Full width home advertisement

Post Page Advertisement [Top]

ఇది కొత్త విలువల కాలం. ఇది తెలంగాణ సఫలం చేసిన కవితా న్యాయం. రసమయి సంస్థ పేరిట సంక్షేమ గీతాలు పాడే బాలకిషన్ మలిదశ ఉద్యమంలో ధూందాం వ్యవస్థాపకుడిగా ఎదిగి రావడం ఒక కవి సమయం.
ఇప్పటి దాకా పదమూడు మంది కవి గాయకుల గురించి బతుకమ్మ సీరియల్‌గా ప్రచురించింది. వారంతా మలిదశ ఉద్యమంలో గొప్ప పాటలు రాసిన వాళ్లే. ఉద్యమ విస్తతిని అడుగడుగునా పెంచిన వారే. నిజానికి వారంతా ఒక్కొక్కరుగా చేసింది ఎంతో ఉద్యమం వారిని నిలిపిందీ అంతకు ఎక్కువ. పరస్పరం అనడం కంటే ఉద్యమ సమర్పణే వారి విజయం అనాలి. అందుకే కవి సమయం అని గనుక పేర్కొనవలసి వస్తే ఆ క్రెడిట్ అంతా మలిదశ తెలంగాణ ఉద్యమానిదే. ఇదే కవి సమయాన్ని కన్నది. అందులో జనించిన కవి గాయకులే వాళ్లంతా. అయితే, అంతకన్నా ముఖ్యంగా మొత్తం తెలంగాణ సాంస్కతిక పునరుజ్జీవనంలో ఈ తీరొక్క పూవుల్ని కలిపింది, ఒక పెద్ద బతుకమ్మను చేసింది మాత్రం ధూం దాం. దాని వ్యవస్థాపకుడే రసమయి బాలకిషన్. ఈ వారం తానే కవి సమయం.

నిజానికి తాను కవి కాదు, కానీ, ఇది కవి సమయం. ఉద్యమ సమయం అని రాయడం. తాను కవి కాదనీ అనలేం. ఎందుకంటే కవి వలే అగుపించాడు. తెలంగాణ మర్చిపోయిన వినోదాన్ని పంచిపెట్టిండు. పాటలకు మాటలు పేర్చిండు. అవసరమైన కల్పన చేసిండు. గాయకుడే. కానీ వ్యాఖ్యానాన్ని సైతం జోడించి ఉద్యమ వేదికను పాటతో ఉత్తేజ పర్చిండు. తనదైన వ్యాఖ్యానంతో, ప్రదర్శనతో, నిర్వాహణా కౌశలంతో ఉద్యమ సమయంలో తానే కవి గాయకుడైనట్టు పాత్రోచిత పోషణ చేసి సెహభాష్ అనిపించుకున్నడు.

ఒక్కమాటలో పూసవేర్లోళ్లు గంపను నెత్తిమీద మోసినట్టు, ధూం ధాం అన్న తీరొక్క పూల బతుకమ్మను నెత్తిమీద మోసింది రసమయి బాలకిషనే. ఆ కష్టసుఖాల ఆటాపాటా ఇవ్వాళ సఫలమైంది. ఒక రాష్ట్రంగా తెలంగాణ దక్కిందీ అంటే అదొక ఉమ్మడి విజయం. వ్యక్తిగత సాఫల్యం కూడా.

అంతెందుకు, ఒకనాడు ప్రజలు అన్న మాట విశిష్టమైంది. కానీ, ప్రజల పేరిట గేయ కవుల ముక్కూ మొహం తెలియకుండా పోయింది. ఇప్పుడు సకల జనులు వచ్చి చేరింది. ఇదొక అమూర్త భావన. కానీ, మునుపటి పరిస్థితి లేదు. ఎవరి కాంట్రిబ్యూషన్ ఏమిటన్నది అందరికీ తెలుస్తోంది. ఉద్యమంలో ఏదీ అజ్ఞాతంగా లేదు. ముఖ్యంగా పాట. అది ధూందాం అయింది. అందువల్లే మనుషులు కూడా లేచిండ్రు. తమ కళలతో లేచిండ్రు. సామాన్యులు అసామాన్యులైండ్రు. వాళ్ల గతాన్ని వర్తమానంతో బేరీజు వేసుకుని సమున్నతంగా ఎదిగిండ్రు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నరు.

కవులు, కళాకారులు, పాత్రికేయులకైతే ఇదొక పునరుజ్జీవన యుగం. ఆ క్రమంలో ఒక అకాశవాణి, దూరదర్శన్, అక్షర ప్రభతో బతుకు దెరువు పొందే కళాకారుడైన రసమయి తెలంగాణ సందర్భంలో భూమ్యాకాశాల మధ్య ధూందాం అయి లేచిండు. తనతో పాటు ఎందర్నో లేపిండు. తెలంగాణ సరే, వూరూరా తిరిగిండు. ఖండాంతరాలు దాటిండు. సూటుకేసులో గోచీగొంగడి గజ్జె పెట్టుకుని గాలిమోటరు ఎక్కిండు. ముంబై, దుబాయ్, ఆస్ట్రేలియా, లండన్‌కూ పోయి వచ్చిండు. పేర్లు తెలియని కవుల పాటల్ని ప్రజల దగ్గరకు జేర్చిండు.

వాళ్ల సాహిత్యానికి ప్రచారాన్నీ కల్పించిండు. అంతెందుకు? గద్దర్ వంటి సాంస్కతిక యోధుడు తెలంగాణలో మళ్లీ తిరగాడిండూ అంటే, అది తెలంగాణ సమయం. ఆ సమయానికి ధూందాం సదవకాశం కల్పించిందీ అన్నా తప్పులేదు. ఒప్పుకోవల్సినవి ఇట్లే ఉంటయి. ఎందుకంటే మామూలు మనుషులు మామూలుగా లేచిన సమయం కాదిది! అందులో ఒక బుడ్డరఖాన్ రసమయి. మలిదశ ఉద్యమంలో ధూందాం ఆ ఏర్పుల బాలకిషన్.

ఒకనాటి భాగోతాల సమయంలో బుడ్డరఖాన్ పాత్ర ఎట్లయితే సభికులను రక్తి కట్టించేదో అటువంటి పాత్రను ఉద్యమ కాలంలో రసమయి పోషించిండు. రాజకీయ కోణాన్ని జోడించి, హాస్యం, వ్యంగ్యం కలగలిపి మహోన్నతంగా తనను తాను తీర్చిదిద్దుకున్నడు. ఉద్యమ విస్ర్తుతి వల్ల ఆ పాత్ర హాస్యగాడిని తలదన్ని వీర రసం అయింది. సీమాంధ్రుల కుత్సితాలను బైట పెట్టేందుకు, వారి ద్వంద్వ నీతిని బట్టబయలు జేసేందుకు నిజంగానే తన పాత్ర అవసరమైంది. అందుకు చుట్టూరా సుశిక్షితమైన పాత్రధారులు అవసరమైండ్రు. ఒక బొడ్రాయి, బతుకమ్మ, బోనాలు, పీరీలు లేచినయి. అందుల సగర్వంగా గద్దర్, గూడ అంజన్న, అంద్శై, గోరటి వెంకన్న, విమలక్క, జయరాజ్ తదితరులు బైలెల్లిండ్రు. కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట దాటి హైదరాబాదులోని లలితకళా తోరణం... ఇక తిరుగులేదు. అంతటా అదే, ధూందాం.

చిత్రం ఏమిటంటే, స్వయంగా తాను ఒక్క పాట కూడా రాయకుండానే పాటగాళ్లలో ఒకడైండు. ఆటగాళ్లను ఆడించిండు. తలా ఒక్క పాటైతే తాను అందరి తలలో నాలుకైండు. అన్ని పాటలూ తానైండు. ఒక రకంగా తానే కవి గాయకుడూ వేదికా అయిండు. ఒక్క మాటలో ధూందాం అయిండు.
ఇదంతా నాటకీయంగా అనిపించినప్పటికీ అదొక అనివార్యమైన ప్రస్థానం. నిజానికి బాలకిషన్ అంటే ఎవలికీ తెలియదు. రసమయి బాలకిషనే. వయసు 46 ఏళ్లు. సిద్దిపేట మండలం రావురూకల గ్రామస్థుడు. మాదిగ కులంలో పుట్టిన నిరుపేద.

నాయిన వ్యవసాయకూలి. అది పేదరికం. కానీ, భాగోతాలు ఆడేవాడు. అందుల సంపన్నుడు. తల్లి మైసమ్మ కూలి. మళ్లీ పేద. కానీ చేన్ల వంగిందీ అంటే, మునుం పట్టిందీ అంటే కష్టం మరిచే పాటయ్యేది. చెమట చుక్కల సంపన్నత. ఇట్లా తల్లితో పాటలు, తండ్రితో ఆటలు, చిరుతల రామాయణం ఆడిన దళిత జీవితపు డప్పు వారసత్వం తనది. చిన్ననాటి సొందే బాల్యం బాలకిషన్‌ను కష్టజీవిని చేసింది, కళకు పరిచయం చేసింది.


తాను ఏడో తరగతి వయసులో మొదట పోలీస్ స్టేషన్ల గోడకుర్చీ వేసిండు, గద్దర్ పాట పాడినందుకు. అది గద్దర్ గానమే. గూడ అంజయ్య పాట. ఊరు మనదిరో అన్న పాట. మస్కట్ పోయి వచ్చినోళ్ల ఇంట్ల రికార్డర్ ఉంటే అందులో క్యాసెట్ల నుంచి విని, రాసుకుని పాడితే దొర సయించలేదు. దొర పీకుడేందిరో అన్నందుకు పోలీస్ ఠానాల అప్పజెప్పిండ్రు. అప్పట్నుంచీ దొరతనమంటే విసుర్లే, వ్యంగ్యమే. ఒక ఆశ్రయ కవిత్వపు వెల్లడి. అదే తన ధూందాంలో వినవస్తుంది. అయితే. ఇక్కడే తన నిర్మాణం ఉన్నది.

అన్యాయం అని ఎలుగెత్తి చాటేందుకు తానే పాట రాయాల్సిన పరిస్థితి కనబడలేదు. ఉన్న పాటతో తాను గలం ఎత్తితే చాలనుకున్నడు. దొర ఏందిరో అనడం అంటే అది గద్దర్ పాటనా? గూడ అంజన్న రాసిండా? అన్నది కాదు. తన దష్టి అంతా కూడా దొర. దొరను ఎండగట్టడమే ప్రధానం. ఈ ఒరవడే రసమయిని ధూందాం నిర్వాహకుడిని చేసింది. తెలంగాణ అస్తిత్వాన్ని చెప్పడానికి, సీమాంధ్రులను తరమడానికి ఎటువంటి మొహమాటం లేకుండా అన్ని పాటలతో ఒక తేనెతుట్టెను నిర్మించేలా చేసింది. మరో రకంగా చెప్పాలంటే తనకు వస్తువు ముఖ్యం. కవి కాదు. కవి ద్వితీయం కూడా. అందువల్లే తెలంగాణ సమయానికి తానొక సందర్భాన్ని రచించాడు. ఒక్క మనిషి వందలాది కవిగాయకులను మోయగలిగాడు. వాళ్లతో తెలంగాణ తల్లి రుణం తీర్చగలిగాడు.

ఇక తన విషయంలోకి వెళితే, తనకు ఇద్దరు అన్నదమ్మలు. ఇద్దరు అక్కాచెల్లెండ్లు. బతుకమ్మ పండక్కి ఆడిబిడ్డలను తీసుకొచ్చేటోడు. ఆడతానికి కాదు, సూస్తానికి. అదీ మన తెలంగాణ దుస్థితి. మాదిగోళ్లు ఆడరు. వాళ్లు ఆడకపోయినా సూస్తానికి వచ్చేటోళ్లు. వాళ్లు తమ ఇంటిముంగల కూడి పాట వాడుతూ ఆడేటోళ్లు. మధ్యన బతుకమ్మ లేకపోయినా ఆడేది. అదొక వెలితి. ఈ వెలితీ తనను కలచివేసింది.

ఆ దొరతనం, బతుకమ్మ ఆడనీయని తనం. ఆకలి, అవమానం, పీడన, అణచివేతా -ఎంతోమంది దళితులను కలచివేసినట్లే తననూ కలచివేసింది. ఆ ప్రభావాలు తనను ఆటగాడిగా పాటగాడిగా చేశినయి. దండోరా పేరిట ఇంటర్లో నాటకం వేసేలా చేసినయి. దళిత రత్నాలు పేరిట డిగ్రీలోనే ఉండగా ఆడియో క్యాసెట్ తయారీలో పాలుపంచుకునేలా చేశాయి. అప్పుడు కేసీఆర్‌ని కలిసిండంటే ఇప్పుడు కలిసి అసెంబ్లీకి వెళ్లే స్థాయికీ వచ్చిండు. ఇదంతా ఒక ప్రయాణం. తనదైన నిర్మాణంతో ఎదిగిన క్రమం. ముందే చెప్పినట్టు వస్తువు ముఖ్యం. ఎవరిదని కాదు. అదీ తన కవి సమయమే.

అయితే, తాను గోచీ గొంగడి వేసుకుని గజ్జె కట్టుకుని ఆడటం పాడటం చూడటం అలవాటైనందున తాను చదువుకున్నట్టు అనిపించదు. కానీ, తాను విద్యావంతుడు. ఎంఎ చదివిండు. జానపద కళలపై ఎం.ఫిల్ కూడా చేస్తున్నడు. అదీగాక తాను ఉపాధ్యాయుడు. కానీ, ఉద్యమం ప్రారంభం నుంచి తాను చురుగ్గా ఉన్నందున సుదీర్ఘకాలం లీవ్‌లోనే ఉన్నట్టయింది. 19 ఏండ్ల తన ఉద్యోగ కెరియర్‌లో తాను 14 ఏళ్లు లీవ్‌లోనే ఉన్నడు. లాస్ ఆఫ్ పేతోనే ఉద్యమంలో లీనమైండు. ఇదెందుకు చెప్పడం అంటే తాను చదువుకున్నడని. ఉన్నత విద్యావంతుడని. అన్నిటికన్నా ముఖ్యంగా తాను ఉపాధ్యాయుడని, అంతకన్నా ముఖ్యంగా తానొక నాయకుడని. ధూందాంను అపూర్వంగా ఆర్గనైజ్ చేసిన ఉద్యమ కారుడని. అదీగాక తానిప్పుడు గురుతర బాధ్యుడు, ఒక నియోజకవర్గ ప్రజలకు ప్రతినిధి. దేశంలోనే బహశా అసెంబ్లీలోకి ప్రవేశించిన ఏకైక పాట కూడా తానే కావచ్చు! అదీ తన ఘనత.

ఇది కూడా కాదు. తాను డిగ్రీ లెవల్‌లో ఉన్నప్పుడు స్థాపించిన రసమయి కళా సమితి ఒకనాటి స్థితి. సామాజిక గీతాలు పాడటం, మద్యపాన నిషేధం, అక్షరాస్యతలపై పాటలు పాడటం -ఇదంతా ఒకనాటి పని. ఆ క్రమంలో స్వాతంత్య్ర స్వర్ణ్షోత్సవాల సందర్భంగా ఇండియా గేట్ దగ్గర ప్రదర్శన ఇవ్వడం ఒకనాటి ఘనత. అంతటితోనే అయిపోకపోవడం తన కవి సమయం. అవును. ఉద్యమం తనను తెలంగాణ ఒడిలోకి తెచ్చుకున్నది. మొదటి పాట కేసీఆర్ సింహ గర్జనలో(2001) కరీంనగర్‌లో. గల్లు గల్లు గల్లు గజ్జెల మోతో అంటూ పాడిన అంద్శై పాట. ఉద్యమంలో అది తన తొలి పాట. ఆడినుంచి మొదలైన తాను తెలంగాణ అస్తిత్వ పాటా ఆటాగా మారి, తనను పూర్తిగా ఉద్యమ సమయానికి లోను జేసుకుని, తన చేత ధూందాంను ఆవిష్కరింపజేసుకున్నది. అదీ తెలంగాణ తల్లి మహిమ.

ఒకనాడు జానపద పాటలసు సేకరించడం నాకు బతుకు దెరువు. తర్వాత బతుకు పాటను గానం చేయడం ఉద్యమ దరువు అయింది అని వినమ్రంగా చెప్పే రసమయి ఇప్పుడు మరొక అద్భుతమైన స్థితిలోకి వచ్చిపడ్డడు. నిజానికి ఇప్పుడు తనకు పెద్ద రంది పట్టుకున్నది కూడా. తాను అసెంబ్లీకి ఏగాడు. మరి ఆడ పాట పాడాల్నా? కాదనే అంటున్నడు. పాట ప్రజలది. ఉద్యమానిది. ప్రభుత్వం గనుక విఫలమైతే మళ్లీ తాను ధూందాం ఒరవడిలోకి వెళతడు. తానేకాదు, మొత్తం సమాజం ఆడుతది, పాడుతది, ప్రభుత్వాన్ని ఆడిస్తది. అందులో తాను మళ్లీ మొదటికి వస్తడు. ఆ పరిస్థితి రావద్దన్నదే నా బాధ అన్నడు రసమయి.

అయితే, తాను స్వయంగా ఇంతవరకూ పాట గట్టలేదు. పాటను మార్చుకున్నడు. తాను పాడటానికి అనువుగా కాదు, ప్రజల చప్పట్లే తనకు కీలకం. ప్రజలచే చప్పట్లు కొట్టించేలా ఆ పాటను మార్చుకున్నడు. మొదలు, మధ్యమం, వెనకాల తాను అవసరమైన వ్యాఖ్యానం చేస్తడు. ఇది ఒక రకంగా తనకే ప్రత్యేకం. ఒకనాడు గద్దర్ వ్యాఖ్యానసహిత పాట విన్నం. తెలంగాణలో తనది విస్తతి. ఇందులో పాట తనది కాదు, మాట మాత్రమే తనది. అందులోనూ అవతలి పాటకు తాను మాటలు పేనడం ఒక ఒరవడి. ఆ మాటతోని పాటను పేలుస్తడు. ప్రజల్లో ఒక ఉత్తేజం పెంచుతడు. వాళ్లను ఉద్యమంలో లీనం చేయిస్తడు. అదీ తన నిర్మాణ పద్ధతి. నేను అన్ని పాటలూ పాడను. కొన్ని మాత్రమే పాడుత. ముఖ్యంగా ఆర్ధ్రంగా ఉన్న పాటలు పాడలేను అని అన్నడు రసమయి.

అందరు పట్టించుకున్నట్టు లేదుగని తాను కూడా కవిత్వం చెబుతడు. అయితే తాను అన్నట్టు వ్యంగ్యం నా ప్రధానాస్త్రం. పాటను తీసుకుని, దానికి రాజకీయ కోణం అల్లే మాటలు ఉపయోగిస్త. అట్లా నా కవిత్వం జొప్పిస్త అన్నడు. అయితే, నాకు నప్పని పాటల్ని తోటి ధూందాం గాయకులతో పాడించేది. నా బలహీనతను వాళ్ల బలం చేత అధిగమించేది. ఇక నేను పాడితే అందులో దరువు అవసరం లేని పాటను ఎంచుకునేది. చేతులే దరువు వేసేలా, చప్పట్లు కొట్టేలా చేసేవాడిని. ఇట్లా నాదైన ఒక నిర్మాణం ఉన్నది అని వివరించిండు రసమయి.

గంటలకు గంటలు సభలో కూచోపెట్టగల సమయస్ఫూర్తి కూడా తన కవి సమయం. అయితే, కవి రాసిన పాట ఒక్కటే తన గానంలో ప్రధానమైతే తాను గాయకుడే అయివుండేవాడు. కానీ. తాను వ్యూహకర్త. నిర్మాత. ముందే చెప్పినట్టు కాల్పనికతను జోడిస్తడు. నిజానికి అది వాస్తవికత. పాట కల్పనలాగా అయి తన కల్పన నిజం అయేలా చేసి కొద్దిసేపు ప్రేక్షకుల్లో అలజడి తెప్పిస్తడు. తర్వాతే పాటను వడివడిగా దించుతడు. ఈ నిర్మాణ పద్ధతిని మనం తాను పాడే ప్రతి పాటలో చూడవచ్చు.

ఒక కవి పాటను తాను పాడుతున్నప్పుడు గమకాలు...అరె.. ఛాల్... వంటివి జోడించడమే కాదు, ముందే చెప్పినట్టు వ్యాఖ్యానం బలంగా ఉంటది. విడిగా ఆ పాటకు రాజకీయ కోణం లేకుండొచ్చు. లేదా ముగింపులో తెలంగాణ ఉద్యమంలో లీనం కమ్మనే అంశ లేకపోవచ్చు. కానీ రసమయి జోడిస్తడు. అదొక ప్రయత్నం. అట్లే, ప్రతి పాటకు ఒక సన్నివేశాన్ని తాను రూపొందించి పెట్టిండు. దాన్ని నాటకీయంగా కవితాత్మకంగా వివరిస్తూ టక్కున పాట దగ్గరకు వస్తడు. పాట పూర్తయ్యే సమయంలో మళ్లొక ఉప సన్నివేశం జోడిస్తడు. తర్వాత పాట పూర్తవుతుంది. సభ యావత్తూ రోషంతో లేచి నిలబడుతుది. కొట్టుకొట్టుకొట్టు కొట్టుర కొట్టు అన్న పాటలో పటపట మని పండ్లు కొరుకడం. అది తానొక్కడే జేయడు. తన సన్నివేశ కల్పన, వ్యాఖ్యానంతో ఆ పాట విన్న సభికుడితోనూ పండ్లు పట పటా అనిపించేలా జేస్తడు. అదీ రసమయి కల్పన. పాటకు కల్పించిన రసం. తన కవి సమయం. అన్నకు అభినందనలు.


గల్లు గల్లు గల్లు గజ్జెల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లార

గవ్వల మోతో అన్నల్లార ఓ సెల్లెల్లార
పల్లవి: గల్లు గల్లు గల్లు గజ్జెల మోతో
అన్నల్లారా ఓ సెల్లెల్లార
గవ్వల మోతో అన్నల్లార ఓ సెల్లెల్లార
అరె...దగాపడ్డ తెలంగాణ దప్పుల మోతో 
అన్నల్లారా ఓ సెల్లెల్లార
దరువుల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లార
మండుతున్న గుండెలన్ని దండుగట్టి దరువేసి
ప్రతినబూనే తెలంగాణ పట్టాభిషేకానికి.. ఛల్
చరణం: ఓరుగల్లు ఖమ్మం మెట్టు కదులుతున్నదో 
అన్నల్లారా ఓ సెల్లెల్లార
సమ్మక్క సారక్క జాతరోలె హోరెత్తి
ఛల్... కరీంనగర్ సింగరేణి కదులుతున్నదో 
అన్నల్లారా ఓ సెల్లెల్లార
జగిత్యాల మెట్‌పల్లి జై గంటలు మోగిస్తూ 
అన్నల్లారా ఓ సెల్లెల్లార

గల్లు గల్లు గల్లు గజ్జెల మోతో
అన్నల్లారా ఓ సెల్లెల్లార

ఇంద్రవెల్లి గొండన్నల గుండె తుడుం మోగిస్తూ
ఆదిలాబాద్ అడవులల్ల అగ్గి బుట్టెనో 
అన్నల్లారా ఓ సెల్లెల్లార
గల్లు గల్లు గల్లు గజ్జెల మోతో
అన్నల్లారా ఓ సెల్లెల్లార
నిజామాబాద్ నీల్ల కొరకు
నిప్పు బుట్టెనో అన్నల్లారా ఓ సెల్లెల్లార
నిలువెత్తు మోసాలతో నీల్ల కొరకు తల్లడిల్ల
మెదక్ జిల్లా పల్లెటూల్ల మెరుపు బుట్టెనో 
అన్నల్లారా ఓ సెల్లెల్లార
పొద్దు పొడుపు గొంతులోన యుద్ధభేరి మోగిస్తూ

గల్లు గల్లు గల్లు గజ్జెలమోతో
అన్నల్లారా ఓ సెల్లెల్లార

అరె..నల్లగొండా జిల్లాలోన నగారమ్రోగే 
అన్నల్లారా ఓ సెల్లెల్లార
బోనగిరి ఖిల్లామీద పులిబిడ్డల పొలికేకలు
పాలమూరు కూలి జనం ప్రతిన భూనెరో 
అన్నల్లారా ఓ సెల్లెల్లార
కన్నతల్లి తెలంగాణ కన్నీల్లు తుడవనీకి
హైద్రాబాద్ రంగారెడ్డి రంగామెక్కెనో 
అన్నల్లారా ఓ సెల్లెల్లార
తెలంగాణ వచ్చెవరకు తెల్లవారనీయమంటూ

ఛల్...అరె... గల్లు గల్లు గల్లు గజ్జెల మోతో
అన్నల్లారా ఓ సెల్లెల్లార 
గానం రసమయి, 94408 59200 
రచన అంద్శై

కందుకూరి రమేష్ బాబు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]