చిత్రమేమిటంటే, ఈ పాట నిజంగానే ఒక చిత్రమైన పాట. అది జీవరాశుల పాట. దాన్ని పాడుతున్నప్పుడు నర్సయ్య ఒక మ్యాక వలె కనిపిస్తడు. అమాయకంగా ఆనందంగా తన్మయత్వం అయ్యే పశువు వలె అనిపిస్తడు. అది వికతి కాదు, ప్రకతి. ప్రకతిలోని జీవజాలం అంతా కూడా ఉద్యమంలో నిమగ్నమైందని చెప్పే పాట ఇది. ఈ పాటను తాను ఆలపిస్తుంటే కొంచెం దూరం జరిగిన మనిషికి జంతుజాలమంతా, ప్రకతి అంతా ఉద్యమంలో లీనమైన అంశాన్ని అర్థం చేయిస్తుంది. అదే సమయంలో తన పాత్రను మహోన్నతంగా నిర్వచించుకోమని సూచ్యంగా చెబుతుంది. అట్లా ఈ పాట ఒక వివేకం. విచక్షణ, సోయి, నిర్దేశం కూడా. వస్తు శిల్పాల రీత్యానూ ఇది నవ్యమైన పాట, వినసొంపైన గీతమూ.
నిజానికి గిద్దె రామనర్సయ్య గానంలో ఒక శారదగాండ్ల ఆలాపన ఉంటుంది. యక్షగానం కథన శైలి ఉంటుంది. ఆ రీతిలోనుంచి ఈ పాట మరొక అడుగువేసి జానపదం నుంచి ఉద్యమ వర్తమానంగా మారింది. మనిషిని ఆకర్షించే ప్రాకతిక గీతం అయింది. ప్రతి చరణం ఉద్యమానికి జోడింపు. తీరొక్క రీతిలో జీవజాలం చేతన. మమేకం. గమ్మత్తు. ప్రేమ.
పాటను పరిశీలిస్తే, ప్రతి చరణం ఒక జీవం. ఉద్యమ విస్తరణ. కొమ్మలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది..జై తెలంగాణ అన్నది అని పల్లవి మొదలైతుంది. అలసి పోయిన లేడీ కూన గంతులేస్తనన్నది... కాలి గజ్జె గడతనన్నది అంటడు. వినంగనే పాణం లేస్తది. తర్వాత పానం బోయే మేక పిల్ల డప్పునైతనన్నది...దండోరా వేస్తనన్నది అనుకుంట పానం దీస్తడు. ఇప్పుడు పుట్టిన లేగ దూడా దుంకులాడుతున్నది...ధూం దాం చేస్తనన్నది అనీ అంటడు. ఇట్లా ఈ పాట ధూం దాంలో తప్పనిసరి మోత. డిమాండెడ్ సాంగ్. మల్లమల్ల పాడిచ్చుకుని విన్న పాటల్లో ఇదొక్కటి. తానంటాడు, వినవెట్టిన పాట ఉద్యమంలో అన్నీ కలిసొచ్చిన సంగతిని వినవెట్టిన పాట కూడా.
పాటలో లాలిత్యం ఉంటుంది. లేడి కూన, లేగ దూడ వంటి బాల్యం ఉంటుంది. ఇప్పుడు పుట్టిందానికి అదే తపన, పాణం బోతున్న మేకపిల్లకూ అదే ఆలాపన. అది డప్పునైతనన్నది అనడంలో తన చర్మం ఒలిచి ఇస్తానని చెప్పకనే చెప్పడంలో, దండోరా వేసి ఉద్యమాన్ని విస్తరింపజేస్తనన్న ప్రకటనలో మొత్తం కవిత్వంలో ఇదే నిర్మాణం. చావైనా రేవైనా పోరాటమే అన్న ఆరాటం ఉంటది. దానికి అనుగుణంగా పాటను నిర్మించుకుంటూ వెళతడు కవి. అందుకే ప్రతి చరణంలో జీవజాలం విలక్షణంగా ఉంటది.
కోడి గురించి రాస్తడు. పిడికెడంత లేని పిచ్చుక గురించి రాస్తడు. చెట్టూ చేమలకు విస్తరించి రాస్తడు. పొడుసేటి పొద్దుగూడ పోద్దుగూకనన్నది..పోరుకు సై అంటున్నది అనీ అంటడు. ఇట్లా మలిదశ ఉద్యమం ఎంత బలంగా నలుదిక్కుల నుంచి మద్దతు కూడగట్టుకున్నదో చెప్పడానికి భిన్నంగా ఈ పాటను రచించి చూపుతడు కవి. ఇట్లా జీవజాల కవిత్వాన్ని రచించి ఉద్యమానికి అంకితం చేస్తడు కవి గాయకుడు రామనర్సయ్య.
ఈ పాటలోని ప్రతి చరణం అద్భుతం. అన్నిటికన్నా గొప్ప ప్రయోగం, ఈ పాటలో నక్కబావను ప్రస్తావించడం. జిత్తుల మారి నక్క కూడా ఎత్తులు వేస్తుంది. కుట్రలు చేస్తుంది, తెలంగాణ సాకారం కావడానికి చేయవలసిందంతా చేస్తుంది. నిజంగానే మనమంతా శత్రు వైరుధ్యాలను పక్కనబెట్టి పనిచేయడం చూస్తున్నదే. ధనికుడూ నిరుపేదా ఒక్కటైండ్రు. కులం మతం తేడాలేదు. ఎంత తిట్టుకున్నా మనలో మనం. అట్లా చూస్తే, సకలం ఒక్కటై ఐక్యంగా రణం చేస్తున్నట్లే, అడవిలోని జంతువులన్నీ తమలో తాము ఐక్యంగా ఉండి ఉద్యమాన్ని కాపాడుకుంటై. అందుకోసం నక్క బావ సైతం ప్లాను గీయడం అద్భుతంగా ఉంటుంది. పాటలో ఇట్లా విశ్లేషించుకుంటూ చరణాలన్నీ విళ్లేషించుకోవాలి. అంత లోతు కవిత ఇది. అన్నట్టు తనకు ఇద్దరు బిడ్డలు. ఒక బిడ్డకు తాను పెట్టుకున్న పేరు విశ్లేషిత.
నిజానికి ఇదొక్కటనే కాదు, తాను చాలా చక్కటి పాటలే రాసిండు. లోతైన సహజత్వం తన ప్రత్యేకత. ముఖ్యంగా సారా సారామ్మ సారా అన్న పాట అందరూ విన్నదే. ఇది తాగుబోతును గూర్చిన పాట. సోయి తప్పేంత తాగిన తాగుబోతు పాట. ఈ పాటతో మనిషికి స్పహ తెప్పించడం గిద్దె నర్సయ్య ప్రత్యేకత. అట్లే కొమ్మలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది అని చెప్పే ఈ పాట ఉద్యమం పట్ల సోయిలేని వారి కళ్లు తెరిపించే పాట.
మహోధతంగా సాగిన ఉద్యమంలో సకల జనులూ చేరిన వైనాన్ని పోల్చినట్టే పోలుస్తూ, స్వతంత్రంగానూ ప్రకతి కూడా తన ధర్మాన్ని తాను పోషిస్తున్నదని, ఇక్కడి మనిషికి ప్రకతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని అపూర్వంగా ఆవిష్కరించిన పాట ఇది. నిజానికి తన పాటని ఒక పదిసార్లు గనుక ఎవరైనా వింటే (ఆ పాట కోసం ఇడ ఒత్తుర్రి ) లేగదూడ వలె దుంకులాడటం ఖాయం. అంత ఆహ్లాదమైన కవిత్వం తనది. జానపద గానం ఇతడిది.
విశేషం ఏమిటంటే, ఈ పాటను ఉద్యమం ఉధతమైనంక రాసిండు. సకల జనుల సమ్మెకు ముందే రాసిండు. రెండేళ్ల కింద, ఒక ఎండాకాలం, తన ఊర్లో సర్కారు తుమ్మచెట్టుకింద మంచం వేస్కొని పండుకున్నప్పుడు కోయిల డిస్ట్రబ్ చేస్తే రాస్తడు కవి. మొదట డిస్టరుబెన్సే అనుకుంటడు. కానీ అది మెలుకువ. మేలుకొలుపు అని తర్వాత అర్థమైతది. ఆ తర్వాత అనుకుంటడు. తెల్లారి లేస్తే ధూం దాం. ఇది నన్ను నిద్రపోనిచ్చేటట్టు లేదు అని. ఆ తర్వాత అనుకున్నడట...ఈ కోయిలమ్మ కూడా జై తెలంగాణ అంటున్నదా ఏందీ అని. అటెన్క అనిపించిందట, ఆరేళ్ల పిల్లగాడి నుంచి అరవై ఏండ్ల ముసలి వరకు ఉద్యమంలో లీనమైండ్రు. అట్లనే ఈ పక్షులు గూడా జై తెలంగాణ అంటున్నయా ఏమిడ్తని! అట్ల అట్ల మొదలైన ఆలోచన ఆ రాత్రే తనతో ఈ పాటను పూర్తి చేయించిందని వివరించిండు నర్సయ్య.
పాటలో తనకు బాగా ఇష్టమైన చరణం చీమలు ఉన్నది అన్నడు నర్సయ్య. అవును. అవి చలి చీమలట. అడవిలున్న ఆకులన్ని అలికిడి జేస్తున్నయ్...అలాయ్ భలాయ తీసుకున్నయి అంటూ, తర్వాత చీమలన్ని జంట వట్టి ర్యాలీ తీస్తున్నయ్, మేం రణం చేస్తమన్నయి అని రాస్తడు.ఎందుకూ అంటే, చీమలు జంట వట్టుకుని వోతుంటే తప్పించలేం. తప్పించినా మళ్లీ అట్ల జంటగనే కదులుతుంటయి. వాటిని ఎవ్వడూ ముట్టుకోలేడు కూడా అన్నడు. ఉద్యమ స్థితిని ఇంతకంటే బాగా చెప్పలేమనిపిస్తది నాకు. అందుకే చీమల ర్యాలీ నాకిష్టమైన ప్రయోగం అని వివరించిండు నర్సయ్య.
పాటలో ఇంకో విశేషం, చెట్టు కొమ్మలన్నీ లేసి బాకులైత మన్నయ్... బందూకులెత్తమన్నయి అన్నంక వచ్చే వడ్లపిట్ట ముక్కుతోటి గన్నుజేస్తమన్నది... తెలంగాణ దెమ్మన్నది అని చెప్పడం. ఉద్యమం కోసం తనవంతు కర్తవ్యంగా వడ్లపిట్ట గన్ను జేయడం అని కవి పేర్కొనడం అపూర్వంగా ఉంటది. ఇట్లా పశుపక్ష్యాదులు, చెట్టూ చేమా స్ఫూర్తిదాయకమైన ఉద్యమ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఈ కవితా నిర్మాణ రహస్యం అనుకోవాలి.
కొత్తగా రాయాలని అనుకున్నను. భిన్నంగా రాయాలనుకున్నను. ఆ పని ఈ పాటతో చేసిన అని అభిమానంగా చెప్పిండు నర్సయ్య. నిజానికి నర్సయ్య కవిత్వంలో గోరటి వెంకన్నలోని పల్లె, జయరాజ్ అన్నలోని ప్రకతి ఒక స్రవంతిగా పారి తనదైన ప్రతీకలతో నిలబడటం ముచ్చటకొల్పుతది. ఈ సంగతి తాను అంగీకరిస్తడు కూడా.
ఉదాహరణకు నువ్వు గన్ను వడితె ఉడుము నీకు అండగుంటది అని జయరాజ్ అన్న రాయడంలో అటు ఉద్యమానికి ప్రకతి తోడు రావడం ఉంటుంది. అటువంటి నిర్మాణ విస్తరణ ఒకటి నర్సయ్య కవిత్వంలో వడ్లపిట్ట వెన్నుదన్నుగా తయారు చేసిచ్చే గన్నులోనూ కానవస్తది. అంతేగాదు, వెంకన్న పల్లె అందాలు ఇక్కడ ఉద్యమ సోయితో నిండుగ మారుతై. వానొచ్చెనమ్మా వరదొచ్చెనమ్మా.. వానతో పాటు వరదొచ్చెనమ్మా అన్న వెంకన్న పాటలో వాన అమరుల స్తూపాన్ని అభిషేకమూ చేసి సుత్తి కొడవలిపై ముత్యమై మెరుస్తుంది.
ఇక్కడ నర్సయ్య కవిత్వంలో అది కొత్తగా ఉంటది. వాన తక్కువై స్తూపం ఎక్కువైతుంది. స్తూపం స్వభావం లేదా ఉద్యమ స్వభావానికి వాన మోకరిల్లుతుంది. ఇట్లా శిఖరమే కాకుండా నర్సయ్య కవిత్వంలో మొత్తం బాడీ కొత్తగా కానవస్తది. ఎట్లంటే, పాట చివర్లో వాన చినుకు గురించి మహత్తరంగా రాయడం గమనించాలి. ఆ చినుకు తన బాధ్యతగా ఏం జేస్తదటా అంటే, తాను రాలి స్తూపమును కడిగి వేస్తదట. అమరత్వానికి తానిచ్చే ఘన నివాళి అదేనట. అట్లా కురిసి కడుగుతదట. కడిగి కండ్లకద్దుకుంటదట. ఇట్లా నర్సయ్య మొత్తం ఉద్యమ స్తూపావిష్కరణ జేస్తడు ఒక చినుకు ప్రతీకతో. అదీ ఇతడి కవితా వైభవం.
ఇట్లా చూస్తే రామనర్సయ్య రాసిన ఈ పాటలోని ప్రతి చరణం అద్భుతం. నిజానికి తనది చాలా తీక్షణమైన దష్టి. బీస్ట్‌ను దర్శించి దాన్ని హోస్ట్‌గా చిత్రించగల శక్తి. శత్రువును సాదువుగా చూపించే కౌశలం తనది. బహుశా ఉద్యమం వల్ల తన శక్తియుక్తులన్నీ కలిసి వచ్చిన పాటగా ఈ కోయిలమ్మ పాటను చూడాలి. అందుకే, ముందే ప్రస్తావించినట్లు- ఒక్క నక్క బావ గురించే కాదు, చెరువుల్లోని చేపల్ని సటుక్కున నోట కరుచుకునే పిట్ట ఒకటుంటది, సాల్ల (సార్వ). అది గద్దను కూడా కొడతది.
దాన్ని కూడా పాటలోకి తెచ్చి అది కూడా ఉద్యమంలో సై అంటున్నదని చెబుతడు కవి. ఇట్లా జీవావరణ వ్యవస్థలో ఒకదానిమీద ఒకటి బతికేవన్నీ ఉద్యమంలో శత్రువుకు వ్యతిరేకంగా కదలడంగా చూపడం ఇతడి పాట మహత్యం. మరోమాటలో చెబితే, మనలోని విభేదాలన్నీ మరచి ఏకైక ధ్యేయంగా తెలంగాణలో కలసి వచ్చిన వైనం ఇప్పటి కవి సమయం. దాన్ని తన పాటలోకి అపూర్వంగా తెచ్చి, పదునైనవీ, లేతవీ అయిన ప్రతీకలతో ఆ పాటను ఉద్యమంతో పరవళ్లు తొక్కిస్తడు నర్సయ్య.
నిజానికి తన నిర్మాణం అంతా కూడా అంతర్వాహిణి. లోలోపలి పదనిసలు. కానీ, పదాలు పాతవే. కానీ, వాటిని ఉద్యమంలోకి జమాయించి చూపుతాడు తాను.చెట్టుచేమలన్నీ గూడి ఊపిరి వోస్తమన్నయ్... ఉద్యమాలు జేస్తమన్నయ్ అన్నంక, పొడుసేటి పొద్దుగూడ పొద్దుగూక నన్నది అంటడు. పొద్దుగూడ పొద్దుగూకనంటది అనడంలో ప్రతీకలోంచి ప్రతీక, పదంలోంచి పదం, అంతా ప్రకతిలో భాగంగా రచనా నిర్మాణం ఉంటది. ఇటీవల ఈ కవి రాసిన తెలంగాణ ప్రకటనొచ్చిందో అన్న పాటలో కూడా పొద్దును వాడుతడు. పొడుసేటి పొద్దమ్మ వంగి ముద్దాడింది అని రాస్తడు. ఉద్యమం విజయవంతమై తెలంగాణకు అనుకూలంగాప్రకటన వచ్చిన తరుణంలో తెలంగాణ పల్లె తల్లి మురిసిపోతున్నదని చెప్పే పాట అది. అందులోనూ ఇట్లా చీకటి వెలుగులతో ఉద్యమాన్ని చెప్పడానికి మనిషి మాదిరే పొద్దును చూపుతడు. ఇట్లా ఈ కవికి ప్రకతి నుంచి కైగట్టడం ఒక ఆటా పాట అనిపిస్తుంటుంది.
పైన పొద్దమ్మ అని కవి రాసినట్లే అమ్మ తన కవిత్వంలో అధికంగా కానవస్తుంది. అమ్మా...ముద్దుబిడ్డను గన్నావమ్మా...అమ్మా...తొలి పొద్దును గన్నావమ్మా అని రాసిన ఇంకో పాటలో కూడా అంతే...పల్లె తల్లి తనువంతా పులకరించేలా, చేతులు జాపిన బిడ్డను ఎత్తునేలా రాస్తాడు కవి.
ఇట్లా ఈ కవీగాయకుడిలో పల్లెను అమ్మా అన్న అర్తితో కావలించుకోవడంలో ఒక తాదాత్మ్యత, అంతులేని మమకారం కనిపిస్తుంది. ఒక రకంగా ఉద్యమం విస్తరించినకొద్దీ పల్లె తల్లి మరింత దగ్గరవడం, అది తెలంగాణ తల్లి అవడమూ ఇతని కవిత్వంలో జూస్తం. చిత్రమేమిటంటే, ఈ కవి తొలుత రాసిన పాటల్లో పల్లె పట్ల ఇంత అనురాగం ఉండదు. విషాదం ఉంటుంది. ఉన్నది మా ఊరు... పేరుకు అంటడు. ఆ పాటలో పేరుకు మాత్రమే అనడంలో పల్లె పూర్తిగా దెబ్బతిన్న వైనం ఉంటుంది. అక్కడ్నుంచి మలిదశ ఉద్యమంలో పల్లె ఉద్యమ సోయితో పునరుజ్జీవనం పొందడం తదనుగుణంగానే ఈ కవి రాసిన పాటలో మాదిరి తల్లి ఆనవాళ్లు పెరుగుతుంటై. ఆ క్రమంలో తల్లి పెరిగినట్లే తల్లికన్నా పెద్ద ఇతివత్తం ప్రకతిని తీసుకుంటడు కొమ్మల్లో కోయిలమ్మ అన్న పాటలో. అనేక జీవరాశులను పాటలోకి తెస్తడు. అట్లా తెలంగాణ ఉద్యమంలోకి తల్లి భావన ఎట్లయితే అనివార్యమైన విస్తతి అయిందో, పాటలో ఉద్యమం విశ్వదర్శనం కావడం, ప్రకతిలోని జీవరాశి ఒకటొకటిగా కానరావడం అంతటి విస్త్రతి. ఆ పని మహత్తరంగా చేసిన కవి, గాయకుడు రామనర్సయ్య. తనకు ఉద్యమ అభివాదం. ఆ పనిని సాకారం చేసుకున్న తెలంగాణ ఉద్యమ పరిణతికి పరిపరి దండాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి