారు మట్టిపోరు అన్న పాట. మట్టిపోరు అనడంలోనే ఒక అస్తిత్వం. అది పోరాట ఒరవడి అన్న స్పహా ఉంది. అయితే ఆ పోరు పరిపరివిధాలు. వందనాలు అంటూ సాగే పోరుగీతిక అది. ఇట్లా వట్టికోట గురించి గానీ, జయశంకర్ సార్ గురించిగానీ, అట్లే మలిదశ ఉద్యమం అమరుల త్యాగాల గురించిగానీ, ఏదైతే విస్మతమైనదీ, సగౌరవంగా నిలబెట్టుకోవలసింది ఉందో దాన్ని, ఆయా అంశాలను దేశపతి రచించిండు. వందలు, వేల సభల్లో పాడి వినిపించిండు.

అయితే, ఇదంతా తన ఘనత. ఉద్యమ చేతన. అంతకన్నా ఎక్కువగా కాల మహిమ. అవును మరి. తెలంగాణ ఉద్యమం ఎవరితో ఏం పని చేసుకోవాలో చేసుకున్నది. కోటి కలలు గనే యువతరాన్ని కూడా ఒకే కలకు పరిమితం చేసింది. అందరి కలను సఫలం చేసిన దాంట్లో దేశపతి కూడా ఒకరు. ఆయన నటుడు కావాలనుకుని అంతకన్నా ఎక్కువే అయిండు.

కవీ గాయకుడూ వక్తా నటుడూ బహుముఖం అయిండు. తెలంగాణ వేదిక మీద తాను అద్వితీయం అయిండు. కాకపోతే, అసలు తాను కవి అవునా అంటే నేరుగా చెప్పలేని పరిస్థితి. అవును, కాదు. నటుడా అంటే అవునూ, కాదు. వక్తనా అంటే ఏమో? మరేమిటీ? అంటే ఇవన్నీ తానే అయిన దేశపతి వినమ్రంగా నేను తెలంగాణ కార్యకర్తను అంటడు. ఈ సంశయానికి కారణం తన చిన్నప్పటి ఆశయం. నటన. అభినయం. అది కాకుండా పోవడం అన్నది వ్యక్తిగతం. కానీ, ఈ కాలం సమిష్టి. కవి సమయం అంటే ఇదే. ఉద్యమమే రచన.

తన స్థితికి వస్తే, ఒక గొప్ప నటుడు కావాలని- కానీ, కాలేని సమయంలో పుట్టిన తెలంగాణ బిడ్డ దేశపతి. అవును. తన సమస్త సజనాత్మక శక్తులతో గొప్ప నటుడు కావాలనుకున్నడు. అది చిన్నప్పటి ఆశ. యువకుడిగా ఆశయం. కానీ, కుదరలేదు. తెలంగాణ ఉద్యమం అసలు సినిమా రంగమే మనది కాదని తెలియజెప్పడంతో తాను మరో రకంగా ఎదిగిండు. ఒక నూతన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నడు. అందరిలా తాను కవి కాలేదు. గాయకుడు కాలేదు.

వక్త కూడా కాదు. నటుడూ కాదు. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్..మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టు కూడా కాదు. తాను తెలంగాణకు అవసరమైన అంశాలన్నిటినీ ఇముడ్చుకున్న వాడైండు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న విజేతగా నిలిచిండు. ఇప్పుడాయన మనందరి విజయంలో తానూ సగర్వి. ఆ రకంగా దేశపతి మునుపు టీచర్. ఉద్యమంలో ఉద్యమం. ఇప్పుడు స్వరాష్ట్రంలో డిప్యూటేషన్ మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో కేసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడు. తలలో నాలుక. ఉద్యమంలో వెన్నుదన్ను. ఒక వినమ్ర కార్యదర్శి. అంతే. దశాబ్దాల కల సాకారమైన సంతోషంలో తానొక నిండు కుండ. తొణకలేని తత్వం.

చిత్రంగానే ఉంటుంది. ఇదే కవి సమయం. ఉద్యమం సామాన్యులను మాన్యులను చేసింది. ఉద్యమాన్ని కాదన్నందుకు మాన్యులను సైతం చెత్తబుట్టలో వేసింది. దేశపతి వంటి కలలు గనే యువకులను సమస్తం ఉద్యమమే అనిపించేలా నిలిపింది. అట్లా ఉద్యమ క్రమంలో గాయకుడిగా, వక్తగా, కవిగా, కార్యకర్తగా బహుముఖ పాత్రలు ఒకే వేదిక మీద పోషించే రీతిలో కవి సమయం మలిచిన యువతరం దేశపతి.
తానంటాడు నేనొక భావుకుడినైన నటుడ్ని.

గొంతు-దాని మాడ్యులేషన్. ముఖం- భావ వ్యక్తీకరణలు-వీటితో అటు శ్రోతను, ఇటు ప్రేక్షకుడిని ఉత్తేజపరుస్తాను. ఉద్యమ సందర్భాన్ని ఒక నాటకంగా లేదా సినిమాలోని కీలక సన్నివేశంగా మలిచి సకల జనులనూ అందులో తలమునకలయ్యేలా చేసిన వ్యక్తిని. అందుకు కర్త, కర్మ, క్రియా మలిదశ ఉద్యమనిదే. అదే నిర్మాత అయింది. దర్శకత్వం చేసింది. అ క్రమంలో ప్రతి వేదిక మీదా నేను గర్వించదగ్గ పాత్రనే పోషించాను ఆనందంగా చెప్పిండు.

నిజం. ధూం దాం అన్నది కవిగాయకులు, నత్యకారుల సమిష్టి కషి. కానీ, ఒక రకంగా దేశపతి అన్ని శక్తులను ఇముడ్చుకుని తానే స్వయంగా ధూం దాం అయి నిర్వహించిన పాత్ర ప్రత్యేకమైంది. ప్రజా వేదికలనే కాదు, టీవీ చర్చాగోష్టుల్లోనూ తనది అద్వితీయమైన పాత్ర. గంట, గంటన్నర, ఒక్కోసారి రెండు గంటల సేపూ -కూచున్న మనుషులను కూచున్నట్టే వుంచి -తెలంగాణ ఆవశ్యకతను విశదపర్చిన గానం, నాదం- ఏకవ్యక్తి సేనాని దేశపతి. ప్రొ॥జయశంకర్ సార్ అన్నట్టు తనది ఒక కల్ట్. అదే కవి సమయం. తన తర్వాత ఆ దశ వుండదు. ముందూ లేదు. అదే తన విశిష్టత.

నాన్న గోపాలకష్ణ టీచర్, కవి. అమ్మ బాల సరస్వతి - గహిణి. మేనమామ రేడియోలో అనౌన్సర్. తమ ఇల్లూ... తర్వాత తాతయ్య ఇల్లూ... ఇంటి ముందున్న రాముల వారి గుడి, శివాలయం, చిన్నప్పట్నుంచే నాటకాలు. చిన్నమ్మ తనకు వేషం కట్టి నాటకాలకు పంపేది. ఏడేళ్లకే ఏకపాత్రాభినయం. పొరుగిల్లే దివంగత వేముగంటి నరసింహాచార్యులది.

అక్కడ మరిన్ని పుస్తకాలు. ఎదుగుతూ ఉంటే పెరిగిన పుస్తక పఠనం, స్వయంగా రచనలు చేయడం, కవిత్వం. తర్వాత మంజీరా రచయితల సంఘం సాన్నిహిత్యం, నందిని సిధారెడ్డి ప్రోత్సాహం. వివిధ రంగాల్లోని మేధావుల ప్రసంగాలు వినడం. తద్వారా పెరిగిన సామాజిక స్పహ. విప్లవ శీలత. అనంతరం మలిదశ ఉద్యమం. అనివార్యంగా అందులోకి ప్రవేశించడం. కాగా, మంజీరా రచయితల సంఘం గీతం తన తొలి గానం...అటు తర్వాత తెలంగాణం అయింది. తొలి ప్రసంగం ఉద్యమ వాదమూ అయింది. క్రమేణా పాటా మాటా కలగలవడం ...అట్లట్ల వేదిక మీద తెలంగాణకు అవసరమైన ఏకపాత్రాభినయం...ఒక దశలో పూర్తికాలం ఉద్యమమే జీవితం కావడం-ఇదీ సంక్షిప్తంగా తన ప్రయాణం. కరీంనగర్‌లో మాండలిక భాషా సదస్సు ఒకటి జరిగినప్పుడు తాను తెలంగాణ పాట- మన మాండలికం అన్న అంశంపై మాట్లాడవలసి వచ్చింది.

ఆ సభకు సుద్దాల అశోక్ తేజ రావలసి ఉండి రాకపోవడంతో తానే మాట్లాడిండు. రైతాంగ పోరాట పాట, నక్సల్బరీ పాట, తొలిదశ ప్రారంభంలో మన పాటలు - ఈ మూడింటి వైశిష్ట్యాన్ని తాను పాడుతూ వివరించడంతో ఆ సభకు తాను గొప్ప ఆకర్శణగా మారిండు. ఆ సభ తర్వాత తనని అనేక సభలకు వక్తగా పిలవడం మొదలైంది. ఇటు పాటగాడిగా, అటు వక్తగా రాణించడం రెండూ కలసి రావడంతో చాలామంది నన్ను పిలవడం మొదలైంది. ఆ ఒరవడి నాకు తెలియకుండానే నన్ను ఉద్యమంలో క్రియాశీలం అయ్యేలా చేసింది అని అన్నడు దేశపతి.

అయితే, దేశపతి మౌలికంగా తన ప్రసంగాల్లో ఎత్తుకున్న అంశాలు కొన్ని గుర్తు చేయాలి.ముఖ్యంగా పాఠ్య పుస్తకాల పరిశీలన చేసేవాడు. పరాయీకరణకు గురికావడాన్ని అద్భుతంగా వివరించేటోడు. ఇది గొప్ప మార్పు తేచ్చింది. మన నీళ్లు, నిధుల గురించి మాట్లాడేటోడు.

ముఖ్యంగా ఆంధ్రదేశంలో రెండు గొప్ప నదులున్నయి అన్న వాచకాన్ని ప్రస్తావిస్తూ మన కష్ణా గోదావరులు ఆంధ్రాకు తరలిపోవడంలోని కుట్రలను బయట పెట్టేవాడు. సినిమారంగంలో నటీనటులు, వాళ్ల వేషభాషల గురించి వివరించి ఒక దశలో సినిమాలంటే విరక్తి కలిగేలా ప్రేక్షకులను ఉత్తేజపర్చిండు. అట్లే, పిల్లలు చదువుకునే రైమ్స్‌లోనూ మనదైన అస్తిత్వం లేని సంగతిని ఆలపించి మరీ నిరూపించేవాడు. ఇట్లా టీచర్లనూ ప్రభావితం చేసేవాడు. ఒకానొక దశలో టీవీ చర్చలో విద్యామంత్రిని కాదని మా తెలుగుతల్లికీ మల్లెపూదండ మేం చదవం అని చెప్పేయడం, అప్పట్నుంచీ జయజయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా అనధికారికంగా బళ్లలోకి పోవడమూ తన చర్చాఫలమే. ప్రసంగాల్లో అప్పుడప్పుడూ అనుకరణ కూడా జోడించి సీమాంధ్రుల వైఖరిని ఎండగట్టేవాడు.

అలాగే, రావిశాస్త్రి పిపీలికం కథను ఎంతో గొప్పగా నేటివైజ్ చేసి, చీమలన్నీ దండుగట్టి పామును ఓడించే కథనాన్ని తెలంగాణ స్థితిగతులకు అన్వయించి పోరాట గాథగా మలిచి చెప్పేవాడు. ఒకానొక సభలో తన ఒరవడిని కేసీఆర్ అసాంతం వినడం, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో తననూ భాగస్వామిని చేయడం, ఆ క్రమంలో తానూ శిక్షకుడిగా నలబై వేల మంది విద్యార్థులకు మార్గదర్శకం చేయడం ఒక గొప్ప అనుభవంగా చెప్పాడు దేశపతి. ఇక మరింత దీక్షతో అడుగులు వేసిండు దేశపతి.
టీవీ చర్చావేదికల్లోనూ తాను కీలకం అయిండు. హెచ్‌ఎం టీవీ నిర్వహించిన దశ-దిశ కార్యక్రమంలో తన ప్రసంగం పెద్ద హిట్. అట్లే వీ 6 చానల్లో సత్యవాణిని బతుకమ్మ పాట పాడమని అడిగితే ఆమె చేతులు ఉడిగిపోయి కూచోవడం ఒక సక్సెస్. ఇలా ఎన్నో.

సీమాంధ్రుల అబద్దాలను, వక్రీకరణలను, నిందల్ని ఎండగట్టి మనదైన అస్తిత్వాన్ని సగర్వంగా చాటి చెప్పడంలో తాను మరింత బలపడసాగిండు. ఒక రకంగా ఇక నాకు వేరే జీవితం లేకుండా అయింది. సంతప్తి ఏమిటంటే, భువనగిరిలో వట్టికోటవారి గురించి మాట్లాడుతూ వాళ్ల ఊరిలో ఒక విగ్రహం కూడా లేదంటే ఆ గ్రామస్థులు పెద్ద సభ జరిపారు. అదొక తప్తి. మానుకోట మట్టికి దండాలు పెడదామా.. ఆడ మహిమగల రాళ్లు కొన్ని ఏరుకుందామా? అంటే ఆ రాళ్లు తెచ్చి గుడి కట్టిండ్రు. అప్పుడర్థమైంది నా విలువ.. ఇక పూర్తిగా తెలంగాణ ఉద్యమ జీవితంలో తరించాను అని సంతప్తితో చెప్పి ముగించిండు.
కందుకూరి రమేష్ బాబు

2 కామెంట్‌లు:

  1. "Deshapati Srinivas" is immortal in the history of telangana with his HIGH ENERGY contributions in all those areas mentioned above....

    రిప్లయితొలగించు
    రిప్లయిలు
    1. ఔ రాకేష్ అన్న, మన దేశపతి అన్న గురించి గాని, ఆయన పాటల గురించి గాని నీకు ఇంకా ఎమన్న తెలిస్తె చెప్పు అన్న, Post చేద్దాం.

      తొలగించు

Bottom Ad [Post Page]